• నెలరోజుల్లోనే పెండింగ్ డీఏలన్నీ చెల్లిస్తాం
• పీఆర్సీని నియమిస్తాం… 317జీవోను సవరిస్తాం…
• కేబినెట్ లో పీఆర్సీసహా ఉద్యోగుల సమస్యలపై ఎందుకు చర్చించలేదు?
• రాష్ట్రంలోని అప్పులన్నీ తీరాలంటేనే బీజేపీతోనే సాధ్యం
• బీజేపీ లేకుంటే ఉద్యోగులకు 3 నెలలకోసారి జీతాలిచ్చే పరిస్థితి
• ఒక్కో ఉపాధ్యాయ సంఘానికి రూ. 5 కోట్ల ఇచ్చి ఓట్లను కొనేందుకు యత్నం
• ఒక్కో ఓటుకు రూ.20 వేలిస్తున్నట్లు ప్రచారం చేస్తూ టీచర్ గౌరవాన్ని దెబ్బతీస్తున్న బీఆర్ఎస్
• పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కడం ఖాయం…
• ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి
• ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ సత్తా చూపండి.. కేసీఆర్ చెంప చెళ్లుమన్పించండి
• ఉపాధ్యాయ – అధ్యాపక అత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
‘‘బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది. పెండింగ్ డీఏలన్నీ నెలలోనే ఇస్తాం. వెంటనే పీఆర్సీ వేస్తాం… 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే ఉద్యోగులకు 3 నెలలకోసారి జీతాలిస్తారని… మరో రూ. 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయిస్తాడని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఓటేయాలని కోరారు. జీతాలియ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో ఉన్న కేసీఆర్ కు టీచర్ల సత్తా ఏమిటో చూపించాలని పిలుపునిచ్చారు. ఓటనే ఆయుధంతో కేసీఆర్ చెంప చెళ్లమన్పించాలని కోరారు.
కొంపల్లిలో జరుగుతున్న ‘‘ఉపాధ్యాయ – అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం’’లో బండి సంజయ్ తోపాటు మాజీ ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్రరావు, బి.మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, మోహన్ రెడ్డి, కార్యదర్శులు కొల్లి మాధవి, జయశ్రీ, జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
మీ అందరి ఆశీర్వాదంతో మోదీ ఆధ్వర్యంలో రామరాజ్యం రాబోతోంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించి మాత్రమే కావు.. అసెంబ్లీ ఎన్నికల వరకు మరే ఎన్నికల్లేవు.. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయి. తెలంగాణలో పేదలు పడుతున్న బాధలను గుర్తు చేసుకుని ఓటేయండి. గత పాలకులు ముఖ్యంగా సీఎం నోట ఏ మాట వచ్చినా కచ్చితంగా అమలయ్యేది. కానీ కేసీఆర్ నోట ఏ మాట వచ్చినా ఇక అంతే సంగతులు. పంజాబ్ కు చెక్కులు పంచితే చెల్లలేదు. పాకిస్తాన్, శ్రీలంక, చైనా గురించి గొప్పగా మాట్లాడితే.. ఆ దేశాలు అడుక్కునే తినే స్థాయికి వచ్చాయి. ఇయాళ కేబినెట్ లో ఇండ్ల జాగా ఉన్న 4 లక్షల మందికి రూ.3 లక్షలు చొప్పున ఇస్తాడట.. దళిత బంధు ఇస్తాడట…నిలువ నీడ లేని పేదోళ్లకు ఇండ్లు కట్టియ్యని కేసీఆర్ …ఆ డబ్బులు ఇస్తానంటే నమ్మేదెవరు?
కేబినెట్ మీటింగ్ లో టీచర్ల సమస్యలనే కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరం. పీఆర్సీ ఊసే లేదు. కేసీఆర్ కు టీచర్లపట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అర్ధమైతుంది. కసితో బీఆర్ఎస్ ను ఓడించండి. ఈసారి ఏవీఎన్ రెడ్డి గెలవకపోతే పీఆర్సీ వేయరు. రెండు, మూడు నెలలకోసారి జీతాలు ఇస్తాడు. డీఏలు ఇవ్వడు. 317 జీవోతో చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తూనే ఉంటాడు.. దయచేసి అన్నీ ఆలోచించి ఓటేయండి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదు. పార్లమెంట్ లో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు.
కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు…. నన్ను కెలకాలనుకుంటున్నడు… నేను ఊరుకుంటనా… అంతకంటే ఎక్కువ కెలుకుతా.. నామీద 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందిని పెట్టిండు.. కేసీఆర్ బిడ్డ మీద ఈడీ, సీబీఐ విచారణలు చేస్తుంటే మాత్రం స్పందిస్తారు…. మరి ఇతరుల మీద ఆరోపణలు వస్తే ఎందుకు స్పందించలేదు? కవిత మహిళా బిల్లుపై చేస్తున్న దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డ చేసిన దొంగ సారా దందావల్ల తెలంగాణ ప్రజలు తలదించుకునే దుస్థితి.తెలంగాణ వచ్చినాక ఏం ఒరిగింది? 2014కు ముందు మద్యం ద్వారా రూ.10 వేల కోట్లు మాత్రమే వస్తే… కేసీఆర్ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి రూ.40 వేల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నరు. అయినా తెలంగాణ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని దుస్థితి.
కోవిడ్ తో ప్రపంచమంతా అల్లకల్లోలమైన సమయంలో భారత్ మాత్రం స్థిరంగా ఉంటూ ఆర్దికంగా 5వ స్థానంలో నిలిచింది. 2047 నాటికి నెంబర్ వన్ స్థానానికి చేరుకోబోతోంది. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించి ప్రాణాలు నిలిపిన ఘనత మోదీదే. నరేంద్రమోదీ ప్రభుత్వం గత మూడు నెలల్లో 2.16 లక్షల ఉద్యోగాలిస్తే… కేసీఆర్ మాత్రం ఇంటికో ఉద్యోగమని ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. దళిత బంధు, రుణమాఫీ, ఫ్రీ యూరియా, నిరుద్యోగ భ్రుతి హామీలు అమలు చేయలే.. చివరకు ఫస్ట్ నాడు కూడా జీతాలు ఇయ్యలేని దుస్థితి. జీతాలియ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో కేసీఆర్ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల సత్తా ఏమిటో కేసీఆర్ కు రుచి చూపించాలి.
బీజేపీ అధికారంలోకి వస్తే ఫస్ట్ నాడు జీతాలిచ్చే బాధ్యత మాది. పెండింగ్ డీఏలన్నీ నెలలోనే ఇస్తాం. వెంటనే పీఆర్సీ వేస్తాం… 317 జీవోను సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేస్తాం. 317 జీవోను సవరించాలని నేను దీక్ష చేస్తే నా ఆఫీస్ ను గ్యాస్ కట్టర్లు పెట్టి ధ్వంసం చేశారు. మాపై దాడులు చేశారు. లాఠీఛార్జ్ చేశారు. జైల్లో వేశారు. అయినా ఏ ఉపాధ్యాయ సంఘం కూడా కేసీఆర్ కు భయపడి కనీసం మద్దతివ్వలే. అయినా మేం భయపడలేదు. మేం టీచర్ల పక్షాన కొట్లాడినం.
ఈరోజు 317 జీవో వల్ల టీచర్లు, ఉద్యోగులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందంటే… అది బీజేపీ చేసిన పోరాటాలవల్లనే. రైతులు, నిరుద్యోగులు, దళిత, గిరిజనుల పక్షాన నిరంతరం ఉద్యమిస్తూ జైలుకు పోతున్న పార్టీ బీజేపీ మాత్రమే.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పులన్నీ తీరాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీయే రాష్ట్రంలోనే అధికారంలోకి వస్తేనే సాధ్యం. పొరపాటున మళ్లీ కేసీఆర్ గెలిస్తే మరో రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అడుక్కునే తినే దుస్థితికి తీసుకొస్తాడు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పీఆర్సీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేబినెట్ లో ఎందుకు చర్చ జరగలేదని ఎందుకు నిలదీయడం లేదు? డీఏలు ఎందుకు ఇవ్వడం లేదు? ఫస్ట్ తారీఖున జీతాలెందుకు ఇవ్వడం లేదని ఎన్జీవో నాయకులు ఎందుకు అడగడం లేదు? కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ… కేసీఆర్ పెట్టే విందు భోజనాలకు తలొగ్గి ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారు. ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి కేసీఆర్ చెంప చెళ్లుమన్పించేలా తీర్పు ఇవ్వండి. బీజేపీకి ఒక్క అవకాశమివ్వండి.