Suryaa.co.in

Andhra Pradesh

మళ్ళీ జగన్ వస్తే….రాజధాని భూములన్నీ అమ్మేస్తారు

వైకాపా ఎన్నికల మానిఫెస్టో పై బహుజన ఐకాస బాలకోటయ్య

అభివృద్ధి మాట లేని, ఉద్యోగ ఉపాధి అవకాశాల ఊసే లేని, రాజధాని ప్రస్తావన లేని 2024 ఎన్నికల మానిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. ఆయనకు మానిఫెస్టో అంటే కేవలం పిల్లలు కూడా నొక్క కలిగిన బటన్ నొక్కుడు మాత్రమే అని, అదే భగవత్ గీత అని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రవేశ పెట్టిన వైకాపా 2024 ఎన్నికల మానిఫెస్టోపై బాలకోటయ్య మండిపడ్డారు.

58 నెలల పరిపాలనలో రెండు లక్షల 72 వేల కోట్లు నవరత్నాల ద్వారా ఇచ్చానన్నదే ముఖ్యమంత్రి చెప్పే సందేశం అని, ఈ సొమ్ము ఎవరిది? ఎలా వచ్చింది? అనే అంశాలను మాత్రం ఆయన దాట వేశారని చెప్పారు. రాష్ట్రంలో ఐదేళ్ళలో లక్షా 20 వేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని, ఏటా 2 వేల కోట్ల ఇసుక అమ్మకాలు, ఏటా 50 వేల కోట్లు విద్యుత్ చార్జీల భారం, దాదాపు 11 లక్షల కోట్ల వివిధ రకాల అప్పుల బరువు మోశామని, వీటి ద్వారా మాత్రమే అరకొర రత్నాలను ఇచ్చారని చెప్పారు. రాబడి మార్గాలను ధ్వంసం చేసి, పోబడి మార్గాలు చెప్పటమే జగన్మాయ అని, అభివృద్ధి ప్రస్తావన లేకుండా డబ్బులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే, హరిశ్చంద్రుడిని నడిబజారులో వేలం వేసి అమ్మినట్లు, రాజధాని కోసం 28,881 మంది రైతులు ఇచ్చిన 34,423 ఎకరాలను గుత్త మొత్తంగా విక్రయించే ప్రమాదం లేకపోలేదని, అమరావతి రైతులు మరిచిపోవద్దని స్పష్టం చేశారు. రాజధాని భవిష్యత్తు ఇప్పటికీ బలిపీఠంపైనే ఉందని తెలిపారు. అధికారమే పరమావధిగా ముఖ్యమంత్రి నవ రత్నాలతో ప్రజలను మాయ చేస్తున్నారని, ఉద్యోగులకు జీతాలు, అంగన్వాడిలకు వేతనాలు, రాజధాని రైతులకు కౌళ్ళు, వృద్ధులకు సకాలంలో పింఛన్లు ఇవ్వకుండా, వేధించిన ముఖ్యమంత్రి పెంపు రత్నాల మానిఫెస్టో ను ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు.

తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందంగా మూడు రాజధానుల మూర్ఖపు నామస్మరణను ముఖ్యమంత్రి మరువలేదని, ఈ దుర్మార్గం రాష్ట్రానికి శాపంగా మారుతోందన్నారు. అమరాతిని ముఖ్యమంత్రి లేకుండా చేస్తే, రాష్ట్రం మూడు రాజధానులకు బదులుగా మూడు రాష్ట్రాలుగా విడిపోక తప్పదని, ప్రత్యేక మధ్యాంధ్ర రాష్ట్ర మహా ఉద్యమాన్ని తామే చేపట్టి తీరుతామని బాలకోటయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE