Suryaa.co.in

Political News

అదే `బటన్` రివర్స్ అయితే..

– వైసీపీలో రెడ్డి వర్గం అంతర్మథనం
వైసీపీ అధినేత సీఎం జగన్ అంటే.. వారికి అంతులేని అభిమానం ఉంది. గత ఎన్నికల్లో ఆయన సీఎం కావాలని.. కోరుకున్నారు. ఇంటా బయటా ప్రచారం చేశారు. ముప్పయి సంవత్సరాలు.. నాకు సీటు కావాలని జగన్ అంటే.. ఔను కావాలని.. వీరంతా కూడా ఆయనకు మద్దతు పలికారు. వారే.. వైసీపీకి కరడు గట్టిన అభిమానులుగా ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు.
ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు. ఇంత వరకుబాగానే ఉంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏ రెడ్డి వర్గమైతే.. జగన్ను సీఎంను కావాలని కోరుకుందో.. ఇప్పుడు అదే రెడ్డి వర్గం అంతర్మథనం చెందుతోంది.
రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగానే ఉంది. ఎక్కడికక్కడ దొరికిన కాడికి అప్పులు తెచ్చారు. అవీ చాలవం టే.. పన్నుల రూపంలో పెంచేసి.. ప్రజల నడ్డి విరుస్తున్నారనే టాక్ ప్రతిపక్షాల నుంచి జోరుగా వినిపిస్తోంది. ఒకటో తారీకున జీతాలు ఇవ్వట్లేదని.. ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
అదే సమయంలో అప్పులు ఎక్కువ చేస్తున్నారు.. ఇంతకన్నా ఇచ్చేది లేదని.. ఆర్బీఐ కేంద్రం నుంచి కూడా సమాచారం అందుతోం ది. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతోందనే విషయం .. జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది. ఇదిలా జరుగుతూ ఉంటే.. మరోవైపు.. సీఎం జగన్ మాత్రం తన మానాన తను `బటన్` నొక్కేస్తున్నారు.
వివిధ సంక్షేమ పథకాల పేరుతో.. వేల కొద్దీ కోట్లను ప్రజలకు పంచుతున్నారు. `ముష్టెత్తుకునైనా దానం చేస్తా నన్నడిగేదెవరు?!` అని.. ఓల్డ్ మూవీ అప్పుచేసి పప్పుకూడులో చెప్పినట్టుగా.. జగన్ వ్యవహారం ఉందని ఇంటా బయటా కూడా విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఇదే విషయం రెడ్డి సామాజిక వర్గంలోనూ చర్చకు దారితీసింది. “ఈయన బటన్ నొక్కడం ఏమో కానీ.. ఎన్నికల సమయంలో ఇదే బటన్ ను ప్రజలు రివర్స్గా నొక్కితే పరిస్థితి ఏంటి?“ అని నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్లు.. ఇటీవల నిర్వహించిన.. కార్తీక వనసమారాధనలో వ్యాఖ్యానించారు.
సంక్షేమం తప్పుకాదు. కానీ.. ఆదాయం లేదు.. అప్పులు చేసి మరీ.. వేల కోట్లు పంచుతున్నారు. దీని వల్ల లబ్ధి పొందేవారు.. సరే. కానీ.. పొందని వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో వారే రేపు ఎన్నికల బటన్ను రివర్స్లో నొక్కితే.. మన కొంపలు మునిగిపోవా?“ అని కీలక నేత ఒకరు బాహటంగానే వ్యాఖ్యానించారు.
దీనికి అక్కడే ఉన్న మరికొందరు రెడ్డి నేతలు.. కూడా ఔననే అన్నారు. అంటే.. సంక్షేమం శృతి మించితే.. ప్రమాదమేనని.. సంక్షేమంతో ప్రభుత్వాలు తిరిగి గద్దెనెక్కిన పరిస్థితి లేదని.. వారు సూత్రీకరించేశారు. ఈ క్రమంలోనే బటన్ నొక్కడం కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టాలనేది వారి సూచనగా ఉందనేది విశ్లేషకుల మాట.

– పులగం రమేష్

LEAVE A RESPONSE