• కోటి ఇరవై లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే కేవలం 25 లక్షల మందికి మాత్రమే చేయూత
• 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు రూ.3000/-లు పెన్షన్ ఇస్తానని, ఇవ్వకుండా జగన్ రెడ్డి మోసం చేశారు
• మూడున్నరేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు నష్టపోయిందాన్ని వడ్డీతో సహా చెల్లించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
మాజీ మంత్రి పీతల సుజాత, అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆచంట సునీత, ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుడిసె కృష్ణమ్మ
జగన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు చేయూత ద్వారా ఎంతో మేలు చేసినట్టు కుప్పం సభలో మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మాజీ మంత్రి పీతల సుజాత దుయ్యబట్టారు.. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..జగన్ రెడ్డి ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత మాట తప్పారు. మాట తప్పి మడమ తిప్పిన వ్యక్తి జగన్ రెడ్డి.
45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు రూ.3000/-లు పెన్షన్ ఇస్తానని నాడు జగన్ రెడ్డి గొప్పలు చెప్పి మోసం చేశారు. మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి. .. జగన్ రెడ్డి చెప్పిన మాటలని వివరిస్తూ….ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి అక్క చెల్లెమ్మలు వచ్చేది మన ప్రభుత్వమే. ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి అందరికి పించన్లు ఇస్తాం అని చాలా గొప్పలు చెప్పి పత్రికలలో కూడ ప్రచురించుకున్నారు.
నెలకు ఒక్కొక్కరికి రూ.3000 చొప్పున సంవత్సరానికి 36,000లు ఇవ్వాలి. దాదాపు కోటి మంది మహిళలకు ఐదు సంవత్సరాలలో లక్షా 86వేల రూపాయలు ఇవ్వాలి. కాని 75వేలు మాత్రమే ఇస్తామని చెప్పారు. అది కూడా విడతల వారిగా ఇస్తామని చెప్పారు. ఇది మాట తప్పి మడమ తిప్పడం కాదా? చేయాత పథకం ద్వారా 26లక్షల మంది మహిళలకు మాత్రమే 75వేల రూపాయలు ఇస్తున్నారు. ప్రతి మహిళకు లక్షా 5వేలు ఎగనామం పెట్టారు. మహిళా సంక్షేమం, మహిళలను ఉద్దరించడం అంటే ఇదేనా? ఇది మహిళలను మోసం చేయడం అనిపించడం లేదా?
చంద్రబాబు నాయుడు డ్వాక్రా అనే విత్తనం వేసి మహావృక్షంలా చేశారు. డ్వాక్రా గ్రూపులలోని మహిళలకు బ్యాంకు పొదుపుల గురించి ట్రైనింగ్ ఇచ్చారు. వారు తయారు చేసిన ఉత్పత్తులను విదేశాలలో అమ్ముకొనే విధానాన్ని నేర్పించారు. వాళ్లకు ఆంగ్ల బాషను కూడ నేర్పించి మహిళలను ఆర్ధికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. వాళ్ల కాళ్ళ మీద వాళ్లు నిలబడే విధంగా చేశారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా పెట్టేనాటికి జగన్ రాజకీయ ఓనమాలు కూడ దిద్దుండరు. నాడు జగన్ రెడ్డి తండ్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి కూడ ప్రతి ఒక్క మహిళను కోటిశ్వరరాలిగా చేస్తానని మాటఇచ్చి మడమ తిప్పారు.
నేడు జగన్ రెడ్డి వచ్చి మహిళలను ఉద్దరిస్తామని మాయ మాటలు చెప్పి మరింతగా మోసం చేశారు. రాజకీయ నాయకులు ఏ పథకం పెట్టాలనుకున్నా పేదరికాన్ని ఆధారంగా చేసుకొని పెడతారు. వయసుని ఆధారంగా చేసుకొని పథకాలు ఎవరు పెట్టరు. నేడు స్వార్థపూరితంగా ప్రజల మధ్య విభేదాలు తీసుకురావడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు.
మద్యపాన నిషేధం చేస్తామని మహిళల్ని మోసం చేయడం జరిగింది. నాసిరకం మద్యాన్ని తయారు చేయించి ప్రతి అక్కా, చెల్లెమ్మల మాంగల్యాన్ని తెంచుతున్నారు. అనేక కుటుంబాలు నాశిరకం మద్యం తాగి రోడ్డున పడుతున్నాయి. మహిళలు తమ కుటుంబ భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్నారు. చేస్తున్న వాటికి సిగ్గు పడకుండా మహిళా సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం. నేడు వైసీపీ ప్రభుత్వంలో అక్క, చెల్లెమ్మలు చాలా ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. అదంతా శుద్ధ అపద్దం. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహిళలు ఎప్పుడెప్పుడు జగన్ రెడ్డిని గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారు.
40 నుంచి 60 సంవత్సరాల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మహిళలకు చేయూత ఇస్తామని చెప్పి లబ్ధి దారుల సంఖ్య తగ్గించుకుంటూ పోతున్నారు. కరెంటు బిల్లు 300 యూనిట్లు ఎక్కువ కాలినా, సొంత వాహనాలను కలిగి ఉన్నా, ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, డబుల్ కాట్ మంచమున్నా పధకాలలో కోత పెడుతున్నారు.
గతంలో విదేశీ విద్యను ప్రవేశం పెట్టాం. విదేశీ విద్యను అభ్యసించడానికి వెళ్ళే వారు ఐటి రిటన్స్ పెట్టాలి. నేడు ఐటి రిటన్స్ పెడితే పథకాలలో కోత పడుతుంది. పైకి ప్రగల్భాలు పలుకుతూ చాలా తెలివిగా ప్రజలను మోసం చేస్తున్నారు. ఓట్లు వేసిన ప్రజలను నా అక్కచెల్లెమ్మలంటూ తలలు నిమిరడం, మీ మేనమామ నంటూ పిల్లలను దగ్గరకి తీసుకుంటూ పథకాలలో కోత పెట్టి తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్ధాపించినప్పటి నుంచి మహిళా సంక్షేమానికి, మహిళా పక్షపాతిగా వాళ్ల కుంటుంబాలలో సంతోషం నింపే విధంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు టీడీపీ మహిళలకు ఎంతో మేలు చేసింది.
కోటి ఇరవై లక్షల మంది డ్వాక్రా మహిళలలో కేవలం 25లక్షల మందికి మాత్రమే పధకాన్ని వర్తింపజేశారు. మిగిలిన కోటి మంది ఏం చేయాలి. వాళ్లందరిని మీరు నిరాశ పరిచినట్టే కదా. చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పసుపు-కుంకుమ పథకం ద్వారా 10వేల రూపాయలు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం ఒక ఊరిలో 100మంది ఉంటే 20మందికి మాత్రమే చేయూత ఇచ్చారు. మిగతా 80 మంది పరిస్థితి ఏంటి. మీరు ఓటు వేసిన పాపానికి సంక్షేమ ఫలాలు పొందడానికి వీలు లేదా? వాళ్ల కుటుంబాలు పస్తులుండాలా?
లక్షకు మించి మహిళలు కిరణా దుకాణాలు పెట్టుకున్నారు. వాళ్ళకు హిందూస్తాన్ లివర్, పిఅండ్ జి, రిలయన్స్ వంటి సంస్థలతో అనుసంధానం చేశామని గొప్పలు చెబుతున్నారు. అదే నిజమైతే ఆ లబ్ధిదారుల పేర్లు బయటపెట్టే దమ్ముందా? వాళ్ల పేర్లని పబ్లిక్ గా ఆన్ లైన్ వెబ్ సైట్ లలో పెట్టండి. వస్త్ర వ్యాపారాలు పెట్టుకున్నారు అని చెప్పారు. ఎంత మంది పెట్టారు, ఎక్కడ పెట్టారో అవి కూడ వెబ్ సైట్ లలో పెట్టాలి. మహిళలు అభివృద్ధి చెంది సంతోషంగా ఉండాలనేదే ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఉన్నముఖ్య లక్ష్యం. 2లక్షల లబ్ధిదారులు గెదెలు, ఆవులు, మేకలు కొన్నారని అమూల్ డైరితో ఒప్పందం చేసుకొని ఉద్దరించేశామని గొప్పలు చెబుతున్నారు.
అమూల్ కంటే ముందే మహిళలు గెదెలు, ఆవులు కొనడం అందరికి తెలుసు. మీరు కొత్తగా నేర్పాల్సిన పని లేదు. ప్రైవేటు సహకార డైరీలకు చేయూతనిచ్చి వాళ్లని ఎన్నో ఏళ్ళుగా ఆదుకోవడం జరుగుతుంది. నేడు రాజకీయ కక్ష్యసాధింపు చర్యగా మాత్రమే అమూల్ డైరీని తీసుకొచ్చారు. మహిళల కోసం కాదు, మీ కమిషన్ల కక్కుర్తి కోసం ఎప్పటి నుంచో ఉన్న ప్రైవేటు సహకార డైరీలని తొక్కేయాలనే ఉద్దేశంతో అమూల్ ని తీసుకురావడం జరిగింది.
