– పగలు ఫైట్ చేసుకున్నట్లు నటిస్తరు…రాత్రి ఒక్కటైపోతరు
– డ్రోన్ ఎగిరిస్తేనే బిడ్డ పెళ్లిరోజే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు…అన్ని స్కాముల్లో కేటీఆర్ ప్రదాని నిందితుడిని తేలుతుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
– కేటీఆర్ తో పోలిస్తే హరీష్ క్రెడిబిలిటీ ఉన్నోడు
– కేటీఆర్ కళ్లు నెత్తికెక్కినయ్….కిందకు దించుతా
– కేసీఆర్ కొడుకు నోటీసులకు రిప్లై ఇస్తే అన్నీ మూసుకుని కూర్చున్నడు
– అయినా నేనే మళ్లీ ఆయనకు నోటీసులిస్తా…
– సంగెంవద్ద కాదు… మూసీ బాధిత ప్రాంతాల్లో సీఎం పాదయాత్ర చేయాలి
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్….
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే, కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ తో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని, అందుకే ఈ ఫార్ములా రేస్, రేవ్ పార్టీ, డ్రగ్స్, కాళేశ్వరంసహా అన్ని స్కాంలలో కేటీఆర్ ప్రధాన నిందితుడుని తేలిన తరువాత కూడా ఆయనను అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారని అన్నారు.
‘‘ఒకనాడు జన్వాఢ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగిరేశారనే కారణంతో నీ బిడ్డ పెళ్లిని కూడా చూడనీయకుండా నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు. అట్లాంటిది ఇయాళ బయటపడుతున్న స్కాంలన్నింట్లోనే కేసీఆర్ కొడుకు ముద్దాయి అని తేలిన తరువాత కూడా ఎందుకు జైల్లో పెడతలేవ్. ఎందుకీ మీనమేషాలు’’అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ కొద్దిసేపు మీడియా మిత్రులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఏమన్నారంటే…
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కటేనంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై…
కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అలుపెరగకుండా పోరాటం చేసిన. ఆనాడు రేవంత్ రెడ్డి కూడా ఫైట్ చేసిండు. మేం ఫైటర్స్. అందుకే కేసీఆర్ కొడుకుకు నిద్రలో కూడా మేం గుర్తుకొస్తున్నం. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కొడుకుతో కలిసిపోయిండు. పగలు ఇద్దరూ ఫైట్ చేసుకుంటున్నట్లు నటిస్తరు. రాత్రి ఒక్కటైతున్నరు. కేసీఆర్ కొడుకు పెద్ద బ్లాక్ మెయిలర్. గత ప్రభుత్వంలో అవినీతిపరుడు.
బయటపడుతున్న అన్ని స్కాంలలో ఆయనే సూత్రధారి. అయినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదంటే మీరే అర్ధం చేసుకోండి. నాకు ఆశ్చర్యమేసేది ఏమిటంటే… ఆనాడో జన్వాఢ ఫాంహౌజ్ పై డ్రోన్ ఎగిరేసినందుకే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. అది కూడా రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లిచేసుకునే రోజే. కన్నకూతురి పెండ్లి జరుగుతుంటే.. చూడనీయకుండా కర్కశంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిండు.
అట్లాంటోడు ఇయాళ అన్ని స్కాంలలో ప్రధాన నిందితుడని తెలిసి కూడా అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్క పెడుతున్నడంటే ఏమనుకోవాలి. చివరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ చెబితేనే చేశామని నిందితుడు చెప్పినా అరెస్ట్ చేయలే. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయి… కేసీఆర్ కుటుంబమనే కారణమని తేలినా చర్యల్లేవ్…
ఎందుకంటే నాకు తెలిసినంతవరకు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే…. కేటీఆర్ యాక్టింగ్ సీఎం. అందుకే జన్వాఢ బామ్మర్థి ఫాంహౌజ్ కేసులో అడ్డంగా దొరికిన విజయ్ మద్దూరిని, సూత్రధారి అయిన రాజ్ పాకాలపై నామ్ కే వాస్తే కేసులు పెట్టి వదిలేశారు. ఈ రేవ్ పార్టీలో కేసీఆర్ కొడుకు ఉన్నడని మీడియా అంతా కోడై కూసినా పట్టించుకోలేదు.
బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లే…
పైగా ఏనాడూ బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులైతే పోలీసులకు ఫోన్ చేయని కేసీఆర్… తన కొడుకు బామ్మర్థి కేసు గురించి మాత్రం ఏకంగా డీజీపికి ఫోన్ చేసిండంటే అర్ధం చేసుకోండి… కేసీఆర్ కు కార్యకర్తలకంటే కుటుంబమే ముఖ్యమని… అందుకే బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచంచే కార్యకర్తలే కరువయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటి నుండో పక్కచూపులు చూస్తున్నరు. ఇగ కేసీఆర్ అయితే ప్రజల సమస్యలను, కార్యకర్తల కష్టాలను గాలికొదిలేసి హాయిగా ఫాంహౌజ్ లో రెస్ట్ తీసుకుంటున్నడు. ఎన్నికల్లో మాత్రమే మేకప్ వేసుకుని బయటకొచ్చి అట్లాంటి లీడర్లను ప్రజలెట్లా నమ్ముతారు. బీఆర్ఎస్ పనైపోయింది… అందుకే గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం లేదు. కనీసం బీఆర్ఎస్ పోటీ చేసే పరిస్థితి కూడా లేదు…
రేవంత్ రెడ్డి పాదయాత్రపై….
రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలోని సంగెం వద్ద మూసీ కోసం పాదయాత్ర చేస్తున్నడట. నేను నా పాదయాత్రలో ఆ ప్రాంతమంతా తిరిగిన. ప్రజల బాధలు కళ్లారా చూసిన. నేనడుగుతున్నా… రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది సంగెం వద్ద కాదు… మూసీ పునరుజ్జీవంతో ఇండ్లు కోల్పోతున్న బాధిత ప్రాంతాల్లో…. అక్కడ తిరిగితే కదా… పేదల కష్టాలు, కన్నీళ్లు తెలిసేది. ఆరు గ్యారంటీల విషయంలో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లాలి.
కేటీఆర్ వ్యాఖ్యలపై….
కేసీఆర్ కొడుకుకు కళ్లు నెత్తికెక్కినయ్. బరితెగించి కండకావరమెక్కి పెద్దా, చిన్నా తేడా లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడు. ప్రధానమంత్రి పదవికి కనీసం గౌరవం ఇవ్వకుండా మోదీపై నోటికొచ్చిందలా మాట్లాడుతున్నడు. నెత్తికెక్కిన కళ్లను కిందకు దించుతం. ఈ మధ్య కేసీఆర్ కొడుకు సిగ్గు, శరం అన్నీ వదిలేసి బరితెగించి తిరుగుతున్నడు.
ఆటో డ్రైవర్ల పొట్టకొట్టి సర్వనాశనం చేసిందే బీఆర్ఎస్… అధికారం పోంగనే సిగ్గు లేకుండా వాళ్లు ధర్నా చేస్తే పోయి మద్దతిస్తున్నడు. సర్పంచులను బిచ్చగాళ్లు చేసిందే బీఆర్ఎస్. అయినా వాళ్లు చేస్తున్న ఆందోళనలో పాల్గొంటున్నడు. నేను ఆందోళన కారులకు చేసే విజ్ఝప్తి ఒక్కటే… మీ సమస్యలను స్రుష్టించినోళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్. మళ్లీ వాళ్లను కలిస్తే మీరే చులకన అవుతారు. మీకోసం మొదటి నుండి పోరాడుతున్నది బీజేపీయేనని తెలుసుకోండి… నిజం చెప్పాలంటే కేసీఆర్ కొడుకు పిరికిపంద. ట్విట్టర్లో, మీడియాలో తప్ప ప్రజల్లోకి వెళ్లి ఫైట్ చేసే దమ్ములేనోడు…
కేటీఆర్ లీగల్ నోటీసులపై….
కేసీఆర్ కొడుకు ఇచ్చిన లీగల్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చిన. అప్పటి నుండి నోరు మూసుకుని కూర్చున్నడు. నేను తప్పుగ మాట్లాడితే మళ్లీ ఎందుకు కౌంటర్ ఇయ్యలే. ఇప్పుడు చెబుతున్నా… నేనే ఆయనకు నోటీసు ఇస్తా… అసలు కేసీఆర్ కొడుకు మాట్లాడే అహంకారపు మాటలకు, మాట్లాడే బూతులకు గంటకో నోటీస్ ఇవ్వొచ్చు.
కళ్లు నెత్తికొక్కి మాట్లాడుతున్నడు. త్వరలోనే ఆయనను నేలకు దించుతాం. ఆయన లెక్క నేను అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలే. అయ్య పేరు చెప్పుకుని పదవులు తీసుకోలే.6 గ్యారంటీలపై కొట్లాడే దమ్ము లేనోడు.. రేవంత్ తో కుమ్కక్కైనోడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతానంటే నమ్మేదెవరు? కేసీఆర్ కొడుకుతో పోలిస్తే అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న లీడర్ హరీష్ రావే.