-93 స్థానాలలో టీడీపీ విజయం ఖాయం….
– 13 స్థానాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
– ఇంగ్లీష్ ఛానల్ సర్వే చూసుకొని ప్రభుత్వ పెద్దలు తొడలు చరుచుకుంటే పరిస్థితి అధ్వానం
– నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తాను విస్తృత సాయి శాంపిల్స్ తో శాస్త్రీయంగా జూన్, జులై మొదటి వారం వరకు నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి 93 స్థానాలలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని తేలిందన్నారు. ఇక నువ్వా నేనా అన్నట్టు ఉన్న స్థానాలలో సగం స్థానాలో విజయం సాధించిన, ఆ పార్టీకి 127 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గెలిచే స్థానాలు కేవలం 7 నుంచి 8 కాగా, మరో మూడు నుంచి నాలుగు స్థానాలలో విజయ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక నువ్వా నేనా అన్నట్లు ఉన్న 65 స్థానాలలో తమ పార్టీ ఒకవేళ 90% స్థానాలలో విజయం సాధించిన 73 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ చానల్ నిర్వహించిన సర్వేను చూసి తొడలు చర్చుకుంటూ ఇలాగే ప్రవర్తిస్తే, పరిస్థితి మరింత అద్వానంగా దిగజారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు .
సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జిల్లాల వారీగా సర్వే పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో పోటాపోటీగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తలపడే అవకాశం ఉన్నదన్నారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ స్థానాలలో ఏకపక్ష విజయం సాధించనున్నదని చెప్పారు. ఉభయగోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం అధికంగా ఉన్నదన్న ఆయన, గుంటూరులోనూ విజయ అవకాశాలను పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయగలరని చెప్పారు. టిడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉన్న స్థానాలలో ఆ రెండు పార్టీల అభ్యర్థులు అవలీలగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు.
ఇటీవల టైమ్స్ నౌ, ఇండియా టీవీ, ఇండియా టుడే వంటి ఇంగ్లీష్ ఛానళ్ళు బుల్లి, బుల్లి శాంపిల్స్ తో సర్వే నిర్వహించి తమ పార్టీకి 18 నుంచి 23 లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొనడంతో, తమ పార్టీ నేతలు 175 కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని భావించి ఇంకా ఎక్కువ దారుణాలు చేయడం, సర్వే ఫలితాలను చూసి పనిచేయడం మానేస్తే పరిస్థితి మరింత అద్వానంగా ఉంటుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు..
ముఖ చిత్రం బాగాలేదని తెలిసింది
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే… ఆయన ముఖచిత్రం బాగాలేదని తెలిసిందని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ప్రధానితో భేటీలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బకాయి నిధులు చెల్లించాలని కోరినట్లుగా, అలాగే 10 వేల కోట్ల రూపాయల అడ్వాన్స్ చెల్లించాలని అడిగినట్లుగా వివరించారని తెలిసిందన్నారు. కానీ ఏ మాత్రం క్రెడిబిలిటీ లేని వారికి పదివేల కోట్ల రూపాయలు అడ్వాన్సుగా ఎవరిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇక మెడికల్ కాలేజీల నిర్మాణానికి సహకరించాలని ప్రధానిని కోరినట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు. ఎందుకంటే ఇప్పటికే శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం పునాదుల దశలోనే ఉన్నాయని గుర్తు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది దేశకు చేరుకున్నందు వల్లనే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వచ్చారని కొందరు అంటుంటే, మరికొందరేమో తన గురించే వచ్చారని అంటున్నారన్నారు.
పరామర్శకు వెళితే అంత భయం ఎందుకు?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తమ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ఇంటిని ప్రభుత్వం అకారణంగా కూల్చివేస్తే పరామర్శించడానికి వెళ్తుండగా అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు పరామర్శకు వెళ్తుంటే… ప్రభుత్వం ఎందుకని అంత దడదడలాడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పరామర్శల పేరిట ఊరూరు తిరిగిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు లోకేష్ తమ పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులను పెట్టి అడ్డగించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు.
ఏపీ పోలీసులు ఐపీసీ ని ఫాలో కాకుండా, వైసీపీని ఫాలో అవుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. లోకేష్ ను మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, ఏక వచనంతో సంబోధించడం, మీడియాతో మాట్లాడుతుంటే అడ్డుకోవడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు వ్యతిరేకం కాదా? అంటూ రఘురామకృష్ణంరాజు నిలదీశారు. విశాఖలో చోటు చేసుకున్న సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న వారి అందరి విశ్వాసాలను కోల్పోయే విధంగా తమ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉంటే, ఎన్నో అబద్ధాలు చెప్పి, తటస్థ ఓటర్లను మనం ప్రభావితం చేయగలిగి ఉండేవారమా? అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు.
మనస్సాక్షి లేని సాక్షి ఏమి రాస్తుందో చూడాలి
మనస్సాక్షి లేని సాక్షి దినపత్రిక కోర్టులో జరిగిన వాదనలపై ఏమి రాస్తుందో చూడాలని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తాను దాఖలు చేసిన పిటీషన్ కొట్టేసినట్లు గతంలో యాక్ ..ఛీ దినపత్రిక, అదే పేరు ఉన్న ఛానల్ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానానికి అదనపు సమాచారాన్ని అందించేందుకు అవకాశం ఇవ్వాలని తాము కోరగా, కోర్టు అంగీకరించిందని, తాము వీడియో ఆధారాలతో కూడిన అదనపు సమాచారాన్ని అందజేశామని రఘురామకృష్ణంరాజు తెలిపారు.