ఆసరా పథకంలో 25వేల కోట్లు రద్దు చేశామన్నారు. ఏప్రిల్, 11,2019న ఖాతాలలో ఉన్న రుణాలన్నింటిని రద్దు చేస్తామన్నారు. మీకు రాజకీయం అనుభవం లేక మొదటి సారి కావడంతో రాష్ట్రంలోని ప్రజలు మీరు తీసుకునే నిర్ణయాలకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ, ఎస్టి మహిళల గ్రూపులకు లక్షా, లక్షన్నరకు మించి ఏ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. బిసిలకు రెండు నుంచి మూడు లక్షల వరకు, మిగిలిన వారికి ఐదు నుంచి పది లక్షల వరకు మాత్రమే రుణాలు వస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల మహిళలకు అతి తక్కువ నగదు మాత్రమే రద్దు అయింది.
మీరు గ్రామ సచివాలయాలలో చేసిన 25వేల కోట్ల రద్దు గురించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్లకు ఎంత, ఎంత రద్దు చేశారో ప్రజల ముందు పెడితే మేం దాని మీద మరోమారు మీడియా సమావేశం పెడతాం. ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. మేం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేదు. మీరు చెప్పేవన్ని కాగితం రూపంలో చెబుతున్నారు. వాస్తవాలకు వచ్చే సరికి అన్ని అబద్ధాలే. ఇకనైనా బుద్ది తెచ్చుకొని 45,60 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు 3000లు ఇస్తామన్నారు, ఇవ్వాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మూడున్నరేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు నష్టపోయిందాన్ని వడ్డీతో సహా చెల్లించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆచంట సునీత ఏమన్నారంటే..
జగన్ రెడ్డి కుప్పం వెళ్ళి మరో మోసానికి తెరతీశారు. చేయూత పథకంతో చాలా ఆర్భాటంగా ప్రజలందరికి టోకరా పెట్టి మహిళల్ని మోసం చేయడం జరిగింది. అధికారంలోకి రాకముందు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తాను, వాళ్ళను ఆదుకుంటామని చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి. అధికారంలోకి మహిళల కోసం ఏం చేశారని ప్రతి ఒక్కరు చర్చించుకునే పరిస్ధితి. పాదయాత్ర చేస్తూ నా సొంత అక్క, చెల్లెమ్మలు అని తలలు నిమురుతూ ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ వాల్లకు ప్రతినెల 3000లు పించను ఇస్తానని మోసం పూరితమైన మాటలు చెప్పారు.
జగన్ రెడ్డి అంటేనే మోసకారితనం ప్రతి రూపం. ఎప్పుడైనా మాట తప్పడం, మడమ తిప్పడం అతనికి అలవాటు. ఆసరా పథకం ద్వారా 3000లు ఇస్తామని దాని పేరు మార్చి ఆర్ధిక సహాయం అనే పేరుతో కొత్త మోసానికి తెరలేపారు. ప్రతి నెల 3000లు పించను ఇస్తే దాదాపు ప్రతి మహిళకు లక్షా 80వేల రూపాయలు ఐదేళ్లకు ఇవ్వాలి. దాన్ని తీసేసి ప్రతి మహిళకు 75,000లకు కుదించారు. ఇది మహిళల్ని మోసం చేసినట్టు కాదా జగన్ రెడ్డి. మీరా మహిళా సంక్షేమం గురించి మాట్లాడేది.
నాడు చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా డ్వాక్రా గ్రూపులని ఏర్పాటు చేయడం జరిగింది. డ్వాక్రా గ్రూపులంటే చంద్రబాబు నాయుడుకి మానిసిక పుత్రికలు. ఆంధ్రప్రదేశ్ మహిళల్ని ప్రపంచ చిత్రం పటంలో చూపించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల్ని, ఎవరిని ఉద్దరించారు. ఆర్ధిక స్థోమత లేని కోటి మంది మహిళలకు పసుపు, కుంకుమ పేరుతో 27వేల కోట్లు ఆర్ధిక సహాయం చేశారు.
నేడు ఆ పథకాన్ని కుదించి చేయూత అని కొత్త పేరు చెప్పుకుంటున్నారు. మహిళల్ని ఉద్దరిస్తానని చెప్పిన వ్యక్తి 23లక్షల మందిని కుదించి అంకెల గారడి చేసింది మీరు కాదా జగన్ రెడ్డి. నాడు చంద్రబాబు నాయుడు సున్నా వడ్డీకే 5లక్షల వరకు డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తే అధికారంలోకి వస్తే 10లక్షల వరకు పెంచుతామని మాయమాటలు చెప్పారు. నేడు 5 నుంచి 3లక్షలకు కుదించిన ఘనత జగన్ రెడ్డిది. నాడు డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళ 50వేల రూపాయలు లబ్ధి పొందింతే నేడు జగన్ రెడ్డి నేతృత్వంలో 30వేలకు మించి తీసుకొనే పరిస్థితి లేదు.
