Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు-పవన్‌ కలిశారంటే మా పార్టీ పని అవుట్

-పార్టీలకతీతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించాలని కంకణం కట్టుకున్న ప్రజలు
-అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పరిస్థితి అద్వానమే
-సాక్షి రాతల్లో సింగల్ సింహం బేలతనం కనిపిస్తోంది
-హైకోర్టు తీర్పు అమరావతి రైతులకు అనుకూలంగా వస్తుంది
-ఎటువంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడని మార్గదర్శి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిశాయంటే, మా పార్టీ పని అవుట్. బంగాళాఖాతంలో కలిసిపోతాం. తమకు విశాలమైన తీర ప్రాంతం ఉన్నదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటారు. ఆ తీర ప్రాంత గర్భంలో తమ పార్టీ కలిసి పోవడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు స్థానికంగా బలం కలిగిన ఐదారు మంది నాయకులు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలవవచ్చు. ఇప్పటికీ రాయలసీమలో తమ పార్టీకి ఎంతో కొంత బలం ఉంది. అక్కడ కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే, తమ పార్టీ పరిస్థితి అద్వానమే. అవినాష్ రెడ్డి అరెస్టుపై దాగుడుమూతల దాంపత్యం కొనసాగుతున్నప్పటికీ, 24 గంటలలో, లేదంటే 48 గంటలలో ఆయన్ని సిబిఐ అరెస్టు చేయడం ఖాయమేనని అన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమం రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిస్తే తమ పార్టీకి భవిష్యత్తు లేదు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. అది తమ దురదృష్టం… తమ పార్టీ దురదృష్టం. మమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు.

ఆదినారాయణ రెడ్డి మాట్లాడింది తప్పయితే… సోము వీర్రాజు మాట్లాడింది కూడా తప్పే
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి బిజెపి పోటీ చేస్తుందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తప్పయితే, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు కూడా తప్పే నని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ఎవరి అభిప్రాయాన్ని వారు చెబితే నోటీసులు ఇస్తామని కొందరు నాయకులు పేర్కొన్నారు. టిడిపి తో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని బిజెపికి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. టిడిపి తో కలిసి పోటీ చేసేది లేదని వీరికి ఎవరు చెప్పారు. ఢిల్లీ పెద్దలు చెప్పారా?. గుంటూరులో ఇటీవల జరిగిన సమావేశంలో పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని, జాతీయ నాయకత్వం చూసుకుంటుందని బిజెపి జాతీయ నాయకులు స్పష్టం చేయడం జరిగిందని రఘు రామకృష్ణంరాజు గుర్తు చేశారు.

ప్రజల కోసం కలిసిన పార్టీలు కొన్నిచోట్ల ఒకరు, మరికొన్ని చోట్ల మరొకరు పోటీ చేస్తే, అన్ని పార్టీల ఓట్లు కలిసిపోతాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోని ఫలితాలే పునరావృత్తమవుతాయి. రానున్న ఎన్నికల్లో రెండవ స్థానంలో తన ప్రస్తుత పార్టీ ఉంటుంది. కచ్చితంగా ప్రజలను గెలిపించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీల గెలుపు ముఖ్యం కాదు. రాష్ట్రంలో నరకం అనుభవిస్తున్న ప్రజలు గెలవాలి. క్షేత్రస్థాయిలో ఇప్పటికే టిడిపి, జనసేన కార్యకర్తలు కలిసిపోయారు. నాయకులు కలవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత ప్రయోజనాల సిద్ధాంతం కోసం కొంతమంది అటు టిడిపి, ఇటు జనసేన పార్టీలలోనూ పొత్తు వ్యతిరేకించేవారు లేకపోలేదు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా నరసాపురం నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయన్నారు. క్యాడర్ ఎప్పుడో కలిస్తే, లీడర్లు ఇప్పుడు కలిశారు.

