వారెందుకు తెలంగాణకు వస్తున్నారో కేసీఆర్ కు బాగా తెలుసు
కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నరు?
రాష్ట్రంలో టైం పాస్ పాలన కొనసాగుతోంది
తెలంగాణ వాదులారా…. బీజేపీలోకి రండి
టీఆర్ఎస్ పాలనను బొంద పెడదాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు
‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సహా బీజేపీ జాతీయ నాయకత్వమంతా హైదరాబాద్ కు వస్తుందని తెలిసి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతల గుండెల్లో వణుకు మొదలైంది. అందుకే తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ బదనాం చేసేందుకు యత్నిస్తున్నారు. మోదీ గారు పులి. ఆయన ఎందుకు హైదరాబాద్ వస్తున్నారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ ఇంకా బాగా తెలుసు’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో టైం పాస్ పాలన కొనసాగుతోందని… కబ్జాలు, హత్యలు అత్యాచారాలకు తెలంగాణను అడ్డాగా మార్చిన కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని ప్రశ్నించారు.
వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ నాగమల్ల ఝాన్సీరాణి, ఎన్ఆర్ఐ నాగమల్ల సంతోష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘ఏ ఆశయం, ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం పోరాడారో… ఆ ఆకాంక్షలకు, అమరవీరుల ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. ఒక కుటంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యింది. ఉద్యమ ద్రోహులు రాజ్యమేలుతున్నారు. హత్యలు, అత్యాచారాలు, కబ్జాలకు అడ్డగా తెలంగాణను మార్చారు. సీసాలు అమ్ముకుని బతకాలనే స్థాయికి వచ్చారు’’అని అన్నారు.
‘‘కేసీఆర్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ఉద్యమ కారులంతా ఆ బతుకు తమకొద్దంటూ టీఆర్ఎస్ ను వీడుతున్నారు. కుటుంబ-అవినీతి-నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీలో చేరుతున్నారు. ప్రజాదరణ ఉన్న నేతలెవరూ టీఆర్ఎస్ లో ఉండటం లేదు. ’’అని పేర్కొన్నారు.
తెలంగాణ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ స్పందిస్తూ.. ‘‘తెలంగాణ వాదులారా.. బీజేపీలో చేరండి. అందరం కలిసి అరాచక పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ మెడలు వంచుదాం. టీఆర్ఎస్ పాలనను బొందపెడదాం. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేద్దాం…’’అని పిలుపునిచ్చారు.
తెలంగాణ అభివృద్ధి నిధులిస్తూ కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నా.. కేసీఆర్ మాత్రం కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకుని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు తెలంగాణ అభివ్రుద్ధి పట్ల, ప్రజలపట్ల ధ్యాస లేదని… తన కుటుంబంలో ఎవరిని తదుపరి సీఎం చేయాలా? అని ఆలోచిస్తూ టైం పాస్ పాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మడం లేదని.. బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలు అమలు కావాలన్నా… నిజాయితీగా లబ్ది దారులకు సంక్షేమ ఫలాలు అందాలన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని ఉద్ఘాటించారు.
తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని ప్రధాని వస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ ఛేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా ‘‘మోదీగారు పులి. ఆయన ముఖం మంచిదే. ఆ ముఖంతోనే వస్తున్నారు. అయినా మోదీగారు తెలంగాణకు ఎందుకు వస్తున్నారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ ఇంకా బాగా తెలుసు’’అని వ్యాఖ్యానించారు. ‘‘మోదీ, అమిత్ షా, జేపీనడ్డాసహా మహామహులంతా ఇక్కడికి వస్తున్నారని, బహిరంగ సభ జరగబోతుందని తెలిసి కేసీఆర్, టీఆర్ఎస్ గుండెల్లో డప్పులు మొదలైనయ్. అందుకే కేంద్రాన్ని బదనాం చేయడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణకు ఎందుకు వస్తున్నారో జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా మోదీగారు చెప్పబోతున్నారు’’అని పేర్కొన్నారు.