– ‘సమతా దేవుడి’ ముందు వనదేవతలెంత?
– వనదేవతలు ‘రియల్‌ఎస్టేట్ స్వామి’ ముందు ఎంత?
– టికెట్లు పెట్టే తెలివి గ్రామదేవతలకు లేదు మరి
– రాజగురువును తిడితే పాలకులను తిట్టినట్టే
– సర్వులూ సమానమేనన్న చినజీయరుకు వనదేవతలంటే చిన్నచూపెందుకు?
– సాములోరి వాచాలతపై ‘పువ్వుపార్టీ’ పెదవి విప్పదేం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆయన గురువులకే గుగ్గురువు లాంటోడు. విశిష్టాద్వైతుడు. సకల దేవతలూ ‘24 ఇంటూ 7’.. నిరంతర వార్తా స్రవంతిలా ఆయన భుజం మీద సేదతీరే నడిచే దేవుడు. శ్రీ వెంకటేశ్వరస్వామికే గురువయిన
సమతామూర్తికి ముద్దుల శిష్యుడాయన. తెలుగు రాష్ట్రాల్లో బడా స్వాములు, భూస్వాములు, దొరలు, దొరసానులు, సినిమా యాక్టర్లు, జర్నలిస్టులు, వారికి జీతాలిచ్చే ‘మీడియా కమ్ పొలిటికల్ స్వాము’లకూ ఆయనే ఇంటివెలుగు, కంటిదీపం. మహా ‘మహా’ భూస్వాములే ఆయనకు సాగిలబడతారు.
మరి అంత లావు సాములోరు.. ఏదో సరదాకు వనదేవతల గురించి ఏదో మాట్లాడితే ఎందుకీ రచ్చ? అన్నది ఆయన భక్తుల వాదన. ఏం? అంత పుంభావ సరస్వతి, నడిచే దేవుడు దేవతలపై కామెంటు చేశారో అనుకోండి. అంతమాత్రాన యాగీ చేయడమేనా? ఏం కాలేజీల్లో జంట్స్ లేడీస్‌పై కామెంట్లు చేయరా? ఇదీ అలాంటిదేనని ఎందుకు అనుకోరు? జీయరు చెప్పిందే రైటని అందరిలా జీ హుజూరు అనకుండా.. మా దేవతలపై అంతలేసి మాటలనడానికి సాములోరిది గుండెనా? హుసేస్‌సాగర్ చెరువా? అని మీదపడి గత్తరచేస్తారేంటి? పైగా ఆయనపై కేసు పెట్టాలి, రాష్ట్ర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తారా? ఎంత ధైర్యం?అన్నది తెలుగురాష్ట్రాల్లో ‘జెట్’ మాదిరిగా దూసుకువస్తున్న స్వామివారి భక్తశిఖామణుల ప్రశ్నాస్త్రాలు.
అబ్బే.. వీళ్ల యవ్వారం ఏమీ బాగోలేదు. పెద్ద పెద్ద ప్రధానులు, హోంమంత్రులు, కిషన్‌రెడ్లు, కేసీఆర్లు, జగన్లు, రామేశ్వర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకే దిశానిర్దేశం చేసే జీయరోల కంటే, గ్రామదేవతలు ఎక్కువా
ఏంది? తను మెయిన్‌స్ట్రీమ్ దేవుళ్ల ప్రతినిధి. వాళ్లేమో గ్రామదేవతలు. అసలు తనను అన్నేసి మాటలంటున్నారని జీయరు వారికి తెలిస్తే ఇంకేమన్నా ఉన్నా? కొంపకొల్లేరయిపోదూ? అగ్నిపర్వతం సినిమాలో కృష్ణ మాదిరిగా.. జీయరు స్వామి తలచుకుంటే పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. పైగా కల్వకుంట వారికీ- అయ్యోరి మధ్య అలకలే తప్ప, అంతా అనుకున్నట్లు పూర్తి స్థాయిలో యవ్వారం ఇంకా చెడలేదు కాబట్టి అదో ప్రమాదం. కాబట్టి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన జీయరు వారి ఆగ్రహానికి గురికాకుండా, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అన్నది లౌక్యం తెలిసిన వారి హితవు.
