రాష్ట్ర ప్రభుత్వానికి విశ్వహిందూ పరిషత్ హెచ్చరిక
నాస్తికత్వం పేరుతో హిందూ వ్యతిరేక చర్యలకు.. మత మార్పిడికి పాల్పడుతున్న మల్లమారి మల్లికార్జున్ ను సస్పెండ్ చేయాలి
హిందూ ద్రోహులకు మద్దతిస్తూ బజరంగ్దళ్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ లోనే చిత్రహింసలు పెట్టిన మానుకోట ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సైలను చట్టపరంగా శిక్షించాలి.
హిందూ దేవి దేవతలను దూషించిన రేంజర్ల రాజేష్ ను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటు.. వెంటనే అరెస్టు చేయకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. కల్వకుర్తిలో మతమార్పిడి మాఫియా కు ప్రభుత్వం మద్దతు. రాష్ట్రవ్యాప్తంగా హిందువులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై న్యాయపోరాటం తప్పదు.
రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని.. నాస్తికవాదం ముసుగులో హిందుత్వం పై దాడి జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. పథకం ప్రకారమే కెసిఆర్ ప్రభుత్వం హిందువులను అణిచివేసే కార్యక్రమం పెట్టుకుందని విమర్శించింది. సీఎం ఆదేశానుసారం పోలీస్ యంత్రాంగం చట్టాన్ని ఉల్లంఘిస్తోందని.. నిందితులకే మద్దతుగా నిలుస్తోందని పేర్కొంది. నిందితులకు మద్దతు పలుకుతూ.. బాధితులను భయకంపితులను చేస్తోందని మండిపడింది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ , ఉపాధ్యక్షులు జగదీశ్వర్ , ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడారు. రాష్ట్రంలో హిందూ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రెండు వారాలు గడుస్తున్నా రేంజర్ల రాజేష్ ను అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధతకు నిదర్శనం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు చర్యలు మానుకోవాలని.. హిందువులను ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు చేయక తప్పదని హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మల్లమారి మల్లికార్జున్ తరగతి గదుల్లోనే మతమార్పిడికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. విద్యార్థులను జాతి విద్రోహ శక్తులుగా తయారు చేసేందుకు ఉగ్రవాదం గురించి నూరిపోస్తున్నట్లు ఆరోపించారు. నాస్తికత్వం పేరుతో దేవుడు లేడు అంటూనే క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాడని విమర్శించారు. జాతి విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న మల్లికార్జున్ పై కమ్యూనల్ కేసు నమోదు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సర్టిఫికెట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించి క్రైస్తవ మతంలోకి మారిన మల్లికార్జున్ పై రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ లను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామినీ కించపరిచే పోస్టింగులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేస్తే.. నిందితులను శిక్షించకపోగా.. కేసు వాపస్ తీసుకోవాలని బజరంగ్దళ్ కార్యకర్తలను పిలిచి నలుగురు పోలీసు అధికారులు పోలిస్ స్టేషన్ లోనే చిత్రహింసలకు గురి చేశారని వివరించారు. ఇప్పటికీ ఆ కార్యకర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, సాక్షాదారులతో సహా మానవ హక్కుల కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు, హైకోర్టులో కూడా వారి దాస్టికం గురించి ఫిర్యాదు చేస్తామన్నారు.
దేశానికే తెలంగాణ పోలీసులు తలమానికమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి రేంజర్ల రాజేష్ ను పట్టుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో నిఘా ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. హిందూ దేవతలను నీచంగా దూషించిన దుర్మార్గుడిని అరెస్టు చేయకపోవడం పోలీసుల అసమర్ధత కు నిదర్శనం అని ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే సరస్వతీ మాత భక్తుల ఆగ్రహం చవి చూడక తప్పదని హెచ్చరించారు.
కల్వకుర్తి పట్టణ కేంద్రంగా హిందూ యువకులను ముస్లింలుగా మతం మారుస్తున్నారని.. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో ఈ తంతు సాగుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఇస్లాం తీవ్రవాదులు తిష్టవేశారని.. భగవద్గీత పేరుతో ఇస్లాం సాహిత్యాన్ని ఇల్లు ఇల్లు తిరిగి అమ్ముతున్నారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. రేంజర్ల రాజేష్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ప్రగతి భవన్ ముట్టడిస్తామని మరోసారి హెచ్చరించారు.
రాష్ట్ర నలుమూలల నాస్తికత్వం పేరుతో హిందుత్వం పై జరుగుతున్న దాడిపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రేగు అనిల్, భరత్ వంశీ, రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.