Suryaa.co.in

Andhra Pradesh

ఏ 2 ఉన్నాడంటే … ఏ 1 ఉంటాడు!

– నాకేమీ సంబంధం లేదంటే కుదరదు
– అదాన్ కంపెనీ సరఫరా చేసే బ్రాండ్లను సేవిస్తే ప్రజలకు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉంటుందని, ఆ కంపెనీకి ఆర్డర్ ఇస్తున్నారా?
– హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు పడితే.. జగన్ కు తిప్పలు తప్పవు
– నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు

అదాన్. డిస్టలరీ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి 40 నుంచి 42 శాతం చీఫ్ లిక్కర్ ను సరఫరా చేస్తుందని, అదాన్. డిస్టలరీ కంపెనీ నుంచి ఏ ప్రాతిపదికన చీఫ్ లిక్కర్ కొంటున్నారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలోని 19 డిస్టలరీ కంపెనీలలో 16 కంపెనీలకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చారని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, ఆ కంపెనీలను ప్రస్తుతం ఎవరు నిర్వహిస్తున్నారన్న ప్రశ్నకు మాత్రం ఎందుకనీ సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.

ఈ లిక్కర్ వ్యవహారం లో నూటికి నూరుపాళ్ళు తమ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి బినామీగా ఎవరో ఉన్నారన్నారన్న ఆయన, ఏ 2 ఉన్నాడంటే ఏ 1 కూడా ఉంటాడన్నారు. మద్యం సరఫరా చేస్తున్న కంపెనీలను నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నాయని, దానితో తనకేమీ సంబంధం లేదంటే కుదరదని చెప్పారు. లిక్కర్ కొనుగోలు, అమ్మకాలలో జరుగుతున్న అవకతవకలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా ఇదే విషయాన్ని చెప్పి, చెప్పి తన గొంతు అరిగిపోయిందని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… లిక్కర్ నగదు లావాదేవీలపై మాట్లాడుతుంటే, ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే మాట్లాడుతారని, రోజు వచ్చే నగదును ఎక్కడ వదులుకుంటామనే భావనలో ఉన్నట్టు స్పష్టం అవుతుందన్నారు. ఈ దందా ఎప్పుడు ఆగుతుందని, ప్రధాని మోడీ కోరుకున్న డిజిటల్ ఇండియా ఎప్పుడు వస్తుందోనని అన్నారు. పేరు మోసిన కంపెనీ బ్రాండ్లను తుంగలో తొక్కి అదాన్. కంపెనీ సరఫరా చేస్తున్న బ్రాండ్లను వాసుదేవరెడ్డిని కొనమని చెప్పిన ఆ రెడ్డి ఎవరని ప్రశ్నించారు.

అదాన్ కంపెనీ సరఫరా చేసే బ్రాండ్లను సేవిస్తే ప్రజలకు బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉంటుందని, ఆ కంపెనీకి ఆర్డర్ ఇస్తున్నారా అంటూ రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ఇప్పటికే అదాన్ కంపెనీ ఐదు వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసిందన్న ఆయన, ప్రముఖ కంపెనీ బ్రాండ్లయితే డ్యూటీ కట్టిన సరుకు కొంత, డ్యూటీ కట్టని సరుకు మరికొంత బయటి ఊర్ల నుంచి రావడం కష్టమని, అదాన్ కంపెనీ సరుకు అయితే అలాగే వస్తుందేమో నని… ఆ వెసులుబాటు లేకపోతే ఇంతగా నగదు లావాదేవీలు చేయవలసిన అవసరం లేదన్నారు. ఇది ప్రజాభిప్రాయమని, ప్రజల అనుమానాన్ని నివృత్తి చేయవలసిన అవసరం పాలకులకు ఉందన్నారు.

