– రైల్వే జోన్ పై ఈనాడు-ఆంధ్రజ్యోతి విష ప్రచారం
– ఆ సమావేశంలో రైల్వే జోన్ ప్రస్తావనే రాలేదు
– మీ రాతలు అవాస్తవాలు అని తేలితే బహిరంగ క్షమాపణలు చెబుతారా..?
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి సవాల్
విశాఖ రైల్వే జోన్ పై ఈనాడు- ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విభజన సమస్యలపై నిన్న జరిగిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావనకే రాలేదన్నారు. ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఊహల్లో బతుకుతూ, కలలుగంటూ, వాటిని ప్రజల మీదకు రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తేలితే.. వారిద్దరూ బహిరంగంగా క్షమాపణలు చెబుతారా అని సవాల్ విసిరారు. రైల్వే జోన్ రాకపోతే.. తాను రాజీనామా చేస్తానని చెప్పారు.
విజయసాయిరెడ్డిగారు మాట్లాడుతూ.. ఏమన్నారంటే…ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో బ్యానర్ వార్తలుగా.. “ఆంధ్రరాష్ట్రానికి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రావట్లేదని, ఇది కలగా మిగిలిపోతుందని” వార్తలు రాశాయి. స్వయాన కేంద్ర రైల్వే శాఖమంత్రిని మా వైయస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యుల బృందం కలిసినప్పుడు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అతిత్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పూర్తిగా అవాస్తవాలను, రాజకీయంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడు చేయాలనే దురుద్దేశపూర్వకంగానే ఇటువంటి రాతలను రాస్తున్నాయి. నిన్న రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో రైల్వే జోన్ ప్రస్తావనే రాలేదు. అలాంటిది, రైల్వే జోన్ అంశంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయి.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే లక్ష్యంతో, ఒక కుల ప్రాతిపదికతో ముందుకెళ్తున్న ఆ పత్రికలను ప్రజలు నమ్మరు. ఈ రెండు పత్రికల్లో రాసే విషయాలను నమ్మొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
పునర్విభజన చట్టంలో రైల్వేజోన్ కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పబడింది. రాజధాని ఎక్కడైతే ఉందో, ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలు కలిసే విధంగా రైల్వే లైన్ నిర్మించి, హైదరాబాద్ ను కనెక్ట్ చేయాలనే అంశంపై చర్చ జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రం వాటా సొమ్ము ఇవ్వాలనేది కేంద్ర ప్రతిపాదన. పునర్విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి, కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసి, హైదరాబాద్ కు కనెక్ట్ చేయాలని, ఆ మొత్తం నిధులను కేంద్రమే భరించాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన.. దీనికి సంబంధించి చర్చ వచ్చింది. అంతే కానీ విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి చర్చ రాలేదు.
విశాఖ రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది.. రైల్వే జోన్ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నూటికి నూరుశాతం విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురించిన వార్త అవాస్తవం అని తెలితే, బహిరంగంగా రామోజీ, రాధాకృష్ణ క్షమాపణ చెబుతారా? ఇటువంటి అవాస్తవాలను ప్రచురించి, మీ యొక్క కులాభిమానాన్ని చూపించుకుని, మీ స్థాయిని మీరు దిగజార్చుకోవద్దు అని రామోజీ, రాధాకృష్ణలకు హితవు చెబుతున్నాను.
రైల్వే జోన్ రాదు అన్నది… ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లు కన్న కల.. ఆ విధంగా వారే ఒక కల గని, వారే ఊహించేసుకుని వారి పేపర్లలో అబద్ధపు వార్తలు రాస్తారు. ఇది పూర్తిగా అవాస్తవం. నూటికి నూరు శాతం రైల్వో జోన్ వచ్చి తీరుతుంది. రైల్వే జోన్ వస్తే.. రామోజీ, రాధాకృష్ణలు వారి పత్రికలను మనకి ఇచ్చేస్తారా? రైల్వే జోన్ రాకుంటే నేను రాజీనామా చేస్తా.. అని విజయసాయిరెడ్డి చెప్పారు.