‘ఎక్స్‌పెరిమెంట్ కింగ్’ అనే యూట్యూబ్ ఛానల్ ప్రయోగం
(వాసు)
ఐ ఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ, దాని ఖరీదు చూసి కొనడానికి సామాన్యులు వెనుకాడుతుంటారు. అదే ఓ బిచ్చగాడు ఐ ఫోన్ కొనడానికి వెళ్తే షాప్ నిర్వాహకులు అతణ్ని ఎలా చూస్తారు? ముందు లోపలికి రానిస్తారా? మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అంగీకరిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఓ ప్రయోగం చేశారు ‘ఎక్స్‌పెరిమెంట్ కింగ్’ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు.
వారిలో ఒకరు బిచ్చగాడి వేషం వేసుకొని తొలుత జోధ్‌పూర్‌లో కొన్ని మొబైల్ షోరూంలు తిరిగాడు. కొందరు లోపలికి రానివ్వకపోగా.. మరికొందరు చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు. చివరగా ఓ షాపు యజమాని చిల్లర తీసుకొని తనకు ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్‌ను అందజేశాడు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదో ప్రాంక్ అని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయాడు.
ఈ వీడియో క్లిప్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. బిచ్చగాడు ఐ ఫోన్ కొనడమేంటని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ‘షాపు యజమానికి కస్టమరే దేవుడు. అందుకే చిల్లర తీసుకొని మరీ ఐ ఫోన్ ఇచ్చేశాడని’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఐ ఫోన్ కొన్న వ్యక్తి ముంబయిలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహించి ఉంటాడని, అందుకే అంత చిల్లర వచ్చిందని’ మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ఇవన్నీ పాత స్టంట్స్ అని, స్క్రిప్టు రాసుకొని కొత్తగా ఏమైనా ట్రై చేయండని’ మరో నెటిజన్ సలహా ఇచ్చాడు.