అభిమానుల అంతరంగం.. కళాకారుల కార్యరంగం..!

ఒకనాడు సినిమాకి అమ్మ
కళాకారులకు జేజమ్మ..
నటనకు పుట్టిల్లు..
పద్యాలకు మెట్టినిల్లు..
నాడు హౌస్ ఫుల్లు..
నేడు కలెక్షన్ నిల్లు..!

జీవితమే రంగస్థలం
అన్నారు పెద్దలు..
రంగస్థలాన్నే
జీవితంగా చేసుకున్న
ఎందరో ఆర్టిస్టులు
ముందుగా తెరవెనుక
తర్వాత తెరపై ఏలికలై
కథానాయకులై..
సృష్టిస్తే చరిత్ర..
మురిసింది ధరిత్రి..!

హార్మనీ శ్రుతిలో
ఆరున్నొక్క రాగంలో
పాడితే పద్యం..
జెండాపై కపిరాజు
అందుకుంటే చప్పట్లు..
ముందు వరసలో చోటు కోసం సిగపట్లు..!

వేమూరి గగ్గయ్య..
బళ్ళారి రాఘవ..
ఈ మహానటుల స్వస్థానం
స్థానం వారి ఆస్థానం..
వేదాంతం కులుకుల ప్రస్థానం
విశ్వనాథ ఆదేశంతో
నందమూరి మీసంతోనే
ఆడ వేషం..
అంతకు ముందే అక్కినేని
అదే స్త్రీ పాత్రలతో రంగప్రవేశం…
రాజనాల..ధూళిపాళ..
ఎస్వీఆర్..గుమ్మడి..
మహానటులకు తొలి వేదిక
నాటకం నుంచే సినిమాకి
రావడం కళాకారుల వాడుక!

నాటకంలోనూ సందేశం..
కన్యాశుల్కం ప్రదర్శనలతో
జనాల్లో వీరావేశం..
జొన్నలగడ్డ సోదరుల
అభినయంతో రక్తికట్టిన
ప్రతి సన్నివేశం..
రక్తకన్నీరు నాగభూషణం
సినిమా ప్రవేశం..
మొత్తంగా నాటకమే
వెండి తెరకు ఎంట్రీ…
కళాకారుల ప్రతిభను
ఆవిష్కరించే పొయిట్రీ..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply