-ఏడాదికాలంగా కార్పొరేషన్ పేరిట అప్పులు తప్పని చెప్పాను
-రోగ్ అని తిట్టారు… పార్లమెంట్లో అడ్డుకునే ప్రయత్నం చేశారు
-ఇప్పుడు ఆర్.బి.ఐ కూడా నేను చెప్పిన విషయాన్ని చెప్పింది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
కార్పొరేషన్ల ను ఏర్పాటుచేసి అప్పులు చేయడం తప్పని నేను గత ఏడాది కాలంగా చెబుతూనే ఉన్నానని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.అయితే, తనని తమ పార్టీ వారు, ప్రభుత్వ పెద్దలు రోగ్ అంటూ తిట్టారని, పార్లమెంటులో అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) కూడా తన ఉత్తర్వుల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. నెల రోజుల క్రితం ఆర్బిఐ ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ, ఇప్పుడు సర్కులర్ కాపీ వెలుగులోకి వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, రుణాలను పొంది, వాటిని సంక్షేమం, ఇతర కార్యక్రమాల కోసం వినియోగుంచి, రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తామంటే కుదరదని ఆర్బిఐ తన ఉత్తర్వులలో పేర్కొన్నదని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ, రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడి అప్పులు చేసిందన్నారు. బ్యాంకులను మేనేజ్ చేసి ప్రైవేటు కంపెనీ మాదిరిగా అప్పులు చేశారన్నారు. రేపు ఈ అప్పులను చెల్లించక డిఫాల్టర్ అయితే, ఆర్థిక శాఖ మంత్రి తో పాటు ఆర్థిక శాఖ మంత్రిగా అభినయించిన వ్యక్తి, బ్యాంక్ చైర్మన్, ముఖ్యమంత్రి జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. కలెక్టరేట్లను, మున్సిపల్ కార్యాలయాలను తాకట్టు పెడితే రుణాలు ఇవ్వటం ఏమిటని ఆ బ్యాంకు ను ఆర్బిఐ మందలించిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
త్రిపాత్రాభినయంలో సకల శాఖామంత్రి
దానవీరశూరకర్ణ చిత్రంలో ఎన్టీ రామారావు మూడు పాత్రలను పోషించినట్టుగా, సకల శాఖామంత్రి విద్యావేత్తగా, ఇంజనీర్ గా, ఆర్దికవేత్తగా మూడు పాత్రలను పోషించారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఆర్థిక మంత్రిగా అవతారం ఎత్తిన సకల శాఖ మంత్రి… రాష్ట్ర ప్రభుత్వం చేసింది 8 లక్షల కోట్ల అప్పు కాదని, కేవలం ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమేనని చెప్పుకొచ్చారన్నారు. అప్పులను, తప్పులను నొక్కి వేయడం తమవారికి అలవాటైందని విమర్శించారు. 1,50,000 కోట్ల రూపాయల బాకీలే ఉన్నాయని రఘురామ పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి సాక్షి దినపత్రిక కు, తమను బాగా చూసుకునే కాంట్రాక్టర్లకు మినహా ఎవరికీ బిల్లులు చెల్లించ లేదన్నారు. ఇప్పటికీ చాలామంది కోర్టుకు వెళ్తున్నారని, న్యాయమూర్తులు ఆదేశాలిస్తున్న, వీళ్ళు ఎగగోడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఎన్నో చెప్పమని కోరితే, నెంబర్ మాత్రం చెప్పడం లేదని… అది రోజు మారుతుందని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. హనీమూన్ కాలం ముగిసింది కాబట్టి ఒక్కొక్కటిగా అన్ని వెలుగులోకి వస్తాయని తాను ముందే చెప్పానని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను వీడిన 20 శాతం మంది విద్యార్థులు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పాఠశాలల విలీన ప్రక్రియ నిర్ణయం వల్ల దాదాపు 11 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడి, ప్రైవేటు పాఠశాలలను చేరారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అంటే మొత్తం విద్యార్థులలో ఇప్పటికే 20 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడగా, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోతున్నారని చెప్పారు. ఈ రోజు సమావేశాలు కొనసాగి ఉంటే, పార్లమెంట్ జీరో అవర్ తాను ఇదే అంశాన్ని ప్రస్తావించాలనుకున్నట్లు తెలిపారు. ఒకే తరగతి గదిలో మూడు తరగతులకు చెందిన విద్యార్థులకు, మాస్టర్లు విద్యాబోధన చేస్తున్న విషయం ప్రముఖ దినపత్రికలో వచ్చిందని, దానికి సకల శాఖామంత్రి కొత్త భాష్యం చెప్పారని విమర్శించారు. ముగ్గురు మాస్టర్లు స్టడీ రూమ్ లో ఉన్నారని, దాన్ని కూడా