– నందమూరితో ఆ శకం ముగిసిందా?
తెలుగు మిత్రులారా,
యునెస్కో అంచనా ప్రకారం భారత దేశం లో ఏ పెద్ద భాషకు ప్రమాదం లేదు. కానీ తెలుగు బ్రతకటం కుదరదు. భాషతో పాటు మన సంస్కృతి, ఆటలు, పాటలు, చరిత్ర, విజ్ఞానం చివరకు మన జాతే అంతరించే ప్రమాదం లో ఉన్నది. స్వాభిమానాన్ని కోల్పోయిన తెలుగు వారు ఇకనైనా మేల్కొనాలి!
తెలంగాణ లో ఎన్నికలు జరుగబోతున్నాయి. తెలుగు ఉద్యమకారులం అని చెప్పుకునే వారు ఎక్కడ కళ్ళు మూసుకొని పడుకున్నారు? తెలుగు భాషను కార్యాలయాలలో, న్యాయ స్థానాల్లో, బడుల్లో వాడతామని మీ ప్రణాళికలో చెప్పండి అని పార్టీలను అడగటం లేదేమి? నందమూరి తోటే ఆ శకం ముగిసిందా?
తెలుగు కోసం పనిచేస్తాము అని చెప్పటమే కాక ఆచరణలో కూడా చూపిస్తున్న వారిని మనం మెచ్చుకోవాలి. లేకపోతే వారు కూడా తెలుగుకు దూరం అయ్యే ప్రమాదం ఉన్నది. ఉద్యమకారులు ఒక పార్టీకి పరిమితం కారు. ఏ పార్టీని ద్వేషించరు. కాని తెలుగు కోసం పనిచేస్తాం అనే వారిని, పని చేస్తున్న వారిని ఆ మేరకు సమర్థించక పోవటం సరికాదు. అలా చేస్తున్నప్పుడే మిగిలిన వారికి కూడా కదలిక వస్తుంది. గుర్రాన్ని, గాడిదను ఒకే గాడిన కట్టటం న్యాయమా?
రెండు తెలుగు రాష్ట్రాల లోని కుటుంబ పార్టీలు తమ కుటుంబాల పాలన కొనసాగింపు కోసం పని చేస్తాయి తప్ప తెలుగు సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఉన్నత స్థితి కోసం పని చేయవు. తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలు గా పని చేస్తున్నారు.
భారత దేశం లో నిజానికి మూడు రాజకీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. అవి 1. కమ్యూనిస్ట్ పార్టీ 2. మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ 3. భారతీయ జనతా పార్టీ. వీటికి మాత్రమే ఆర్ధిక వ్యవస్థ గురించి ఒక ఆలోచన ఉంటుంది. మొత్తం దేశపు మనుగడ గురించి ఆలోచిస్తారు. మొదటివి రెండు అధికారంలో లేవు. కానీ అవి తెలుగు భాష గురించి పని చేస్తాము అని చెబుతున్నాయి. అవి అధికారంలో ఉన్నా లేకున్నా తెలుగు కోసం పోరాటం చేస్తాయి అని ఆచరణలో తేలింది.
రాష్ట్రం లో లేకపోయినా, కేంద్రం లో అధికారం లో ఉన్న భాజపా తెలుగు కోసం ఏమి చేసిందో చూద్దాం:
మోడీ నాలుగు సార్లు, తెలుగు వారికి ఎంతో దూరంగా ఉన్న గుజరాత్ కు, ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్య పట్టణం అహ్మదాబాద్ లోనే కాకుండా, సూరత్ లాంటి చోట్ల కూడ తెలుగు మాధ్యమ బడులను నడిపాడు. ఆ బడుల వినోద కార్యక్రమాలకు హాజరయి కొంత తెలుగులో మాట్లాడేవాడు. ఇంకే ఇతర ముఖ్యమంత్రికి ఇంత తెలుగు ప్రేమ లేదు.
తను ప్రధాన మంత్రి అయ్యాక ఇక్కడి కేంద్ర ప్రభుత్వ బడులలో కూడా తెలుగును ఒక విషయంగా తప్పనిసరిగా చెప్పాలని ఆదేశించాడు. ఎక్కడ మాట్లాడినా, బడి చదువులు తల్లి భాష లోనే ఉండాలని, చెప్తూనే ఉంటాడు.
జిల్లా స్థాయి వరకు న్యాయస్థానాలు తెలుగులో తీర్పులు ఇవ్వాలని ఆదేశాలు (జి.ఓ.) ఉన్నా, తెలుగు ప్రభుత్వాలు చెత్త భాష తెలుగులో తీర్పులు రాకుండా, జాగ్రత్తపడుతుంటాయి. కానీ ఈయన మాత్రం సుప్రీం కోర్ట్ లో తీర్పులను తెలుగులో ఇప్పిస్తున్నాడు.
2008 లోనే తెలుగుకు విశిష్ట భాష హోదా వచ్చినా, దానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులను ఇస్తామన్నా, 15 ఏండ్ల తరువాత కూడా ఆ సంస్థకు ఒక ఇల్లు కూడ చూపించక, తెలుగు ప్రభుత్వాలు చాలా జాగ్రత్తపడ్డాయి. ఓ వెంకయ్య ద్వారా దానిని, మైసూరు నుంచి నెల్లూరు లోని ఒక ప్రైవేటు ఇంటికి బలవంతంగా మార్చాడు. అందులో పాల్గొన్న మండలాధికారి సస్పెండ్ అయ్యాడు అనుకోండి అది వేరే విషయం.
తెలుగు ప్రభుత్వాలు, ప్రాధమిక మాధ్యమంగా పనికి రాని రోత భాష తెలుగు , అని తేల్చి వేసాయి. ఇంకే దేశంలోనూ, భారత దేశం లోని ఇంకే రాష్ట్రం లోనూ ఒక భాషకు ఇటువంటి గౌరవం ఇవ్వటం లేదు. మోడీకి ఇది అర్హం కాక, బడి చదువులు తల్లి భాష లోనే ఉండాలని, జాతీయ విద్యా విధానాన్ని తెచ్చి, మన నెత్తి మీద తెలుగు బరువును పెట్టబోతున్నాడు.
ఒడియా, కన్నడ, అరవ, ఉర్దూ, కోయ, బోయ, ఆంగ్ల భాషలు మాధ్యమాలుగా పనికి వస్తాయి కానీ, లేకి భాష తెలుగు పనికి రాదు అని ఆంధ్ర ప్రభుత్వం ఒక అంచనాకు వస్తే.. మోడీ మాత్రం కృష్ణ మోహన్ అనే ఒక న్యాయవాదిని పెట్టుకొని, హైకోర్ట్ లో తెలుగును కూడా కొనసాగించాలని గట్టిగా వాదించి గెలుపు సాధించాడు. ఇప్పుడు ఆయన గారు న్యాయమూర్తి అయ్యారు.
ప్రపంచ మేధావులు, అన్ని దేశాల ప్రభుత్వాలు, విద్య విషయాలపై వేసిన అన్ని సంఘాలు, కమిషన్లు, మన రాజ్యాంగం, ఇంత వరకు వచ్చిన అన్ని చట్టాలు తప్పక తల్లి భాష లోనే బడి చదువులు ఉండాలని చెబుతున్నాయని మోడీ అంటున్నారు.
కే. జి. నుంచి పి.జి. వరకు అ, ఆ లు నేర్చుకోకుండా, ఉద్యోగంలో చేరి రిటైర్ అయ్యే దాక తెలుగు తెలియకుండా , తెలుగు నాట ఉద్యోగులు మనుగడ సాగించే లేకి పరిస్థితులను, మన ముఖ్య మంత్రులు కలిగిస్తున్నారు. కానీ మోడీ చేసే పని: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ( ఐ. ఏ. ఎస్., ఐ.పి.ఎస్. లాంటి వారు)- బెంగాలీ, ఒరియా, మలయాళం వారైనా – తెలుగునాట కొలువు లోకి చేరితే తెలుగు నేర్వాల్సిందే. లేకపోతే వారికి ఉద్యోగం కన్ఫర్మ్ చేయరు, జీతాలు పెంచరు, పై స్థాయికి పోనివ్వరు.
కేంద్రం నిర్వహించే జాతీయ స్థాయి కళాశాల ప్రవేశ మరియు ఉద్యోగ పరీక్షల్లో ఇప్పటి వరకు మాధ్యమాలుగా ఆంగ్లం, హిందీ, గుజరాతీలే ఉండేవి. ఇప్పుడు తెలుగును కూడా చేరుస్తున్నాడు.
ఐ. ఏ. ఎస్ పరీక్షలను కూడ తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తున్నారు. వారు ఇతర రాష్ట్రాల లోనే జీవితం అంతా పని చేసే అవకాశమే ఎక్కువగా ఉన్నా.
రెండు తెలుగు ప్రభుత్వాలు న్యాయమూర్తి, మండలాధికారి, ఎలెక్ట్రికల్ హెల్పర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా తెలుగు మాధ్యమం లో పరీక్షలు పెట్టవు; కనీసం ఒక విషయం గా కూడా తెలుగు ఉండదు. ఇక్కడి గ్రామీణ బ్యాంకు, రైల్వే, పోస్టల్ ఉద్యోగాలకు జరిగే పరీక్షల్లో ఒక విషయంగా కాదు, తెలుగు మాధ్యమం లోనే పరీక్షలు పెడుతున్నారు మోడీ.
