సి ఓటర్ సర్వే ప్రాతిపదికన టిడిపికి 15 పార్లమెంటు స్థానాలు
బటన్ నొక్కిన లబ్ధిదారులకు అందని డబ్బులు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన లబ్ధిదారులకు డబ్బులు అందడం లేదు. వచ్చిన వాడికి వచ్చినంత అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. బటన్ నొక్కుడు అంతా దొంగనొక్కడేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. విద్యా దీవెన బకాయిలే 465 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. కాలేజీలలో చదువుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిన విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బులు వేస్తారట.
ఇప్పటికే, డబ్బులు అందని 22 కాలేజీలు కేసులు వేశాయి. కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తమ కాలేజీలను మూసివేస్తున్నాయి. కాలేజీ విద్యాభ్యాసాన్ని ముగించుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లిపోయిన విద్యార్థుల తల్లుల అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తే, వారు కాలేజీలకు ఫీజులు ఎందుకు చెల్లిస్తారని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఓట్ల కొనుగోలు కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అమ్మయినా సరే, మళ్లీ మనమే అధికారంలోకి రావాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవాలన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. జనాలు వారి బ్రతుకులు వారు బతుకుతారని మద్యం తాగేవారు భార్యల మెడలలోని పుస్తెల అమ్ముకొని అయినా తాగుతారని, ఇసుక తవ్వకాలు, మైనింగ్, మద్యం ద్వారా నికర ఆదాయం లభిస్తుందన్న అంచనాకు జగన్మోహన్ రెడ్డి వచ్చారన్నారు.
గంజాయిని కూడా అధికారికంగా మా పార్టీ నాయకులు సాగు చేయడం మొదలుపెట్టినట్లు తెలిసింది. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా బటన్ నొక్కిన ఇప్పటికీ 1750 కోట్ల రూపాయలు లబ్ధిదారుల అకౌంట్లో జమ కాలేదు చేరలేదు. అయినా లబ్ధిదారులు చకోర పక్షుల్లాగా డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. నాకే డబ్బులు రానప్పుడు, కాలేజీకి ఫీజు ఎందుకు కడుతామని విద్యార్థుల తల్లులు భావిస్తుండగా, ఫీజుల అందక కాలేజీ యాజమాన్యాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి.
అయినా లబ్ధిదారులు మాత్రం మా జగన్ బాబు మూడు నెలల తర్వాత అయినా బాకీలు తీరుస్తాడనే ఆశాభావంతో ఉంటే, రోజులు గడిచిపోతున్నాయి… బాకీలు మాత్రం పెరిగిపోతున్నాయని తెలిపారు. ఇదంతా మోసం బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. బటన్ నొక్కి కార్యక్రమం కేవలం సాక్షి దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుందని విమర్శించారు.
ముఖ్యమంత్రి సభ నిర్వహణకు డబ్బులు లేకపోవడంతో జిల్లా కలెక్టర్ విద్యా శాఖ నుంచి 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని సభా ఏర్పాట్లు చేస్తున్నారంటే, రాష్ట్రం ఆర్థికంగా ఎంత కరువులో ఉందో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు .. ఇంత దారుణమైన ఆర్థిక అద్వాన స్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి, అప్పులు చేయడం లేదు, రాష్ట్ర జిడిపి పెరిగిపోయిందని, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఆర్థిక స్థితి మంతుల్ని పేదవారిని చేస్తున్నామా?
ఆర్థిక స్థితి మంతులని కాస్త మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవారిని చేస్తున్నామా?, వారు పేదలుగా మారడానికి మన ప్రభుత్వ విధానాలే కారణమా?? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తానే దేశోద్ధారకుడిని, సంఘ సేవకుడనని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన, పెత్తందారులైన టిడిపి నాయకులపై పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటారు.
మరి ఆర్థికంగా స్థితిమంతులను పేదవారీగా మార్చడమేనా ఆయన పెత్తందారులపై చేస్తున్న పోరాట ఫలితమని నిలదీశారు. రాష్ట్రంలో 2.62 లక్షల మంది అర్హులకు లబ్ధి చేకూర్చలేకపోయామని జగన్మోహన్ రెడ్డి వాపోతున్నాడని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వాల్సిన బకాయిలు కేవలం 200 కోట్ల రూపాయలేనా అని ప్రశ్నించిన ఆయన, నాలుగేళ్ల బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
గతంలో అర్హులైన వారు మరుసటి ఏడాది ఎందుకు అనర్హులవుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారిని ధనవంతులు చేయడమే తన లక్ష్యమని, రాష్ట్ర జిడిపి అమాంతం పెరిగిపోయిందని చెబుతున్న ముఖ్యమంత్రి, నొక్కుతున్న బటన్ నొక్కుడ్లన్నీ దొంగ నొక్కుడు లేనని మండిపడ్డారు.
వాస్తవ పరిస్థితికి దగ్గరగా సి ఓటర్ సర్వే
సి ఓటర్ ఇండియా టుడే సర్వే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటుందని, కర్ణాటకలోనూ సి ఓటర్ సర్వే అంచనాలు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ 15 పార్లమెంటు స్థానాలు గెలుస్తుందని సి ఓటర్ సర్వే అంచనా వేసింది. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నార నేది స్పష్టం అయింది.
దీన్నిబట్టి మరో అయిదు పార్లమెంట్ స్థానాలు టీడీపీ గెల్చుకోవడం ఖాయం. మా పార్టీ వారిలాగా 175 కు 175 స్థానాలను గెలుస్తామని నేను చెప్పను కానీ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 131పైగా అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందన్నారు. నా గత సర్వేలు, ప్రస్తుత సి ఓటర్ సర్వే ప్రాతిపదికన నేను ఈ విషయాన్ని చెబుతున్నాను.
ఐప్యాక్ సర్వే కూడా బయటకు వచ్చిన తర్వాత అధికార పార్టీ కేవలం నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉందని తేలిపోయింది. ఐప్యాక్ సర్వేకు, సి ఓటర్ సర్వేకు పెద్ద తేడా ఏమీ లేదు. టైమ్స్ నౌ సర్వేను సాకుగా చూపెడుతూ బిజెపి నాయకత్వాన్ని, మా పార్టీ నాయకులు మభ్య పెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కానీ బిజెపి నాయకులకు సర్వే అంచనాలు తెలియనివా?
వారు మా పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిల్లో లేరు. సి ఓటర్ సర్వే అంచనాలను సాక్షి దినపత్రిక ప్రచురించలేదు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అంచనాలను ఏ దినపత్రిక కూడా రాసుకోదు. సి ఓటర్ సర్వే అంచనాలతో మబ్బులన్నీ తొలగిపోయాయి. రానున్నది ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వమే. దెబ్బతిన్న తెలుగు వారందరూ జయమ్ము నిశ్చయంబురా అని విజయ గీతం ఆలపించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల విజయం తథ్యం. దోపిడీ వ్యవస్థ పరాజయం ఖాయం. ఈ ప్రభుత్వ ఆరాచకాలను ఇకనైనా ధైర్యంగా అడ్డుకోవాలన్నారు.
అవార్డులన్నీ నాకే వచ్చినంత ఆనందం ఉంది
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు నేషనల్ ఫిలిం అవార్డులు లభించడంతో అవార్డులన్నీ నాకే వచ్చినంత ఆనందంగా ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పుష్ప చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిరు అంగవైకల్యం ఉన్న పాత్రలో అల్లు అర్జున్ నటన అద్భుతమని పేర్కొన్నారు.
గత 69 సంవత్సరాలుగా నేషనల్ ఫిలిం అవార్డుల జ్యూరీ తెలుగు చిత్రాలను, హీరోలను విస్మరించింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు అద్భుత నటులను విస్మరించి, తప్పు చేసింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆరు అవార్డుల లభించడం, ఆ అవార్డులన్నీ నాకే వచ్చినట్లుగా అనుభూతి కలిగిస్తోంది. అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య నా నియోజకవర్గ పరిధిలోని పాలకొల్లు వాస్తవ్యులు.
అల్లు అర్జున్ స్వయంకృషితో శిల్పం తానే శిల్పి తానే అయి అంచలంచలుగా ఎదిగి, ఐకాన్ స్టార్ గా అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు .. ఆర్ ఆర్ ఆర్ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, గాయకుడు కాలభైరవ లు వాస్తవంగా పశ్చిమగోదావరి జిల్లా వాస్తవ్యులే. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతానికి చెందిన వారిని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. మా జిల్లాకు చెందిన వారికి నేషనల్ అవార్డుల పంట పండడంతో ఆనందంతో నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని తెలిపారు.
ఉరవకొండ సంఘటన శాంపిల్ మాత్రమే… మరిన్ని అరాచకాలు వెలుగులోకి వస్తాయి
ఉరవకొండ నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదు, ఓట్ల నిర్మూలనకు సహకరించి సస్పెండ్ అయిన ఇద్దరు అధికారుల సంఘటన శాంపిల్ మాత్రమేనని, మరిన్ని అక్రమాలు త్వరలోనే వెలుగులోకి వచ్చి అధికారులపై వేటుపడడం ఖాయమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఫారం ఏడును దరఖాస్తు చేసి నాలుగు వేల ఓట్లకు తక్కువ కాకుండా ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని మంత్రి నాగార్జున చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఒకవైపు దొంగ ఓట్ల నమోదు, ఓట్ల నిర్మూలనకు సహకరించిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్న, మంత్రి నిర్భీతిగా చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలు అంటే వారికి ఎంత గౌరవం ఉందో తెలియజేస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదు, ఓటర్ల నిర్మూలనపై అధికార పార్టీ పాల్పడుతున్న అవకతవకలని వివరించడానికి ఈనెల 28వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కలుసుకోనున్నారని తెలిసి, మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా కలవాలని నిర్ణయించుకోవడం విడ్డూరంగా ఉంది.
గత ఆరు నెలల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ పదేపదే ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుండగా, ఇప్పుడు దొంగ దొంగ అన్నట్లుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. గత మూడేళ్లుగా పులివెందులలో నివసించని జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో ఓటు ఉన్నట్లుగానే, ఇతరులకు కూడా ఎక్కడ ఓటు ఉండాలో నిర్ణయించుకునే అధికారాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
ఎవరైనా బూతు లెవల్ ఆఫీసర్లు ఐదు మంది కంటే ఎక్కువ ఓటర్లను జాబితాలో నుంచి తొలగిస్తే వారిపై విచారణ చేయాలని ఆదేశించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎవరైనా అధికారులు వెధవ పనులు చేస్తే, సస్పెండ్ కావడం కాదని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించబడతారని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప దెబ్బ వంటి ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ, సాక్షి దినపత్రిక మార్గదర్శి సంస్థ పైన వక్రీకరణ రాతలను మాత్రం రాయడం మానలేదన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులైన వైయస్ భాస్కర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ తిరస్కరణ కోసం సిబిఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనల గురించి వార్తా కథనంలో ప్రస్తావించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు చేసిన వాదనలని వార్తా కథనంగా రాయడం సాక్షి దినపత్రిక కే చెల్లిందని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు.