Home » వరి కొనుగోలు చేయకపోతే రైతులే రాజకీయంగా ఉరి వేస్తారు

వరి కొనుగోలు చేయకపోతే రైతులే రాజకీయంగా ఉరి వేస్తారు

-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
-అధికారంలో ఉండి ధర్నాలు రాస్తారోకోలు చేయడం విడ్డూరంగా ఉంది
-దేశ సంపదను అంబానీ, ఆధానిలకు కట్టబడుతున్న మోడీ
-ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ఇంకెప్పుడూ?
-పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

యాసంగిలో వరి కొనుగోలు చేయకపోతే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ కు రాజకీయంగా రైతులు ఉరి వేస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు.

రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి టిఆర్ఎస్ పాలకులు ఇక రాజకీయ డ్రామాలు ఆపాలన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పాలకులు తమ బాధ్యతను విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని గ్రామాల్లోకి వచ్చే బిజెపి, తెరాస నాయకులను వరి ధాన్యం కొనుగోలు పై నిలదీయాలని పిలుపునిచ్చారు.

ధరలు ఎందుకు పెంచుతున్నారో, మళ్లీ వాళ్ళే ఎందుకు ధర్నాలు చేస్తున్నారో జనాలే అడగాలన్నారు. ధర్మ మీటర్ లో పాదరసం పెరిగినట్టు మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, టిఆర్ఎస్ సర్కార్ కరెంటు చార్జీల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతూ వాళ్ళే ధర్నాలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. దొంగే దొంగా దొంగా అన్నట్లు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని నవభారత నిర్మాణం చేస్తే.. కోటి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసి, సింగరేణి, ఎయిర్ పోర్ట్, సీ పోర్టులను ప్రైవేటీకరణ పేరిట అంబానీ ఆదానిలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సంపదను కొల్లగొట్టి దేశ భవిష్యత్తును మోడీ అంధకారంలోకి నెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు?
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటి ఫికేషన్ వేస్తామని ప్రకటించిందన్నారు. మిగతా ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో వెల్లడి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 9న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటన చేసి 18 రోజులు దాటుతున్న అధికారికంగా నోటిఫికేషన్ వేయకపోవడం నిరుద్యోగుల్లో అనుమానాలను రేకెత్తిస్తుందని పేర్కొన్నారు. మరియమ్మ లాకప్ డెత్ పై జరిగిన న్యాయ పోరాటం నుంచి పుట్టిందే దళిత బంధు పథకం అని వివరించారు.

“దళిత బంధు డబ్బులు ఇప్పిస్తా నా వెంట రమ్మని కొందరు, లక్ష రూపాయలు ఇస్తే ఇప్పిస్తానని మరికొందరు ఇలా వసూలు దందా చేసే బ్రోకర్ల మాటలను నమ్మొద్దని, ఇలాంటి అక్రమ దందా పాల్పడేవారిని మహిళలు చీపిరి కట్ట తిరిగేసి కొట్టాలని” పిలుపునిచ్చారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అని, ఏ ఒక్కరికి రూపాయి కూడా ఇవ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రాతినిధ్యం వహించే మధిర నియోజకవర్గంలో బ్రోకర్లకు తావులేదన్నారు. పారదర్శకంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం చింతకాని లో ఇప్పించే బాధ్యత తనదేనని మరోసారి పునరుద్ఘాటించారు.

రాజకీయాలకతీతంగా దళిత బంధు డబ్బులు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని మంత్రి, కలెక్టర్కు గట్టిగా చెప్పానని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్న ప్రజల కన్నీళ్లు తుడవడానికే తాను పీపుల్స్ మార్చి నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. తన అడుగులో అడుగు వేసి కదం తొక్కితే ప్రభుత్వాలు దిగి రాక తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తన అడుగులు ఆగవని, పాదయాత్ర ఆగదని భట్టి స్పష్టం చేశారు.

రేకుల సంచుల ఇంటిని చూసి చలించిన భట్టి విక్రమార్క
చింతకాని మండలం రామకృష్ణాపురంలో పాదయాత్ర చేస్తున్న క్రమంలో దళిత కాలనీలో రోడ్డు పక్కన యూరియా సంచులు చుట్టు కట్టుకొని రేకుల కింద జీవనం సాగిస్తున్న సోమ రాజారత్నం కుటుంబాన్ని చూసి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చలించిపోయారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఆ కుటుంబం పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకొని భావోద్వేగానికి గురయ్యారు.

పెయింటింగ్ కూలి పని చేస్తున్న రాజరత్నం రెండేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితం అయ్యాడని ఆయన భార్య రజిని కన్నీటి పర్యంతం అవుతూ తన గోడును వెళ్లబోసుకుంది. తను కూలి పనికి వెళుతూ వచ్చిన రెండు వందల రూపాయల తోనే తన భర్త కు చికిత్స చేయిస్తూ మిగిలిన డబ్బులతో పిల్లలను సాకుతున్నానని, ఒక పూట తింటూ మరో పూట పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని విలపించింది.

ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించి పోయిన సీఎల్పీ నేత ఇల్లు మంజూరు చేయిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. వైద్యం చేయించేందుకు సహకారం అందిస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు. అదేవిధంగా రోడ్డుపై చేపలు అమ్ముతున్న వ్యాపారులను కలిశారు. చేపల పెంపకం, దిగుబడి, మార్కెట్ ధరల వివరాలను, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

భట్టి పాదయాత్రకు కదం తొక్కిన జనం
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత గౌరవనీయులు మల్లు భట్టి విక్రమార్క గారు మధిర నియోజకవర్గంలో చేపట్టిన పీపుల్స్ మార్చ్ (పాదయాత్ర) కు చింతకాని మండలం గాంధీ నగర్, రామకృష్ణాపురం, కొదుమూరు, *గ్రామాంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్మికులు, కర్షకులు, కూలీలు, నిరుద్యోగులు, వృత్తిదారులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, చిన్న, పెద్దలు, చంటి పిల్లల తల్లులు ఇలా సబ్బండ వర్గాలు *సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడుగులో అడుగు వేసి పీపుల్స్ మార్చ్ లో కధం తొక్కారు. డప్పు, డోలు వాయిద్యాలు, కోలాట నృత్యాలతో సందడి చేస్తూ సీఎల్పీ నేత విక్రమార్కకు గ్రామస్తులు వెల్ కమ్ చెప్పారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు.

ఈ క్రమంలో ప్రజల సమస్యలు ఆలకిస్తూ.. ఆత్మీయంగా పలకరిస్తూ.. ప్రజలకు అభివాదం చేసుకుంటూ భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగించారు. కాగా ఆయా గ్రామాల్లో మహనీయులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారక రామారావుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా గాంధీ నగర్, రామకృష్ణాపురం లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Leave a Reply