తిరుపతి: రాష్ట్రంలో వరదలు మానవ తప్పిదం వల్లే వచ్చాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్‌మెంట్ తెలియదని.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఆయన బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాపానాయుడుపేట వద్ద ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. గొలుసుకట్టు చెరువులు ఉంటాయని.. వాటిలోకి వరద రాకముందే నీటిని విడిచిపెట్టాల్సి ఉంటుందన్నారు. అలా చేయని పక్షంలో మిగతా చెరువుల్లోనూ నీరు నిండిపోయి వరదలు వచ్చే ప్రమాదముంటుందని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రాత్రిళ్లు కూడా పనిచేసి కలెక్టర్లను క్షేత్రస్థాయికి పంపి నియంత్రణ చర్యలు చేపట్టామని చంద్రబాబు గుర్తు చేశారు. వరద బాధితులు, మృతుల కుటుంబాలకు సాయం అందే వరకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కుప్పంలో దౌర్జన్యం చేసి గెలిచారు
రౌడీయిజం చేసి కుప్పం మున్సిపాలిటీని వైకాపా గెలిచిందని.. దాన్ని ఇప్పుడు పెద్ద ఇష్యూ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. చిన్న కుప్పం పట్టణంలో అక్రమాలు చేసి మొనగాళ్లమని విర్రవీగుతున్నారని.. దొంగ ఓట్లు వేసి దౌర్జన్యంగా గెలిచారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడే బాధ్యత ప్రజలపైనే ఉందని చెప్పారు. ఎవరి కోసం తెదేపా పోరాడుతుందో 5 కోట్ల ప్రజలు ఆలోచించాలన్నారు. తాను కంపెనీలు తెస్తే వీళ్లు దందాలు చేస్తున్నారని.. ఇలాంటి ఉన్మాదులతో పోరాడాలా? అని ప్రశ్నించారు. రూ.వేలకోట్లు అక్రమంగా సంపాదించి ఎన్నికల్లో అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నా
తెదేపా 22 ఏళ్లు అధికారంలో ఉన్నా తన సతీమణి ఏనాడూ బయటకు రాలేదని.. అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా నేతలు మాట్లాడారని విమర్శించారు. 40 ఏళ్లులో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నానని చెప్పారు. అలిపిరిలో తన కారుపై మందుపాతర పేలినా భయపడలేదని.. తన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డానన్నారు. కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చేశానని.. ప్రజల వద్దకు వెళ్లి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పానని తెలిపారు. తప్పుడు పనులు చేసేవారిని వదిలిపెట్టనని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వైకాపా పెట్టిన అక్రమ కేసులపై విచారణ చేసి బాధ్యులను శిక్షిస్తామన్నారు.