–ఏపీ కాబోయే సీఎం షర్మిల
-ఏపిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిల నే
-బీజేపీ అంటే బాబు,జగన్,పవన్
-వైఎస్సార్ పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు వారసుడు కాదు
-షర్మిల నిలబడేదాకా ఆమెకు దన్నుగా ఉంటాం
– వైఎస్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి షర్మిల సీఎం కావడం ఖాయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమేరకు ఆమె నిలదొక్కుకునేవరకూ తాము దన్నుగా నిలుస్తామన్నారు. ఒకవేళ పులివెందులలో జగన్ రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే తాను పులివెందుల గల్లీలో తిరిగి షర్మిలను గెలిపిస్తానన్నారు. వైఎస్ పేరు చెప్పి వ్యాపారాలు చేసుకునేవాడు ఎప్పటికీ ఆయన వారసుడు కాలేడదని, వైఎస్ ఆశయ సాధనకు పోరాడుతున్న షర్మిల మాత్రమే, వైఎస్ నిజమైన వారసురాలు అని వైసీపీ అధినేత జగన్‌రెడ్డికి రేవంత్ చురకలు అంటించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపదాస్ మున్షీ, ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీలు కెవిపి రామచంద్రరావు, అంజన్‌కుమార్‌యాదవ్ హాజరయ్యారు.
ఇంకా రేవంత్ ఏమన్నారంటే.. 2024 లో ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల ను చూస్తాం. కుటుంబ సభ్యులకు వారసత్వం రావడం కాదు. ఆయన ఆశయాలను కొనసాగించే వాళ్ళే నిజమైన వారసులు. వైఎస్సార్ పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు వారసుడు కాదు. కడపకు ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. నిజంగా ఉప ఎన్నికలు వస్తె కడప లో గల్లి గల్లి తిరిగే భాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడ పొగుట్టుకున్నాం అక్కడ నుంచే గెలుపు సాధిస్తాం.
వైఎస్సార్ జ్ఞాపకాలు మనకు శాశ్వతం. వైఎస్సార్ సంక్షేమ పథకాల సృష్టి కర్త. మన కుటుంబంలో వైఎస్సార్ ఒకరు. వైఎస్సార్ జ్ఞాపకాలు కాలం గడిచిన కొద్దీ పేదవాళ్ళ గుండెల్లో బల పడుతున్నాయి. వైఎస్సార్ లేని లోటు మనకు స్పష్టం గా కనిపిస్తుంది. ఆయన లేని లోటు ఈ సమాజం చర్చ చేస్తుంది. ఇక్కడ పార్టీ బలహీనంగా ఉన్నా అభిమానులకు కొదువ లేదు.
వైఎస్సార్ తో నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. మొదటి సారి శాసనమండలి లో నేను అడుగు పెట్టా. వైఎస్సార్ దృష్టిలో పడాలని మండలిలో బలమైన వాదనలు వినిపించే వాడిని. పిల్లవాడు అని కాకుండా వైఎస్సార్ ప్రతి అంశానికి సమాధానం చెప్పే వాడు. కొత్తగా సభలో వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నారు అనే వాడు. వాళ్లకు మనం అవకాశం ఇవ్వాలని అనే వాడు. కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చొనే వాడు. ఇదే నాయకుడు లక్ష్యం.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్ తీరు మనకు ఆదర్శం. ఎవరు వినతి పత్రం ఇచ్చినా…అందరికీ సమయం ఇచ్చే వాడు. ప్రజా దర్బార్ లో అన్ని విజ్ఞప్తులు స్వీకరించే వాడు. వైఎస్సార్ పాలన ఒక చెరగని ముద్ర. ఏపిలో ఇవ్వాళ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు 14 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు.
అనాడు ఏపిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చాడు. ఇప్పుడు అదే స్ఫూర్తి తో రాహుల్ పాదయాత్ర చేశాడు. రాహుల్ జోడి యాత్ర తో కర్ణాటక,తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. మూడోసారి మోడీ గెలిచినా అది గెలుపు కాదు.
వైఎస్సార్ అంటే మడమ తిప్పేది లేదు…మాట తప్పేది లేదు. ఇవ్వాళ ఏపిలో షర్మిల అలుపెరుగని పోరాటం చేస్తుంది. 2009 నుంచి ఈనాడు వరకు షర్మిల ప్రజల మధ్యనే ఉంది. ప్రతిపక్ష హోదా నుంచి 2004 లో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 1999 స్ఫూర్తిని వైఎస్ షర్మిల ఏపిలో కొనసాగిస్తుంది. ఏపిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిలనే.
ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ అంటే బాబు,జగన్,పవన్. ఇక్కడ అంతా పలక పక్షమే. అంతా బీజేపీ పక్షమే. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజల పక్షం వైఎస్ షర్మిల మాత్రమే. షర్మిల మాత్రమే ప్రజా సమస్యల మీద కొట్లాడుంది.
వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడం కోసమే షర్మిల భాద్యతలు తీసుకున్నారు. ఏపిలో కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు మేము అండగా నిలబడతం. ఇవ్వాళ మంత్రి వర్గాన్ని మొత్తం తీసుకు రావడం ఇందుకు నిదర్శనం. షర్మిల ప్రయత్నాలను బలోపేతం చేస్తాం. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ రావాల్సి ఉంది. మణిపూర్ లో ఉన్న పరిస్థితులు కారణంగా రాలేక పోయారు. రాహుల్ ఆదేశాలతో ఆయన వ్యక్తిగా నేను ఈ కార్యక్రమానికి వచ్చా.