– స్వేర్ ఫీట్‌కు రూ.12 వేల ఖర్చుతో రాజధాని నిర్మాణం
– ఈ డబ్బుతో సముద్రంలో వంతెన కట్టొచ్చు
– రైతులకు సబ్సిడీలు, ధరల స్థిరీకరణపై కూటమి మౌనం
– పన్నులు, ట్యాక్స్‌లతో ప్రజలపై భారం
– రాయచోటి జిల్లా మార్పుపై మంత్రి కన్నీళ్లు డ్రామా మాత్రమే
– నిర్బంధ అమరావతిపై పునరాలోచన చేయాలి
– రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌పై ప్రజల ఆశలు అడియాసలు
– రాజధాని పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఊరుకోరు
– జీఎస్టీ..బీఎస్టీగా మార్చి దోపిడీకి తెర
– వైయస్ఆర్సీపీ కార్యాలయంలో పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజనాథ్ ధ్వజం
అనంతపురం: ఈ నెల 29వ తేదీ జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఆ ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయని వైయస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకె శైలజనాథ్ అన్నారు. కొత్త ఏడాదిలో అయినా ప్రజలకు ఊరట కలిగించే కొత్త పథకాలు వస్తాయేమో అని ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి నిరాశపరిచిందని విమర్శించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లను మార్చడం తప్ప, కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్నీ తీసుకురాలేదన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతు సబ్సిడీలు వంటి కీలక అంశాలపై కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల నియంత్రణ, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని పేర్కొన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప, సంక్షేమంపై దృష్టి పెట్టని ఈ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన సమాధానం ఇస్తారని డాక్టర్ సాకె శైలజనాథ్ హెచ్చరించారు.
నిన్న జరిగిన కేబినెట్ సమావేశంపై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కొత్త ఏడాది సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏదైనా ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకుంటుందేమోనని అన్ని వర్గాల ప్రజలు ఆశించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి విద్యార్థులకు హాల్‌టికెట్ల సమస్యలు పరిష్కరిస్తారని భావించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసి వైద్య సేవలను మెరుగుపరుస్తారని ఆశించారు. వెనుకబడిన జిల్లాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వంద శాతం ఉచిత విత్తనాలు ఇస్తారేమోనని ఎదురుచూశారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటారని బాధితులు ఆశపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక విమానాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ తిరుగుతున్న నేపథ్యంలో, ధరల స్థిరీకరణకు కనీసం రూ.2000 కోట్లు కేటాయిస్తారేమోనని రైతులు భావించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేస్తారని, 50 ఏళ్లు దాటిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేస్తారని ప్రజలు ఆశించారు. అయితే ఈ అన్ని ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాసలుగా మార్చిందని ప్రజలు భావిస్తున్నారు.
ప్రధానిని కర్నూలుకు పిలిపించి ప్రజలకు భారీ లాభాలు వస్తాయని, ధరలు తగ్గుతాయని హడావుడి చేస్తూ ఏపీ ఖజానా నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ఒకవైపు 18 శాతం జీఎస్టీ తగ్గితే ప్రజలకు మేలు జరుగుతుందేమోనని భయపడి, మరోవైపు వాహనాలపై 10 శాతం ట్యాక్స్ వేసి ప్రజలను దోచుకుంటున్నారు. యోగా డేలు, పబ్లిసిటీ ప్రచారాలను ఆపితేనే ఏటా రూ.500–600 కోట్లు ఆదా అవుతాయి.
వైయస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడమే తప్ప, ప్రజలకు మేలు చేసిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి నెట్టేశారు. రైతులకు ధరల స్థిరీకరణ లేదు, ఉచిత విత్తనాలు లేవు, యూరియా కోసం క్యూలు తప్పలేదు. చంద్రబాబు పాలనలో రూ.19 వేల కోట్లకు పైగా కరెంటు బిల్లులు ప్రజలపై మోపారు. చెల్లింపులు ఆలస్యమైతే కనెక్షన్లు కట్ చేస్తారు, తిరిగి ఇవ్వమంటే ట్రూ అప్, బ్యాక్ అప్ అంటూ తప్పించుకుంటున్నారు. ఒకప్పుడు చెత్త పన్నుపై విమర్శలు చేసినవారు, ఇప్పుడు చెత్త పన్ను వేస్తామంటున్నారు. తాగే నీళ్లపైనా ట్యాక్స్ వసూలు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు పగులగొట్టాలని పిలుపునిచ్చిన నేతలు ఈరోజు ఆదాని, అంబానీల ముందు ఎందుకు లోంగారో ప్రజలకు చెప్పాలి. జీఎస్టీని బీఎస్టీగా మార్చి కొత్త కొత్త ట్యాక్స్‌లతో ప్రజలపై భారం మోపుతున్నారు.
మెడికల్ కాలేజీల పీపీపీ బిడ్లకు ఒక్క టెండర్ కూడా రాకపోవడం గమనార్హం. రాబోయేది వైయస్ఆర్సీపీ ప్రభుత్వమేనని కాంట్రాక్టర్లకూ అర్థమైంది. నీతి అయోగ్ స్పష్టంగా పీపీపీ మోడ్‌కు మద్దతు ఇవ్వని పరిస్థితిలో, మీకు నచ్చినవారికే టెండర్లు అప్పగిస్తున్నారు.
అమరావతిలో “నిర్బంధ అభివృద్ధి” ఏమిటో అర్థం కావడం లేదు. రాష్ట్ర సంపద అంతా అమరావతిలోనే కుమ్మరిస్తున్నారు. కేవలం నీళ్లు ఎత్తిపోసేందుకు రూ.440 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అదే డబ్బుతో వెలుగోడు రిజర్వాయర్ పూర్తవుతుంది, గాలేరు–నగరి ఎత్తిపోతల ద్వారా లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయి. లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను నిలువునా ముంచుతున్నారు. అమరావతి పేరుతో గుండె పగిలి చనిపోయిన రైతు రామారావు ఆత్మను అడిగితే మీ మోసాల అసలు రూపం తెలుస్తుంది.
భూములు ఇచ్చిన వారికి వాగులు, వంకల్లో ఇళ్ల స్థలాలు ఇస్తూ, ఇంకా 30 వేల ఎకరాలు కావాలంటూ బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో రూ.60 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. ప్రపంచ బ్యాంకు, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ, నాబార్డ్, బాండ్ల ద్వారా సీఆర్డీఏ రుణాలు తీసుకున్నారు. లక్ష కోట్ల అప్పులకు ఏడాదికి రూ.8 వేల కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీలు ఎవరి డబ్బుతో చెల్లిస్తారు? అందులో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల డబ్బులు కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోండి. నిర్బంధ అమరావతి పేరుతో ప్రజలను పావులుగా వాడితే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ సహించేది లేదు.
నిర్బంధ అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం తీసుకోవాలి. రోమ్, న్యూయార్క్, హైదరాబాద్ ఏదీ ఒక్క రోజులో కట్టలేదు. ప్రజలు లేకుండా రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుంది? ప్రజలను అడగకుండా అమరావతి నిర్మాణం చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. మొదట విజయవాడలో రాజధాని అన్నారు, ఆ తర్వాత కృష్ణా–గుంటూరు జిల్లాల ప్రజలను మోసం చేశారు. స్వేర్ ఫీట్‌కు రూ.12 వేల ఖర్చుతో రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఈ డబ్బుతో సముద్రంలో వంతెన కట్టొచ్చు. ఈ వాస్తవాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
కేబినెట్ నుంచి ఓ మంత్రి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు రావడం ప్రజలకు తమాషా అనిపించింది. రాయచోటికి చెందిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి గతంలో సవాళ్లు చేశారు, మీసం తిప్పారు, ఇప్పుడు మాత్రం జిల్లా మార్పుపై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా డ్రామా తప్ప మరొకటి కాదు. ప్రభుత్వంలో ఉన్నవారు సైడ్ యాక్టర్లలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు లేవు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధులు నిలిచిపోయాయి.
నిన్న డీజీపీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పెట్రోలింగ్ వాహనాలు లేవని నిందితులను నడిపించామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాంటి మాటలు సుప్రీం కోర్టు ముందు చెప్పాల్సింది. వాహనాలు లేకపోతే నడిపిస్తాం, నడవలేకపోతే కుంటుకుంటూ తీసుకెళ్తామన్నట్టు వ్యవహరించడం భారత రాజ్యాంగానికి విరుద్ధం.