Suryaa.co.in

Entertainment

ఆ స్వరంలో సుర..

అమృతభాండం కోసం
దేవతలు…రాక్షసులు..
తగవులు పడుతుంటే
దిక్కు తోచక మోహిని
అందాక..ఎవరికీ అందక..
వేల్పులకు అందేదాకా
దాచి ఉంచిందేమో
గందరగోళంలో
ఆమె గళంలో
ఓలలాడిస్తుంది
కదాని భూగోళంలో
లతమ్మ స్వరమై
ఆనాటి మోహినిని మించి
సమ్మోహనమై..!

కిలకిలమంటూ ఇలను
అబ్బురపరిచే
ఎల కోయిలమ్మలు
ఎన్ని లక్షలసార్లు
తామే అచ్చెరువొంది ఉంటాయో తమని మించి
మాధుర్యాన్ని
ఆమె గొంతులో పొదివి
తమకు దేవుడెంతటి అన్యాయం చేశాడని..!

ఒకనాటి గ్రామ్ ఫోనులు
ఈనాటి ఇయర్ ఫోనులు
ఎంతగా పులకించి ఉంటాయో!
రికార్డింగు ధియేటర్లలో మైకులు
సినిమా థియేటర్లలో స్పీకర్లు
ఎంతలా తడిచి
ముద్దయినాయో కదా
ఆ సరిగమపదాలకు..
వినోదంగా మ్రోగుతూ…
వినమ్రంగా మొక్కుతూ
ఆమె పాదాలకు..!

లతా మంగేష్కర్..
ఆ స్వరమంటే
నెహ్రూ నుంచి
మోడీ వరకు ప్రాణం..
రఫీ మొదలు కుమార్ సాను
దాకా ఆమెతో
పాడడమంటే పిచ్చి..
నాడు నౌషాద్…
నేడు రెహ్మాన్
మధ్యలో ఎందరో
సంగీత దర్శకుల శ్రేణి
మెచ్చి ఆమె వాణి..
అద్భుతంగా కట్టి ప్రతి బాణి..
సహస్ర సిత్రాలు సుసంపన్నమై..
కోట్లాది అభిమానులు
లతాజీ గంధర్వ గాత్రానికి
దాసోహమై..!

మచ్చుకు కొన్ని పాటలు చెబుదామంటే
ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే
అభిమానానికి
ఎక్కడ మొదలెట్టాలో
తెలియక తికమక..
లతమ్మ నవ్వదా
మధురస్వరంతో పకాపకా!
యాభైవేల పాటల్లో ఏవని..
పులకించలేదా అవని..
మిలే సురు మేరా తుమారా
తో సూర్ బనే హమారా..
తమ జాతి రత్నమని మెచ్చి
అత్యున్నత పురస్కారమిచ్చి
మురిసిపోలేదా భారతావని!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE