– జూలై 15 నాటికి గుంతలు లేని రహదారిని చూపించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా
– వెంకయ్యనాయుడుపై రాష్ట్రంలో అకస్మాత్తు ప్రేమ
– అగ్నిపథ్ ఆందోళన స్పాన్సర్డ్ పోరాటం.
– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
ఆత్మకూరులో బీజేపీ అభ్యర్ధి అంత బలహీనుడయితే, మరి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడెందుకు మోహరించిందో చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ప్రశ్నించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఓటుకు రెండు వేలరూపాయలిచ్చింది. మండలాల వారీగా మంత్రులను నియమించింది.
వాలంటీర్ల ద్వారా ప్రచారం నిర్వహించింది. అంటే బీజేపీ అభ్యర్ధి బలమైనవాడా? బలహీనుడా? అని సత్యకుమార్ ప్రశ్నించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో కలసి ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు.
సత్య ఏమన్నారంటే… ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ యంత్రాంగం అంతా మొహరించారు. సానుభూతితో పాటు ఆర్థికంగా బలమైన అభ్యర్థి అని గెలుపు పై వైసీపీ వారు నమ్మకం పెట్టుకున్నారు. బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ తమకు పోటీ కాదని వైసీపీ నేతలు చెప్పారు. మరి బలహీనమైన అభ్యర్థి అయితే, మండలానికి ఇద్దరు మంత్రులను నియమించాల్సిన అవసరం ఏంటి?
ప్రతి ఓటరుకు రెండు వేల రూపాయలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు వారిని నిలదీస్తున్నారు.వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం అంతా బూటకం.
రాష్ట్రంలో రహదారులపై ముఖ్యమంత్రి సమీక్షలు తప్ప పనులు జరగటం లేదు. రూ 2,500 కోట్లు రహదారులకు కేటాయించామని చెప్పారు. అవి ఏమయ్యాయో తెలియదు.
రహదారుల మరమ్మతుల నిధులు పెంచుకుంటూ పోతానని చెప్పారు. కానీ పనులు జరిగింది లేదు. ముఖ్యమంత్రి చెప్పినా పనులు ఎందుకు ముందుకు జరగటం లేదు?
సీఎంకు చిత్తశుద్ధి లేదా… లేకపోతే సీఎం ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదా?
మూడేళ్లుగా ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారు.జూలై 15 నాటికి గుంతలు లేని రహదారిని చూపించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా
అగ్నిపథ్ ఆందోళనలు రాజకీయ నిరుద్యోగులు చేస్తున్నవే. యువతకు అద్భుతమైన అవకాశాలు అగ్నిపథ్ ద్వారా లభిస్తాయి. హైదరాబాద్ లో జరిగిన ఆందోళన స్పాన్సర్డ్ పోరాటం.
వెంకయ్యనాయుడుపై రాష్ట్రంలో చాలామందికి అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. గతంలో చాలా రకాల పదవులు చేపట్టారు. పార్టీ తనకు చాలా అవకాశాలు ఇచ్చిందని వెంకయ్యనాయుడు పదేపదే చెప్పారు. ఉప రాష్ట్రపతి అవకాశం కూడా బిజెపి ఇచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్న అసత్య ప్రచారం పై వెంకయ్యనాయుడు కూడా ఆవేదన చెందారు. 70 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆయన చాలాసార్లు చెప్పారు.
విలేఖరుల సమావేశంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు తాళ్ల వెంకటేష్ యాదవ్ బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్ బిజెపి రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.