Suryaa.co.in

Andhra Pradesh

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే?.. పీకే టీం స‌ర్వే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ వ్య‌వ‌హ‌రిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ భారీ విజ‌యం వెన‌క పీకే వ్యూహం దాగివుంది. ఇప్పుడు ఆయ‌న నేరుగా ప‌నిచేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ ప‌రోక్షంగా సేవ‌లందిస్తున్నారు.

ఆయ‌న స‌న్నిహితుడు రుషిరాజ్ సింగ్ ఆధ్వ‌ర్యంలోని ఐప్యాక్ టీం వైసీపీ కోసం ప‌నిచేస్తోంది. వివిధ ర‌కాల అంశాల‌పై ప్ర‌తి మూడునెల‌ల‌కు స‌మగ్రంగా స‌ర్వే చేసి ప్ర‌భుత్వానికి నివేదిక‌లందిస్తుంటుంది.

తాజా సర్వే నివేదికను సీఎంకు అందజేసిన పీకే టీం★ ముఖ్య‌మంత్రి ప‌నితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేల గురించి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లేమ‌నుకుంటున్నారు? ఏ ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంది? ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల స్పంద‌న‌… ఇలా ప‌లు అంశాల‌పై స‌ర్వే జ‌రుగుతుంటుంది. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో స‌మ‌యంతో ప‌నిలేకుండా స‌ర్వే జ‌రుగుతుంటుంది.

తాజాగా ఇప్ప‌టికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్థితి ఏమిటి? అనే అంశంపై స‌ర్వే నిర్వ‌హించి నివేదిక‌ను ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డికి అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది.

45 మందిపై తీవ్ర వ్యతిరేకత
 పీకే టీం నివేదిక ప్రకారం జగన్ కాకుండా మిగిలిన 150 మంది ఎమ్మెల్యేల్లో 45 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉంద‌ని, వారికి రాబోయే ఎన్నిక‌ల్లో సీటివ్వ‌కూడ‌ద‌ని వైసీపీ అధిష్టానానికి స్పష్టంగా తెలియజేసింది.

20 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు త‌గాదాలు ఎక్కువగా ఉన్నాయని, అర్బ‌న్ ప్రాంతాలు, నిరుద్యోగులు, వ్యాపార వ‌ర్గాలు, రైతులు, ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని, కాక‌పోతే అంత తీవ్రస్థాయి వ్యతిరేకత కాదని తెలిపింది. ఆయా చోట్ల వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేదానిపై కొన్ని సూచనలు చేసింది.

89 ఖాయమని చెప్పింది
 ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి 38 నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తాయ‌ని, కోస్తాలో 26, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 10, ఉత్త‌రాంధ్ర‌లో 15 సీట్ల‌లో విజ‌యావ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను 89 నుంచి 100 లోపు వైసీపీ సాధిస్తుంద‌ని పీకే టీం తన నివేదికలో వెల్లడించింది. అయితే టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకొని పోటీచేస్తే రాజకీయ సమీకరణాలు మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తునిష్

LEAVE A RESPONSE