తెలుగు వారు ఎక్కువ ఉండే హ్యూస్టన్ (టెక్సాస్) లో ‘హౌడీ మోడీ – (ఎలా ఉన్నావు మోడీ)’ అని సమావేశంలో అరుస్తుంటే ” నేను బాగున్నాను” అని విదేశాన కూడా తెలుగులో చెప్పాడు. రాష్ట్రం దాటితే మన వారు తెలుగులో మాట్లాడరు.
ఇప్పుడు ఇక ఈయన తెలుగులో ఇంజనీరింగ్, మెడిసిన్ నేర్పిస్తాడట! దాని కోసం విశ్వ విద్యాలయాలలోని మేధావులను ఎన్నుకొని పాఠ్య పుస్తకాలను తయారు చేయిస్తున్నారు.
కంప్యూటర్లకు, ఫోన్లకు, తెలుగు నేర్పండి అని హైదరాబాద్ ఐ.ఐ.ఐ.టి. వారికి కావలసినంత డబ్బులు ఇచ్చాడు. ముందుగా తెలుగు కోసం ఇలా మోడీ ఇచ్చాడు అన్న విషయాన్ని గమనించాలి.
95% మంది తెలుగు వారికి రాని, గురజాడ గేయం లోని ఒక చరణాన్ని చూడకుండా పాడగలడు.
తెలుగు భాషా దినోత్సవాన్ని తెలుగులో జరిపాడు మోడీ.
తెలుగు వారందరికీ నారాయణ గత్తర గట్టిగ తగులుకొన్నది. పిల్లలు అసలు తెలుగు నేర్చుకోకుండా ఉంటే చాలా గొప్ప వారు అవుతున్నారు అనుకుంటున్నాం. మనం బడులలో తెలుగే పనికి రాదురా బాబో అంటుంటే, ఈయన జాతీయ విద్యా విధానంలో 8వ తరగతి వరకు ( 5వ తరగతి వరకు తప్పకుండా) తెలుగు మాధ్యమం లోనే బడి చదువులు ఉండాలి అని గట్టి పట్టు పడుతున్నాడు.
ఐలయ్య లాంటి తెలుగు ద్రోహులు “ మీ పిల్లలు ఆంగ్ల మాధ్యమం లో చదివి అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల కొలువుల్లో చేరతారు; వెనుక బడిన కులాల పిల్లలు ఇక్కడ ప్రభుత్వ బడుల తెలుగు మాధ్యమం లో చదివి అటెండర్లగ, కానిస్టేబుల్ గ పని చేయాలా?” అని అడిగితే, తెలుగు ఉద్యమకారులు తెల్ల మొగం వేస్తున్నారు. దీనికి కేంద్ర విద్యా శాఖ మంత్రి తగు సమాధానం చెప్పాడు. ప్రభుత్వ, ప్రైవేట్ బడులలో కూడా ప్రాధమిక విద్య తెలుగు మాధ్యమం లోనే ఉంటుంది అని తెగేసి చెప్పాడు.
మనలో కొంత మంది మిడి మిడి జ్ఞానం కల వారు “ అంతా బాగుంది కానీ ఆచరణ లో అది జరగటం లేదేమిటి?” అని అడుగుతున్నారు. విద్య ఉమ్మడి జాబితా లో ఉన్నది అని వీరు తెలుసుకోవాలి. రాష్ట్ర స్థాయి లో కూడా మనం అనుకున్నట్లు జరగాలంటే డబల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి.
తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ, ప్రైవేట్ బడులలో తెలుగు మాధ్యమాన్ని ఎత్తి వేశారు. గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలలో మాత్రం తెలుగు మాధ్యమ బడులు కొనసాగుతున్నాయి.
భాగ్య నగరం లో వాడుక భాష గా తెలుగు కనుమరుగు అయింది. మీరు ఎక్కడకు వెళ్ళినా హిందీ/ఉర్దూ లోనే మాట్లాడాలి. అందుకని “ఉర్దూ కు అధికార భాష హోదాను తీసివేస్తాం, తెలుగును వాడుక లోకి తెస్తాం” అని బండి సంజయ్ అనటం కొసమెరుపు!
తెలుగు వారికి కనువిప్పు కలగాలి. తెలుగు ఉద్యమకారులం అని గొప్పలు చెప్పుకునే వారు జనానికి విషయాలను వివరించాలి. “తెలుగు వారికి ఏ మాత్రం ఆత్మాభిమానం లేదు. డబ్బులు ఇస్తే పంది పెంట కూడ తింటారు” అని ఇతరులు ఇక అనుకోకూడదు. కుటుంబ పార్టీలకు కాదు, రాజకీయ పార్టీలకు ఓటు వేయాలి.
– బోడెపూడి రాజేంద్ర ప్రసాద్
చికాగో,
ఇలినోయిస్.