మా పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది
రాష్ట్రం లో తెలుగుదేశం, జనసేన కలిస్తే మా పార్టీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. ఆ రెండు పార్టీలు కలవనున్నాయని, దానికి సాక్షి దినపత్రిక రాతలే నిదర్శనం. రాష్ట్రం లో పొత్తుల గురించి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట చెల్లుబాటు అవుతుందా?, ఢిల్లీ పెద్దల మాట చెల్లు బాటు అవుతుందా? అన్నది త్వరలోనే తేలి పొనుంది. రాష్ట్ర బిజెపి నాయకులతో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కమ్యూనికేషన్ సరిగ్గా లేదన్నది నిజమే. పవన్ కళ్యాణ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధానమంత్రి ప్రత్యేక ఆహ్వానంపై ఆయన్ని విశాఖపట్టణంలో కలిశారు. బీజేపీ జాతీయ నేతలతో కలిసి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ ది. పవన్ కళ్యాణ్ తనతో టచ్ లో లేరని సోము వీర్రాజు చెప్పకనే చెప్పారు. అది ఆయన మంచితనం… భోళాతనం. ఢిల్లీ పెద్దలను కలిసి పవన్ కళ్యాణ్ చేతలతో చెబితే, నాదెండ్ల మనోహర్ మాటలతో చెప్పారు. రాష్ట్రంలో గతం లో 50 % ఓటు బ్యాంక్ ఉన్న తమ పార్టీ ఓటు బ్యాంకు ఇప్పుడు గణనీయంగా తగ్గింది. టీడీపీ కి కష్టకాలములోనూ 40% ఓటు బ్యాంకు ఉండగా, ఇప్పుడు ఆ పార్టీ ఓటు బ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉంది. టిడిపి ఓటు బ్యాంకు తో పాటు , జనసేన, బిజెపిల ఓటు బ్యాంకు కూడా కలిస్తే మంచిదే. ప్రధాన ప్రతిపక్షం తో పాటు, రెండవ ప్రతిపక్షం కూడా కలిస్తే ప్రజలకు. ప్రయోజనం. మిగతా పార్టీలు కలిసిన కలవక పోయినా పెద్దగా ఫరక్ పడదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను పోలీస్ శాఖలోకి తీసుకువచ్చిన ఘనత జగన్ దే
పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలను, రాష్ట్ర పరిపాలన విభాగం, పోలీస్ శాఖలోకి తీసుకువచ్చిన నిజమైన ఘనత జగన్మోహన్ రెడ్డి దే. రాష్ట్రంలో ఎక్కడ చూసి కక్ష రాజకీయాలను కొనసాగిస్తున్నారు. కమర్షియల్ టాక్స్ ఉద్యోగ సంఘాన్ని రద్దు చేయాలని చూడడం దారుణం. అలాగే అమరావతి పై కక్ష సాధింపుతో 1130 ఎకరా లను రాష్ట్రంలోని పేదలకు పంచుతామని అంటున్నారు. ఇప్పటికే పూర్తి అయిన 5000 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర రాజధాని అమరావతిలో మాత్రం గుడిసెలు వేసుకోవడానికి 1130 ఎకరాలను కేటాయిస్తాననడం దారుణం. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమిటో న్యాయమూర్తులకు అర్థం కాదా?, ఒక న్యాయమూర్తి ఈ కేసు విచారణ చేస్తున్న బెంచ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. ఆయనపై ఎంతో ఒత్తిడి ఉంటే తప్పితే, ఈ నిర్ణయం తీసుకొని ఉండరు. తమ బంగారం మంచిది కాదు కాబట్టే, న్యాయమూర్తి బెంచ్ నుంచి తప్పుకోవాలని భావించి ఉంటారు. రాష్ట్ర హైకోర్టులో అమరావతి రైతులకు అనుకూలంగానే తీర్పు వెలువడుతుందని రఘురామ కృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

బాబు, పవన్ కళ్యాణ్ పై పడి ఏడ్చిన సాక్షి దినపత్రిక
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడాన్ని సాక్షి దినపత్రిక జీర్ణించుకోలేక పోయింది. అది ఎవరి ఏడుపో ప్రజలందరికీ తెలుసు. గతంలో దమ్ముంటే అందరూ కలిసి రండి అని చెప్పిన సింగల్ సింహం ఎందుకో వణుకుతోంది. ఏమిటి ఈ బేళతనం. తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఉండకూడదని చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ప్రజా సమస్యల గురించి చర్చించుకొని, ప్రజల కోసం కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వ కూడదని నిర్ణయించు కున్నారు.
కంపెనీ చట్టం తెలిసినవాడిగా చెబుతున్న… ప్రతి కంపెనీ ఒకటే బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. కంపెనీ చట్టం గురించి తెలిసినవాడు చెబుతున్నానని, ప్రతి కంపెనీకి ఒకటే బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. మార్గదర్శి కంపెనీ కి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వేరు వేరు బ్యాలెన్స్ షీట్ ఉండాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐ జీ రామకృష్ణ పేర్కొనడం హాస్యాస్పదం.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంపెనీలు పెట్టడంతో పాటు, ఎన్నో షెల్ కంపెనీలను కూడా స్టార్ట్ చేశారు. ఆయనకు కంపెనీకి ఎన్ని బ్యాలెన్స్ షీట్ లు ఉంటాయో తెలియదా?
బ్యాలెన్స్ షీట్ ఆర్ ఓ సి లో సమర్పిస్తారు. ఆ విషయము బుద్ధి, జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి బ్యాలెన్స్ షీట్ ప్రత్యేకంగా సమర్పించమని చెబుతున్నారంటే వారికి బుద్ధి జ్ఞానం లేదేమోనని అనుమానం కలుగుతుంది.అలాగే హిందూ అన్ డివైడ్ ఫ్యామిలీ (హెచ్ యు ఎఫ్) ప్రకారం, మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ లోను ప్రొప్రైటర్ హోదాలో సంతకాలను పెట్టి డబ్బులు తీసుకున్నారని, ఇది చట్ట విరుద్ధమని కొంతమంది చట్టం తెలియని వ్యక్తులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. హెచ్ యు ఎఫ్ లో ప్రోప్రైటర్ హోదా చట్ట ప్రకారమే ఉన్నప్పటికి, అప్పట్లో ఆనాటి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను గౌరవించి మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట అప్పటివరకు వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చివేయడం జరిగింది. అలాగే ఆ సంస్థ ను మూసి వేశారు. మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లకు చెక్ పవర్ ఇవ్వాలని చెప్పడానికి రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజి ఎవరు?. బ్రాంచ్ మేనేజర్ తీసుకునే డబ్బులకు మార్గదర్శి సంస్థ బాధ్యత వహిస్తుంది కదా. మార్గదర్శి సంస్థ డిపాజిట్లను సేకరించడం లేదు.