ఊరు పేరు లేని అదాన్ కంపెనీ
మియాపూర్ లోని సర్వేనెంబర్ 65, 66 లలో అరబిందో కంపెనీలకు సంబంధించిన చిరునామాలోనే అదాన్. డిస్టలరీ కంపెనీ స్టార్ట్ అయిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అదాన్.కంపెనీ బొలారం శివకుమార్, శ్రీనివాస్ కాశి చాన్యులు ప్రారంభించగా, వీరిద్దరూ అరబిందో కు చెందిన ఐదు, ఆరు కంపెనీలలో కూడా డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరికీ కూడా తెలియదట అని పేర్కొన్న ఆయన, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరి గురించి ఆచూకీ తెలియచేస్తే రివార్డు కూడా అందజేస్తామని ప్రకటించినట్లు తెలిసిందని అన్నారు.

అరబిందో ఫార్మా యజమాని రాంప్రసాద్ రెడ్డికి ఇద్దరు కుమారులని, వారిలో చిన్నవాడైన రోహిత్ రెడ్డికి, విజయసాయి రెడ్డి కుమార్తెను ఇచ్చి వివాహం చేశారన్నారు. ఇక జగతి పబ్లికేషన్ లో అరబిందో కంపెనీకి చెందిన ప్రైడెంట్ లైఫ్ సెన్సెస్ అనే ఒక కంపెనీ ద్వారా, తమ కంపెనీలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 ఎకరాల భూములను కేటాయించిన రోజే, 10 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి వాటాదారులుగా చేరారన్నారు. రాష్ట్రంలో 108 వాహనాలను అరబిందో కేటాయించారని, కాకినాడ పోర్ట్, కాకినాడ ఎస్ఇజెడ్, లిక్కర్ వ్యాపారం కూడా వారి బినామీల పేరిట కొనసాగుతోందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

అదాన్. డిస్టలరీస్ కు 2020 జనవరి 12, 13 వ తేదీలలో సేల్స్ టాక్స్ నెంబర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని, అంతకంటే వారం రోజుల ముందే ఆ కంపెనీ ఇన్ కార్పెట్ అయిందని చెప్పారు. 10 కోట్ల రూపాయల చేబదులుతో ప్రారంభమైన అదాన్.డిస్టలరీస్ కంపెనీకి, ఇంత బిజినెస్ ఇచ్చి నాకేమీ తెలియదని నంగనాచి కబుర్లు చెబితే ఎవరూ నమ్మరని రఘురామకృష్ణం రాజు అన్నారు. అదాన్ కంపెనీ వద్దకు వెళుతున్న డబ్బు, చివరకు ఎవరి చేతికి చేరుతుందని ఆయన ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ వ్యవహారం పై దృష్టి సారించిన సీబీఐ అధికారులు, రాష్ట్రంలో సంవత్సరానికి 30 వేల కోట్ల రూపాయల లెక్కన ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల టర్నోవర్ జరిగిన వ్యవహారంపై ఆరా తీయాలన్నారు. లిక్కర్ సరఫరా అయినది ఎంత అని, రికార్డులలో నమోదు అయినదని ఎంతని, ఒకవేళ సదరు కంపెనీ వద్ద అంత లిక్కర్ తయారయ్యే అవకాశం ఉన్నదా అన్నదానిపై విచారణ జరపాలని కోరారు. లిక్కర్ లావాదేవీలతో తమ ముఖ్యమంత్రి కి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని తేలితే సంతోషమని వ్యాఖ్యానించారు.

రోహిత్ రెడ్డి నీ అల్లుడా? కాదా??
విజయసాయిరెడ్డిపై రఘురామ కృష్ణంరాజు శరపరంపరగా ప్రశ్నాస్త్రాలను సంధించారు. రోహిత్ రెడ్డి నీ అల్లుడు అవునా? కాదా?రోహిత్ రెడ్డి అన్న శరత్ చంద్రారెడ్డి అవునా? కాదా? వీళ్ళ ఫ్యామిలీ కంపెనీ ప్రై డెంట్ లైఫ్ సెన్సెస్ అవునా? కాదా? జగతి పబ్లికేషన్ సంస్థ, జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలకు చెందినది అవునా ?కాదా? దానికి నువ్వు ఆడిటర్ గా పనిచేసింది అవునా? కాదా? అంటూ ప్రశ్నించారు. ఇక సాక్షి దినపత్రికకు కొన్నాళ్లు వైస్ చైర్మన్ గా వ్యవహరించి ఆ వ్యాల్యుయేషన్ల గేములన్ని ఆడింది నువ్వు కాదా అంటూ నిలదీశారు. వీటన్నింటికీ సూటిగా సమాధానాలు చెప్పాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.

