– సర్వే నంబర్ల వారీగా వివరాలను సమర్పించండి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
భవిష్యత్తులో బుడమేరు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని.. ఈ నేపథ్యంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్, వీఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి సర్వే నంబర్లతో సహా ఆక్రమణలకు సంబంధించి పూర్తినివేదిక సత్వరం సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. ఇందులో భాగంగా ఆక్రమణల గుర్తింపునకు తొలిదశలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సృజన.. శుక్రవారం సర్వే, భూ రికార్డులు, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల బుడమేరు పరీవాహక ప్రాంతంలో కురిసిన కుంభవృష్టితో ఊహించని విధంగా పెద్దఎత్తున దాదాపు 40 వేల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో గండ్ల ద్వారా వచ్చిన నీటితో పరిసర లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు జలమయం కావడంతో పాటు నగరంలోని రెండు లక్షలకు పైగా కుటుంబాలు ముంపుతో తీవ్రనష్టాన్ని చవిచూడటం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు పది రోజులకు పైగా కలెక్టరేట్లోనే ఉండి.. బుడమేరు గండ్లను పూడ్చడం, బాధితులను పరామర్శించి, పూర్తి సహాయసహకారాలు అందించారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఆపరేషన్ బుడమేరును ప్రకటించారని.. ఈ నేపథ్యంలో బుడమేరు ఆక్రమణలకు సంబంధించిన నివేదికలను రూపొందించాల్సిన అవసరముందన్నారు. యుద్ధప్రాతిపదికన ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం సిద్దమవుతోందని.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆక్రమణల తొలగింపునకు శ్రీకారంచుట్టనుందని ఈ నేపథ్యంలో ఆక్రమణల వాస్తవ వివరాలను సర్వే నంబర్లతోసహా సమర్పించాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో రెవెన్యూ, మునిసిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఆక్రమణలపై నివేదిక రూపొందించాలని సూచించారు. వరద నీరు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆక్రమణల తొలగింపుతో పాటు పూడిక తీయడం కూడా ముఖ్యమన్నారు. బుడమేరు డైవర్సన్ ఛానల్ (బీడీసీ)కు గండ్లు పడకుండా కట్టను పటిష్టపరచడం కూడా కీలకమని.. వీటికి సంబంధించి ఇప్పటికే పనులు జరుగుతున్నాయని కలెక్టర్ సృజన వివరించారు.
సమావేశంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసు, నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.