ఆచరణకు సాధ్యం కాని హామిలు ఇవ్వడం జగన్ రెడ్డికి మాత్రమే సాధ్యం. డ్వాక్రా మహిళలకు పెద్ద పీట వేసి వాళ్ళని ఆదుకున్నాను అంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మహిళల్నితయారు చేసిన ఘనత చంద్రబాబు నాయడుకే దక్కుతుంది. భారతి రెడ్డి పులివెందుల వెళ్ళి మరీ ప్రచారం చేశారు. జగన్ అన్న వస్తే ప్రతి ఇంట్లో మేనమామలాగా అమ్మఒడి ఇస్తారని చెప్పారు. అమ్మఒడి 15వేలు ఇస్తామని విడతల కుదించికుంటూ నేడు 13వేలు ఇస్తున్నారు. రాష్ట్రంలో 13వేలు అమ్మఒడి ఇచ్చి 70వేల కోట్లు నాన్న బుడ్డి ద్వారా లాక్కొంది మీరు కాదా. పేద బడుగు, బలహీన వర్గాలు నాశిరకం మద్యం తాగి రోడ్డున పడుతున్నారు.
ఆ పాపం మీది కాదా. మీరా మహిళా పక్షపాతి. ఎస్సీ, ఎస్టీ, బిసిల పట్ల మీకు అవగాహన ఉందా. మీరా మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసేది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత హత్యలు, అత్యచారాలు అనేకం జరుగుతున్నాయి. నేషనల్ క్రైం రిపోర్ట ప్రకారం హత్యలు, అత్యాచారాలలో మొదటి స్ధానంలో ఉందంటే ఇంతకన్నా సిగ్గు మాలిని చర్య ఇంకోటి ఉందా జగన్ రెడ్డి. సమాజిమే దేవాలయం, ప్రజలే దేవుళ్లనే ఉద్దేశంతో తెలుగింటి ఆడపడుచులని అక్కున చేర్చుకొని అన్న ఎన్టీఆర్ వాళ్లకు ఆస్తి హక్కు ఇచ్చారు.
నేడు ఆస్తి కోసం సొంత చెల్లెలిని బయటకు గెంటేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఎన్నికలు జరిగే వరకు వాడుకొని అధికారంలోకి రాగానే సొంత తల్లిని, చెల్లిని ఏ విధంగా గెంటేశామని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. సాక్షాత్తు నీ సొంత చిన్నాన్నా కూతురు సునీత రాష్ట్రంలో రక్షణ లేదని చెప్పింది. పేదరికాన్ని బట్టి, ఆర్ధిక పరిస్ధితుల అంచనాలతో కాకుండా వయస్సు సంబంధంతో సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టిన వ్యక్తిగా జగన్ రెడ్డి నిలిచిపోతారు.
ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కృష్ణమ్మ ఏమన్నారంటే..
చంద్రబాబు నాయుడు మహిళల్ని ఆర్థికంగా, సామాజికంగా ఆదుకున్నారు. రాష్ట్ర మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించారు. గతంలో మహిళలు ఆర్థికపరంగా భర్త, అత్తా, మామలపై ఆధారపడేవారు భార్యలు భర్తలకు ఆర్థిక సహాయం చేసే స్థాయికి మహిళల్ని తీసుకెళ్లారు. రేషన్ కార్డులు మహిళల పేర్లమీదే ఉండాలని మార్పు చేసింది చంద్రబాబే . డ్వ్రాక్రా గ్రూపులను తయారుచేసి ఏపీ మహిళలకు గుర్తింపు తెచ్చారు. పాదయాత్రలో మహిళలందరి తలపైన చేతులు పెడుతూ సున్నా వడ్డీకే రుణాలందిస్తానని చెప్పి మోసం చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 40 వేలు లబ్ది పొందుతుండగా వైసీపీ హయాంలో కేవలం 30 వేలు మాత్రమే ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ ఇస్తామని చెప్పి తుంగలో తొక్కారు. రాష్ట్ర మహిళలకు జగన్ ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి మాట తప్పి మడమ తిప్పారు.
8, 10 తరగతులు చదివినవారికి మంత్రి పదవులు ఇస్తూ.. ప్రభుత్వ పథకాలు పొందేందుకు సామాన్యులకు 10వ తరగతి అర్హత కావాలనడం అన్యాయం. పెళ్ళికానుక పథకానికి అమ్మాయి, అబ్బాయి ఇరువురు ఖచ్చితంగా టెన్త్ పాసై ఉండాలనడం సమంజసంకాదు. 10వేలు ఆదాయం మించకూడదు అని నిబంధనలు పెట్టడం మరీ అన్యాయం. రాజకీయ నాయకుడు కావాలంటే ఏ విద్యార్హత అవసరంలేదు, సామాన్యుడు ప్రభుత్వ పథకాలు పొందాలంటే మాత్రం విద్యార్హతలు కావాలి. బీసీ ఫెడరేషన్ ద్వారా ఎంతమందికి లోన్ లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నాయకురాలు, ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కృష్ణమ్మ తెలిపారు.