మిస్ లీడ్ చేస్తే ఎలా అంటూ సకల శాఖామంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. ఒకే తరగతి గదిలో, మూడు తరగతులకు చెందిన విద్యార్థులకు విద్యాబోధన చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఈవో లేఖ రాశారని తెలిపారు. ఒకవేళ ఉపాధ్యాయులు స్టడీ రూమ్ లో ఉండి ఉంటే, డీఈవో లేఖ రాసి ఉండేవారు కాదు కదా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ తప్పిదం అంగీకరించడం అభినందనీయం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రభుత్వ తప్పిదం ఉన్నట్లు అంగీకరించడం అభినందనీయమని రఘురామకృష్ణం రాజు అన్నారు. 8 ఏళ్ల ప్రభుత్వంలో, ఐదేళ్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నదని, గత మూడేళ్లుగా తాము అధికారంలో ఉన్నామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో రెండు ప్రభుత్వాల తప్పిదం ఉన్నదని మంత్రి అంబటి రాంబాబు అంగీకరించారన్నారు. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో తొలి రెండేళ్లు పోతే, మూడేళ్లలో 72 శాతం పనులు పూర్తికాగా, తమ ప్రభుత్వ మూడేళ్ల హయాంలో రెండు శాతం పనులు కూడా పూర్తి కాలేదని గుర్తు చేశారు. దానికి రెండు ప్రభుత్వాల తప్పిదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. డయాఫ్రం వాల్ ముందే నిర్మించి ఉంటే బాగుండేదని తనకున్న ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని సకల శాఖామంత్రి , నీటిపారుదల నిపుణుడిగా వెల్లడించారంటూ రఘురామ ఎద్దేవా చేశారు. బీసీకి మంత్రి పదవి ఇచ్చామని చెబుతూనే, సకల శాఖామంత్రి అన్ని తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారని విరుచుకు పడ్డారు.
న్యాయపోరాటం చేద్దాం…
మహాసేన మీడియా రాజేష్, సభ్యుడు సన్నీ దీపక్ ల పై అక్రమ కేసులు బనాయించి పోలీసులు వేధించడం పట్ల రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే, ఆజాద్ కా అమృత్ ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో కులం, ప్రాంతం పేరిట దూషించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు చెప్పారని పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కరెక్టు కాదని, పోలీసులు సంయమనం పాటించాలని సూచించారు. మహాసేన సభ్యుడైన సన్నీ దీపక్ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేయగా, దాన్ని రాజేష్ షేర్ చేయడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యుడు శ్రీకాకుళంలో పోలీసులకు ఫిర్యాదు చేయగానే, ఆగమేఘాల మీద హైదరాబాదులో ఉన్న సన్నీ దీపక్, రాజేష్ ల పై కేసులు నమోదు చేసి విచారణ నిమిత్తం శ్రీకాకుళం పిలిపించారన్నారు. అంబేద్కర్ మిషన్ ఇండియా సంస్థ వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. శ్రీకాకుళంలో విచారణ సందర్భంగా సన్నీ దీపక్ పై చేయి చేసుకోవడమే కాకుండా, అసభ్య పదజాలంతో బూతులు తిట్టారని స్వయంగా బాధితుడే పేర్కొన్న వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. నిష్పక్ష పాత విచారణ జరిపించి ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సన్నీ దీపక్ సంబంధిత అధికారులపై కంప్లైంట్ చేయాలని, తెలంగాణలోనూ ఫిర్యాదు చేస్తే వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదవుతాయన్నారు. ఒక వేళ పోలీసులు ఫిర్యాదును స్వీకరించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. న్యాయపోరాటంలో మహాసేన రాజేష్, సన్నీ దీపక్ తన వంతు మద్దతు ఉంటుందని తెలియజేశారు.
కేంద్రాన్ని సహాయమే అడగలేదు
గోదావరి జిల్లాలలో సంభవించిన విపత్తుకు సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అడగలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఏదైనా కష్టం వస్తే అడగాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, తీర్చాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నదన్నారు. అడగకపోతే కేంద్రం ఎందుకు సహాయం చేస్తుందని ప్రశ్నించారు. పిడి అకౌంట్లు తెరిచి నిధులు దారి మళ్లించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు నిధులను తిరిగి చెల్లించాలని ఆదేశించిందని గుర్తు చేశారు.