ఓకే..ఓకే.. ఇంతకూ సాములోరేమన్నారు? ‘‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ దేవతలా? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చిన వారా? ఏమిటీ చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. ఏదో గ్రామదేవత. చదువుకున్న వాళ్లు,
పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఆ పేర్లతో బ్యాంకులు పెట్టేశారు. అది ఇప్పుడు వ్యాపారమయింది’. ఇదేగా జీయరు చేసిన వ్యాఖ్యలు. దాన్ని తప్పు పట్టాల్సిన పనేంటి? ఆయన తన ‘ముచ్చింతల్ బిజినెసు’ను-అక్కడికి వచ్చే కాస్ట్లీ భక్తులు-వారిచ్చే కానుకలను దృష్టిలో పెట్టుకుని, సమ్మక్క-సారక్కతో పోల్చారు. భక్తి అయినా, ముక్తయినా, రాజకీయమయినా అంతా వ్యాపారమేనన్నది స్వామివారి కవిహృదయం కామోసు.
బహుశా సమ్మక్క-సారక్కతోపాటు, గ్రామదేవతలు తన ఆధ్మాత్మిక వ్యాపారానికి పోటీదారులని భావించి, సాములోరు అలా వ్యాఖ్యానించి ఉండవచ్చన్నది బుద్ధిజీవుల విశ్లేషణ. పైగా ఎలాగూ అన్నింట్లో కులాల ఆధిపత్యం ఉంది కాబట్టి.. గ్రామదేవతలంతా హిందువులయినా, ఈ వ్యవహారాన్ని కూడా ఆయన బ్రాహ్మిన్-నాన్ బ్రాహ్మిన్ కోణంలో దర్శించి ఉండవచ్చన్నది, కులవాదుల మరో విశ్లేషణ. పోనీ అలా అనుకున్నా సమ్మక్క-సారక్క ‘ముచ్చింతల్ బిజినెస్’కు ఎలాంటి పోటీదారులు కారు. వాళ్లు అయ్యప్ప, కనకదుర్గ మాదిరిగా ‘సీజనల్ దేవత’లే. వారికి వచ్చే ఆదాయం తక్కువ. అదీ ఏడాదికోపారి మాత్రమే.
కానీ ముచ్చింతల్‌లో కొలువుదీరిన చైనా మెటల్ సమతామూర్తి , రెగ్యులర్ గిరాకీ ఉండే ఆధ్మాత్మిక వ్యాపార కేంద్రం. దాని చుట్టు ముట్టూ ఉండే ల్యాండులకు ఉన్న గిరాకీనే వేరు. సమ్మక్క-సారక్క ఉండే అడవిలోకి వెళ్లి ఎవరు పెట్టుబడి పెట్టి భూములు కొంటారు? శబరిమలై కొండల్లో ఎవరు వెంచర్లు వేస్తారు? అదే ముచ్చింతల్ అనుకోండి. అదిప్పుడు ఓ టూరిజం ప్లేస్. ప్రధానులు, హోంమంత్రులు, ముఖ్యమంత్రులూ నడయాడే దర్శనీయ స్థలం. కాబట్టి, ‘చుట్టుపక్కల ఖాళీగా ఉన్న పొలాల్లో రియల్‌ఎస్టేట్ వెంచర్లు వేస్తే.. నా సామిరంగా.. ఆ అమ్మకాల్లో వచ్చే కిక్కే వేరప్పా’ అన్నది రియల్టర్ల వ్యాపార విశేషణ.
సాములోరు చెప్పింది నిజం. సమ్మక్క-సారక్క ఎవరు? బ్రహ్మలోకం నుంచి దిగిరాలేదు కదా? ఈ గ్రామదేవతలంతా ఎవరు? అన్న జీయరు వారి ‘విజ్ఞానపూరిత ప్రశ్న’లో బోలెడు అర్ధం-పరమార్ధం ఉంది. దాన్ని కనిపెట్టిన వాడే జ్ఞాని. తెలుసుకోని వాడు అజ్ఞాని. ముచ్చింతల్ సమతామూర్తి క్రేజ్, ఇమేజ్‌తో పోలిస్తే ప్రకృతి దేవతలెంత? తనదేమో టికెట్ కొని దేవుడిని చూపించే విశిష్టాద్వైత రేంజ్. ప్రకృతి దేవతలేమో పుణ్యానికి చూసే గుళ్లు. మరి ఇద్దరికీ తేడా లేదూ?! తన వద్ద వీవీఐల జాతర రోజూ ఉంటుంది. అక్కడేమో ఏడాదికి ఒక్కసారే కదా? తన వద్దకు వచ్చేవారు కాస్ట్లీ కానుకలతో వస్తారు. అక్కడేమో బెల్లం, అల్లమే కదా ఇచ్చేది? తనదగ్గరొకొస్తే కాంట్రాక్టులూ, పదవులూ, బోలెడన్ని కొత్త కొత్త పరిచయాలు. అక్కడికెళితే ఏమొస్తాయ్? ప్రధానులు, సీఎంలు తనదగ్గరకొస్తారు. మరి గ్రామదేవతల యవ్వారం అలా కాదుకదా? అక్కడికి అందరూ సామాన్యులే కదా వచ్చేది? వారు ఎన్ని కానుకలేస్తే ఒక విగ్రహం ఖర్చు వస్తుంది? .. బహుశా ఈ భావనతోనే స్వాములోరు గ్రామదేవతలనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసి ఉంటారు.