చిట్టి పాడుకున్న వారు, గ్యారెంటర్లను తీసుకురాలేక కొంత మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ గా సంస్థ వద్ద పెడుతున్నారు. ఆ మొత్తానికి మార్గదర్శి సంస్థ వడ్డీ చెల్లించవలసిన అవసరం లేకపోయినప్పటికీ, వడ్డీ చెల్లిస్తోంది. ప్రతి బ్రాంచ్ లో నూతన చిట్టిని స్టార్ట్ చేసేటప్పుడు, స్థానిక సబ్ రిజిస్టార్ వద్ద మార్గదర్శి సంస్థ సెక్యూరిటీ డిపాజిట్ ను పెట్టే ప్రారంభిస్తుంది. గత ఏడాది నవంబర్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు పదే పదే మార్గదర్శి సంస్థ శాఖలపై దాడులు చేసి సిఐడి పోలీసులు వారి వ్యాపారాన్ని నష్టపరుస్తున్నారు తప్పితే, ఇప్పటివరకు ఒక్క ఆధారాన్ని సేకరించలేకపోయారు. సిఐడి పోలీసుల దాడుల వల్ల మార్గదర్శి సంస్థ , గత ఆరు నెలలుగా నూతన చిట్టి లను స్టార్ట్ చేయలేకపోయింది.

దీనితో, చందాదారులు ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి, ఈ నాలుగేళ్ల పాటు మార్గదర్శి సంస్థ తప్పు చేసి ఉంటే, వ్యాపార కార్యకలాపాలను ఎందుకు నిర్వహించనిచ్చారు. మార్గదర్శి సంస్థ ఎటువంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదు. మార్గదర్శి సంస్థ ఆడిటర్ శ్రావణ్ ను అరెస్టు చేసిన సిఐడి పోలీసులు, గతంలో స్టాంప్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజిగా వ్యవహరించిన అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి తన కక్ష సాధింపు కోసం భవిష్యత్తులో మార్గదర్శి చందాదారులకు కూడా నోటీసులు ఇచ్చి, మీ ఆదాయ మార్గాలు చెప్పాలని కోరుతారట. ఇటువంటి వ్యక్తులు ఉండడం దురదృష్టకరమని రఘురామకృష్ణం రాజు అన్నారు.

రామోజీరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి
ఈనాడు దినపత్రిక అధినేత, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావును సిఐడి పోలీసులు విచారిస్తున్న సందర్భంగా తీసిన వీడియో ఒక సోషల్ మీడియా ఛానల్ లో ప్రసారం కావడం పై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. విచారణ అధికారి తాను సేకరించిన ఆధారాలను బహిర్గతం చేయవద్దని న్యాయస్థానాల తీర్పులు స్పష్టంగా ఉన్నాయి. అయినా, రామోజీరావును సీ ఐ డి విచారిస్తున్న వీడియో బహిర్గతం కావడం పై ఆయన సిఐడి పోలీసులపై, టెలికాస్ట్ చేసిన ఛానల్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షతోనే వేధిస్తున్నారు. తన సోదరుడిని న్యాయవాదుల సమక్షంలో విచారించాలని సిబిఐ ని కోరిన జగన్మోహన్ రెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులను కుటుంబ సభ్యులు కూడా చూడడానికి అనుమతించలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పై దివంగత నేత ఎర్రం నాయుడు కోర్టు లలో కేసులు వేశారు. ఇప్పుడు తన చేతిలో అధికారం చేతిలో ఉందని జగన్మోహన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు కక్ష తీర్చుకుంటున్నాడు. సిఐడి పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం, ఆదిరెడ్డి అప్పారావు, వాసు లకు 41 ఏ నోటీసు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉండగా, ఇవ్వకుండానే అరెస్టు చేసినప్పటికీ, మెజిస్ట్రేట్ కూడా ప్రశ్నించకపోవడం మిస్మయాన్ని కలిగించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

LEAVE A RESPONSE