విద్యార్థి కంటే హుషారుగా ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
తన నియోజకవర్గ పరిధిలోని పలులంక గ్రామాలలో విద్యార్థి కంటే హుషారుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు కితాబు ఇచ్చారు. ప్రతిపక్ష నేత బోట్లు వేసుకొని ప్రజల వద్దకు వెళుతుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం హెలికాప్టర్లో విహంగ వీక్షణం చేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ముంపు గ్రామాలైన, తన నియోజకవర్గ పరిధిలోని లంక గ్రామాలలో పర్యటించలేకపోవడం తన దురదృష్టమని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనని చూస్తే ప్రభుత్వ పెద్దలకు భయం ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. వారికి వెన్నులో వణుకు పుడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. ముంపు ప్రాంతాలలో సహాయక కార్యక్రమాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయన్న ఆయన, నాలుగు బంగాళాదుంపలు, ఆరు బెండకాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.
కష్టాల్లో ప్రజలు, ప్రతిపక్ష నేతలు అండగా నిలిచారు
తాను కష్టాలలో ఉన్నప్పుడు ప్రజలు, ప్రజల్లో ఉంటున్న తనకు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారని ఈ సందర్భంగా వారికి రుణపడి ఉంటానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కష్టాలలో ఉన్నప్పుడే మనిషికి మనిషి అవసరం ఉంటుందని అన్నారు. తనకు ఎదురైన ఇబ్బందుల గురించి, నాలుగు ఐదు సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినప్పటికీ, తన నియోజకవర్గంలో మాట్లాడడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడనే అయినప్పటికీ, పార్టీలకతీతంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు చెప్పారు. తన కష్టం గురించి, తన నియోజకవర్గంలో…పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగిందని, ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. తాను నియోజకవర్గానికి ఎందుకు రాలేకపోతున్నానో ప్రతిరోజు తాను చెప్తున్నప్పటికీ, ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
సాక్షి ఛానల్ ను మూసివేయాలి
హోం మంత్రిత్వ శాఖ అనుమతి లేని సాక్షి ఛానల్ తక్షణమే మూసివేయాలని, ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్, ఎం ఓ ఎస్ మురుగన్ ను కలిసి తాను స్వయంగా లేఖలను అందజేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సాక్షి ఛానల్ లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులు వేసిన పిటిషన్ పై కోర్టు ఈనెల 7వ తేదీ వరకు మాత్రమే స్టే ఆర్డర్ జారీ చేసిందన్నారు. ఆ తరువాత స్టే ఆర్డర్ ను పొడిగించలేదని పేర్కొన్నారు. హోం శాఖ క్లియరెన్స్ లేకుండా 20 మంది ఉద్యోగుల కోసం సాక్షి ఛానల్ నిర్వహించాలా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. నిబంధనల విషయంలో తమ ముఖ్యమంత్రి ఎంతో కచ్చితంగా ఉంటారని, కాలుష్య నిబంధనల సాకు తో పదివేల మంది ఉద్యోగులు ఉన్న అమర్ రాజా బ్యాటరీ సంస్థ పోతే పోయిందని అనుకున్నారని గుర్తు చేశారు. అమర్ రాజా బ్యాటరీ, జువారి సిమెంట్ లు మూసివేయాలి కానీ, నిబంధనలను అతిక్రమించిన సాక్షి ఛానల్ మూసి వేయవద్దా? అంటూ ప్రశ్నించారు.
పాతిక వేలైన ఇసుక…
ఉచితంగా లభించే ఇసుక, ప్రస్తుతం పాతిక వేల రూపాయలకు విక్రయిస్తున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. తమ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఈ ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకున్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్న యోజన పథకాన్ని గత నాలుగు నెలలుగా అమలు చేయకపోవడం పట్ల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలోని 61 శాతం మంది అర్హులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుండగా, రాష్ట్రపతి ఎన్నికలకు ముందు తమకు అదనంగా బియ్యం కేటాయింపులు జరపాలని ప్రభుత్వ పెద్దలు గారాలు పోయారన్నారు. అయితే నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్న బియ్యం పంపిణీ చేయాలని, లేకపోతే ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారన్నారు.
నిజాలు రాస్తే వ్యూస్ వస్తాయి…
కేంద్రమంత్రి జయశంకర్ చెప్పిందే, తాను పార్లమెంట్లో మాట్లాడబోతే తమ పార్టీకి చెందినవారు మాటల దాడి చేశారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని ఒక ప్రముఖ ఛానల్ యధాతధంగా ప్రసారం చేయగా ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చాయని, అదే సాక్షి ఛానల్.. తప్పుడు మాటలు మాట్లాడుతున్నా రఘురామకృష్ణంరాజుని అడ్డుకున్న భరత్ రామ్ అంటూ అసత్య కథనాన్ని ప్రసారం చేస్తే పదహారువేల వ్యూస్ కూడా దాటలేదన్నారు. తాను తప్పు ఎక్కడ మాట్లాడానో చెప్పాలని, బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 8 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పుడు రాతలు రాస్తే, వ్యూస్ అలాగే ఉంటాయని రఘురామ హెచ్చరించారు.