తాను రాజీనామా చేస్తే ఉపయోగం ఏమిటని, తాను రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన తర్వాత , జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని చేస్తే బర్తరఫ్ చేసి ఎన్నికలకు వెళ్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని తాను అడిగితే, రాజీనామా చేసి కామెడీ షోలు చేసుకోమంటావా? అంటూ విరుచుకుపడ్డారు. తాను ఇప్పుడు చేస్తున్నది కామెడీ షోలే నని, రేపు నువ్వు బొక్కలోకి వెళ్లిన తర్వాత దీన్ని తలుచుకుంటూ కూర్చోవాలన్నారు. అప్పుడే ఆట మొదలయ్యిందని ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయని చెప్పారు.

తాను అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సూటిగా సమాధానాలు చెప్పాలని మరొకసారి డిమాండ్ చేశారు. నీ పెద్దనాన్నను నీ తండ్రి చంపింది నిజమా? కాదా? యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించింది నిజమా ? కాదా? అన్న దానికి సమాధానం చెప్పాలన్నారు. బాబాయిని ఎవరు వేశారో కూడా త్వరలోనే తెలియనుంద ని అన్నారు. అదాన్ కంపెనీలో మీ అల్లుడు వాటాదారుడా కాదా, ఆ వాటాదారుడు నీ అల్లుడా కాదా అంటూ ప్రశ్నించిన ఆయన, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై అనర్హత వేటుపడితే, అంతకంటే పెద్ద పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి తిప్పలు తప్పవన్నారు. హైకోర్టులో తాను వేసిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉందని, వీళ్లు ఎప్పుడైనా డిస్ క్వాలిఫై కావచ్చునని తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నవారు, ఎమ్మెల్యేలు కాంట్రాక్టు పనులను తమ పేరిట చేస్తే ప్రజా ప్రతినిధుల చట్టం ప్రకారం అనర్హులు అవుతారన్నారు. హేమంత్ సోరెన్ బాటలోనే, మా నాయకులు ఉన్నట్లుగా అనిపిస్తుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.

రాజ్యాంగం అంటే జగన్ కు గౌరవం లేదు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగం అంటే గౌరవం లేదని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తెలుగు భాషను మన్నించమన్నందుకే ప్రభువులు… ధర్మ ప్రభువులైన జగన్మోహన్ రెడ్డి తనను పిలిచి వార్నింగ్ ఇవ్వబోయారని, తాను పట్టించుకోలేదన్నారు. దానితో తనపై అనర్హత పిటిషన్ ఫైల్ చేశారని తెలిపారు. రాజ్యాంగంలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పించాలని పొందుపరిచారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని తాను చెబితే కొంతమంది వెధవలు వెంకయ్య నాయుడు మనవడు ఎక్కడ చదివారని ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

నూతన విద్యా విధానానికి భిన్నంగా, హైకోర్టు తీర్పును కాలరాసి, ఇప్పుడు తెలుగు మీడియంను సంపూర్ణంగా ఎత్తేసి… తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని, స్టే ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు కాబట్టి, హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిర్ణయానికి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగు భాష అభిమానులు కోర్టు ధిక్కరణ కేసు వేయవచ్చునని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నఫలంగా బోధించడానికి టీచర్లు పండితులు అవుతారా అంటూ ప్రశ్నించిన ఆయన, తాను అనుకున్నావని కాబట్టి చేయాలంతే అనే పంతం తప్పితే, మాతృభాషను చంపివేయడం ఏమిటని మండిపడ్డారు.

