Suryaa.co.in

Andhra Pradesh

రాజన్నదొర నిజాయితీపరుడైతే రెండేళ్లలో గిరిజన శాఖలో ఒక్క సమీక్ష కూడా ఎందుకు నిర్వహించలేదు?

– గిరిజన గురుకులాల సమస్యలపై దృష్టి పెట్టలేని ఉపముఖ్యమంత్రి ఉంటే ఏంది…ఊడితే ఏంది?
– రాజన్నదొర అవినీతిని నిరూపించడానికి మేం సిద్దం
– రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారునాయక్

ఉపముఖ్యమంత్రి రాజన్నదొర మంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు గిరిజన శాఖలో ఒక్క సమీక్ష నిర్వహించ లేదంటే ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో అర్ధమౌతోంది. గిరిజనుల సమస్యలపై రాజన్నదొరకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు వాటిపై దృష్టి పెట్టడం లేదు? కేవలం ఆయన నియోజకవర్గమైన సాలూరుకు పరిమితమవ్వాలనుకుంటే మంత్రిగా ఎందుకు బాధ్యతలు తీసుకున్నారు?

రాజన్నదొర ధీరుడు, శూరుడు అయితే ఆయన సొంత గ్రామంలో నేటికి స్కూలు ఎందుకు లేదు? గిరిజనులకు సంబంధించిన 16 సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేస్తే రాజన్నదొర ఎందుకు మాట్లాడలేదు? ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన పాఠశాలల్లో గిరిజన విద్యార్ధులు గంజాయి మత్తుకు బలైపోతుంటే రాజన్నదొరకు కనిపించడం లేదా? తెదేపా హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ పండిస్తే నేడు గంజాయి పండిచాలని గిరిజనులపై వైకాపా నాయకత్వం ఒత్తిడి చేస్తున్న మాట వాస్తవం కాదా?

సంక్షేమశాఖా మంత్రిగా రాజన్నదొర చేసిందేమిటి? గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేని నాయకత్వం ఉంటే ఏమిటి…ఊడితే ఏమిటి? ఒంగోలుకు చెందిన గిరిజన యువకుడు నవీన్ నోట్లో మూత్రం పోసి ఘోరంగా అవమానిస్తే రాజన్నదొర ఎక్కడికి పోయాడు? నకిరేకల్లు, శివాపురం తండాలో వైకాపా నాయకుడు శ్రీనివాసరెడ్డి గిరిజన మహిళ మంత్రూబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపితే రాజన్నదొరకు కనిపించలేదా?

రాజన్నదొరకు, వైకాపా గిరిజన నాయకత్వానికి గిరిజనులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న గిరిజన సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేసేలా జగన్‌రెడ్డిపై ఒత్తిడి చేయండి. అంతేకాని, గిరిజనుల సమస్యలపై మాట్లాడే వారిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుర్మార్గం. రాజన్నదొర అవినీతిని నిరూపించడానికి మేం సిద్దం.

LEAVE A RESPONSE