సమతామూర్తి ప్రియ శిష్యుడయిన సాములోరికి అంతా సమానమే. కాకపోతే ఆయనే కొందరికి మినహాయింపులిస్తుంటారు. అది కూడా లోక కల్యాణం కోసమే. ఢిల్లీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి-రామేశ్వర్‌తో వెళ్లి ప్రధానిని కలసి కార్డు ఇచ్చి, సమతామూర్తి విగ్రహ ఇనాగరేషన్‌కు రమ్మంటారు. ఇక్కడ బీజేపీ వాళ్లేమో రామేశ్వర్‌ను విమర్శిస్తారు. మరి కిషన్‌రెడ్డి ఆయనను తీసుకుని ఢిల్లీకి ఎలా తీసుకువెళతారన్న ప్రశ్నించిన వారు అమాయకుల కింద లెక్క. మోదీని కలిసిన సాములోరి టీము కాంగ్రెసోళ్ల దగ్గరకు వెళ్లదు.
సరే.. ‘నీ మైనో’గా పుట్టి, ఇండియాకొచ్చి పేరు మార్చుకున్న సోనియాగాంధీ అంటే ఫక్తు కిరస్తానీ కాబట్టి, ఆమెను పిలవలేదనుకుందాం. సర్వులూ సమానమేనన్న సమతామూర్తి శిష్యుడు కాబట్టి లెక్కప్రకారం ఆమెనూ పిలవాలి. కానీ ఈ మధ్య కొత్త భక్తుడి మాదిరిగా గుళ్లూ, గోపురాలు, యాగాలు కూడా చేస్తున్న రాహులబ్బాయికి ఎందుకు కార్డు ఇవ్వలేదు? పోనీ.. ఢిల్లీలో బోలెడు మంది ఆస్తికులయిన లీడర్లే ఉన్నారు కదా? వారి వద్దకు ఎందుకు వెళ్లలేదు? ఇన్విటేషన్ కార్డులు బీజేపీ వారికే ఎందుకిచ్చారు? సరే.. కాసేపు దాన్నీ వదిలేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, రేవంత్‌రెడ్డి, బండిసంజయ్ కనిపించలేదా? ముఖ్యమంత్రులు మాత్రమే కనిపిస్తారా? అందరూ సమానమే అయినప్పుడు ఒవైసీని కూడా పిలవాలి కదా అన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రశ్నకు ఒకటే సమాధానం! అది లోకకల్యాణం కోసం స్వామివారు చేసిన లోకోత్తర పర్యటన ఆహ్వానపత్రిక కార్యం!! దట్సాల్.
పువ్వుపార్టీ పలకదేమి?
ఎంకిపెళ్లి సుబ్బిచావుకొట్టినట్లు.. ఈ యవ్వారం అటు తిరిగి ఇటు తిరిగి పువ్వుపార్టీ చావుకొచ్చిపడింది. జీయరు స్వామి మనవాడే. అంటే పార్టీ-ప్రభుత్వంలో ఉన్న పైస్థాయి నాయకులకు కావలసిన వాడే. అందువల్ల ఆయన వ్యాఖ్యలను ఖండించలేం. అలాగని కోట్లాదిమంది హిందువులు కొలిచే సమ్మక్క-సారక్క, ఇతర గ్రామదేవతలపై స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండించకపోతే, తాము కట్టుకున్న హిందూమత మడిబట్టకు, హిందుత్వపై ఉన్న పేటెంటీకే గత్తర రాక తప్పదు. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే, అడవిబిడ్డ సీతక్క ఈపాటికే జీయర్ వాచాలతపై విరుచుకుపడుతుండగా, కుల సంఘాలు ఏకంగా ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని గళమెత్తుతున్నాయి. అయినా పువ్వు పార్టీ నుంచి పలుకే బంగారం!