తల్లిని పదవి నుంచి దింపివేసినంత సింపులా?, మాతృభాషను చంపి వేయడం అంటూ ఎద్దేవా చేశారు. ఒక జాతి ప్రాముఖ్యత భాష లోనే ఉంటుందని, చిన్న చిన్న భాషలను పరిరక్షించుకోవడానికి ఆయా ప్రాంతాల ప్రజలు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. అమెరికాలో ఎబార్జిన్స్ భాషలలో స్కూళ్లను ప్రారంభించాలని అమెరికా సెనెట్ తీర్మానం చేయగా, మన రాష్ట్ర కురుసభలో మాత్రం భాషను చంపేసే డిసిషన్ తీసుకున్నారని విమర్శించారు. ఒక్క అధికార భాషా సంఘానికి సంబంధించిన నోటిఫికేషన్ తప్ప, తెలుగులో నోటిఫికేషన్ ఇవ్వడమే మానేశారన్నారు.

గతంలో తెలుగు భాష ప్రాముఖ్యత గురించి గంభీరంగా మాట్లాడే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఇప్పుడు అప్పుడప్పుడు భయం భయంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. తెలుగు భాషను దుశ్శాసనుల మాదిరిగా కురు సభలో దుశ్శాసనపర్వం చేస్తుండగా, భీష్ముని మాదిరిగా ఆయన ఏమి చేయాలో పాలు పోనీ పరిస్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా తెలుగు భాషాభిమానులు మాతృభాషను మర్చిపోతే మన తల్లిని అనాధ శరణాలయములో వదిలేసినట్టే లెక్క అని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇంగ్లీషులో మాట్లాడేవారు, తెలుగు భాషలో మాట్లాడలేరా అంటూ ప్రశ్నించిన ఆయన తాను రెండు భాషలు మాట్లాడుతున్నానని గుర్తు చేశారు.

మన భాషను మనం బ్రతికించుకుందామని, మన సంస్కృతి, సాంప్రదాయం బ్రతికి ఉండాలంటే, భాష బ్రతికి ఉండాలన్నారు. దానికోసం సంకుచిత స్వభావంతో కొంతమంది మూర్ఖులు పిచ్చి పిచ్చి ఆలోచనలతో నేను చేస్తున్నదే మంచి అని భాషను హత్య చేస్తుంటే చూస్తూ ఊరుకోకూడదన్నారు. భాషను హత్య చేయడం, మనిషిని హత్య చేయడం ఒకే రకమైన నేరమని ఆయన అన్నారు. తామేమి జగన్మోహన్ రెడ్డి విద్యా విధానాన్ని వ్యతిరేకించడం లేదని, ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నామన్నారు.

తెలుగు భాషలో విద్యాభ్యాసం చేయాలన్న ఆసక్తి ఉన్నవారు తెలుగు మీడియంలో చేరుతారని, లేనివారు ఆంగ్ల మీడియంలో చేరుతారన్నారు. తల్లిని ప్రేమించేవారు కచ్చితంగా తెలుగు మీడియంలో చేరుతారన్న ఆయన, తల్లిని చెల్లిని వదిలి వేయలేరు కదా అంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం ను కనిపెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలోనూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని తెలుగు మీడియం స్కూళ్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు.

జగన్ కు కొద్దిపాటి కృతజ్ఞతలు
వినాయక మండపాలలో విగ్రహాల ఎత్తు పై పన్ను వసూలు చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొద్దిపాటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రఘురామకృష్ణం రాజు అన్నారు. తగిన సమయంలో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ, ఉపసంహరించుకున్నామని చెప్పకుండా ఆ నిర్ణయమే తీసుకోలేదని చెప్పడం ఎబ్బేట్టుగా ఉందన్నారు.
తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమానికి నాంది పలికిన గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని ఆయనకు రఘురామకృష్ణం రాజు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే సినీ హీరో నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నటుడు నందమూరి హరికృష్ణ తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

LEAVE A RESPONSE