Suryaa.co.in

Editorial

తులసిబాబు టీడీపీ అయితే.. రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ?

  • రఘురామ గుండెపై ఎక్కిన తులసి బాబుపై ఫిర్యాదు

  • తులసి నాటి సీఐడీ చీఫ్ సునీల్ అనుచరుడని ఆరోపణ

  • ఆయన ఫిర్యాదుతో విచారణకు హాజరయిన తులసిబాబు

  • ఒంగోలు ఎస్పీ ఆఫీసు దగ్గర తులసి అనుచరుల హల్‌చల్

  • లోపలికి అనుమతించని పోలీసులు

  • చంద్రబాబు, తులసిబాబుకు జిందాబాదులపై విస్మయం

  • గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల హంగామా

  • ఆ ఎమ్మెల్యేకి తులసి ప్రధాన అనుచరుడట

  • మరి తులసి టీడీపీ అయితే. రాజు ఏ పార్టీ ఎమ్మెల్యే అంటూ సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు

  • ఎట్టకేలకు తులసిబాబు అరెస్ట్

  • నేడు గుంటూరు జైలుకు తరలింపు

  • నిందితుడు-బాధితుడు ఇద్దరూ ఒకే పార్టీనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

సహజంగా రాజకీయాల్లో బాధితులు-నిందితులు ఎదురెదురు పార్టీల్లో ఉంటారు. అంటే ప్రత్యర్ధి పార్టీలో కొనసాగుతుంటారు. కానీ ఈ ఏడు నెలల కాలంలో అది రివర్సయింది. ఐదేళ్ల జగన్ జమానాలో ఎవరైతే రెచ్చిపోయి, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారో..ఎవరైతే టీడీపీ కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేశారో, విచిత్రంగా అదే నిందితులు, వారి బాధితులున్న టీడీపీలో చేరుతున్నారు.

ఇటీవల ఇబ్రహీంపట్నంలో అప్పటి మంత్రి దేవినేని ఉమాపై రెచ్చిపోయి, నానా తిట్లు తిట్టిపోసిన జగన్ వీరాభిమాన నేత ఒకరు, ఎంచక్కా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే పక్కనే దర్శనమిచ్చారు. చీరాలలో నాడు చంద్రబాబును తిట్టిపోసి, గత ఎన్నికల్లో పార్టీ మారిన మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఒకరు.. ఇప్పుడు అక్కడి టీడీపీ ప్రముఖుడికి మార్గదర్శకుడట. రామచంద్రాపురంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారే, ఇప్పుడు అదే పార్టీలో కనిపిస్తున్నారట. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు. అన్ని జిల్లాల్లో ఇవే దృశ్యాలు.

అందువల్ల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును చంపాలన్న కసితో.. ఆయన గుండెలమీద ఎక్కి తొక్కిన నిందితుడిని, ఇప్పుడు అదే టీడీపీ ఎమ్మెల్యే ఒకరు తన భుజం ఎక్కించుకోవడంలో పెద్ద వింతేమీ కాదేమో?! నాటి నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణంరాజును.. సీఐడీ చీఫ్ సునీల్ ఆధ్వర్యంలోని బృందం, హైదరాబాద్‌లో చెరబట్టి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తీసుకువచ్చింది. ఆ సమయంలో కొందరు తన కాళ్లపై కొట్టారని, తన గుండెపై కూర్చుని తొక్కారంటూ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోలేదు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గుంటూరులో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. తర్వాత తనను కస్టోడియల్ టార్చర్ చేసిన వారిలో సునీల్ ప్రైవేట్ సైన్యం ఉందని, అందులో గుడివాడకు చెందిన తులసి బాబు ఉన్నారని ఫిర్యాదు చేశారు. అప్పటివరకూ సీఐడీ పోలీసులే ఆ ఘటనలో ఉన్నారని భావించిన వారు, రాజు ఫిర్యాదు చూసి నోరెళ్లబెట్టారు. ప్రత్యర్ధులపై ప్రైవేట్ సైన్యాన్ని వాడి వేధించారని తెలిసి నిర్ఘాంతపోయారు.

అయితే విచిత్రంగా రాజు ఫిర్యాదు చేసిన తులసిబాబు అనే వ్యక్తి, గుడివాడ టీడీపీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడి అవతారమెత్తారు. సదరు ఎమ్మెల్యేకి తులసిబాబు కళ్లు, ముక్కు,చెవులుగా మారడంతో.. తులసిబాబును అరెస్టు చేయడం కష్టమన్న భావన ఏర్పడింది. అందుకే ఇప్పటిదాకా బాబు మీద ఈగ కూడ వాలలేదు. పోనీ.. తనపై ఫలానా తులసి బాబు హత్యాయత్నం చేశారని స్వయంగా డిప్యూటీ స్పీకర్, తన పార్టీకే చెందిన రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేసిన తర్వాతయినా.. సదరు ఎమ్మెల్యే, తనతో ఉన్న బాబును పక్కనపెట్టారా అంటే అదీ లేదు. ఎంచక్కా వెంటపెట్టుకునే తిప్పుకుంటున్నారు.

ఈ క్రమంలో తాజాగా, సదరు తులసిబాబును విచారణకు రమ్మని ఒంగోలు ఎస్పీ పిలిపించారు. సాధారణంగా అయితే నిందితుడయిన వ్యక్తి, చడీ చప్పుడు లేకుండా విచారణకు హాజరవ్వాలి. కానీ తులసి మాత్రం అందుకు భిన్నంగా.. వందలాది మంది గుడివాడ ఎమ్మెల్యే మద్దతుదారులతో వచ్చి, చంద్రబాబు జిందాబాద్.. తులసి బాబు జిందాబాద్.. జై తె లుగుదేశం అంటూ నినాదాలతో రచ్చ చేశారు. అంటే తామంతా టీడీపీకి చెందిన వాళ్లమేనని చెప్పారన్నమాట. తులసిబాబు వెంట లోపలికి వెళుతున్న అనుచరులను, పోలీసులు ఆపిన క్రమంలో అక్కడ చిన్న సైజు యుద్ధవాతావరణం. సరే.. తర్వాత సహ నిందితుడయిన విజయపాల్‌తో కలిపి విచారించడం.. తులసిని అరెస్టు చేయడం జరిగిందనుకోండి. అది వేరే విషయం.

అయితే ఇక్కడో ఆశ్చర్యమైన అంశాలు సమాధానం లేని ప్రశ్నగా మిగిలాయి. బాధితుడైన రఘురామకృష్ణంరాజు టీడీపీ ఎమ్మెల్యే. ప్లస్ డిప్యూటీ స్పీకర్. ఆయన ఫిర్యాదు చేయడంతో అరెస్టయిన వ్యక్తి కూడా, ఇప్పుడు అధికారికంగానే టీడీపీ నాయకుడు. ప్లస్ గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే ఖాసు దోస్తు. మరి ఈ పరిణామాలను, అరెస్టును ఎలా చూడాలి?

టీడీపీ ఎమ్మెల్యే ఫిర్యాదుతో.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడైన, టీడీపీ నాయకుడు అరెస్టు అనా? టీడీపీలో ఉన్న సీఐడీ మాజీ చీఫ్ అనుచరుడు అరెస్టు అనా? గుడివాడ టీడీపీ నేత అరెస్టు అనా?! తాత్కాలిక రాజకీయ అవ సరాల కోసం జరుగుతున్న చేరికల పర్వంతో.. ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో నాయకత్వం, ఇప్పటికయినా గ్రహిస్తే మంచిదన్నది కార్యకర్తల ఉవాచ.

LEAVE A RESPONSE