Suryaa.co.in

Editorial

మరణ మృదంగం.. మానవ తప్పిదం!

  • తిరుమలలో ‘కొండ’ంత విషాదం

  • ఈఓ, అడిషనల్ ఈఓ, చైర్మన్ అనుభవరాహిత్యం

  • పోలింగ్ బూత్‌ల మాదిరిగా తిరుమలలో ఆ కౌంటర్లేమిటి?

  • గత పద్దతి ఎందుకు పాటించలేదు?

  • అడిషనల్ జేఈఓ నిర్ణయాలపై గత కొంతకాలం నుంచి విమర్శలు

  • ఈఓ, అడిషనల్ ఈఓలపై వేటు వేయాల్సిందే

  • దర్శనం టోకెన్ ఉంటేనే దర్శన నిబంధనే కొంప ముంచిందా?

  • ఆ నిర్ణయం తీసుకున్నది ఎవరు?

  • గతంలో ఎక్కడికక్కడ టోకెన్ల విధానం

  • 94 టోకెన్ కౌంటర్లు పెడితే ఎందుకీ విషాదం?

  • ఆ 5 వేల మంది పోలీసులు ఎక్కడున్నారు?

  • ముందే ఊహించానన్న చైర్మన్ మరి ఎందుకు అప్రమత్తం చేయలేదు?

  • టెంట్లు, తిండికూడా పెట్టలేని టీటీడీ వైఫల్యం

  • కుట్ర కోణం లేకపోతే మంచిదే

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ 4 డిసెంబర్ 2024 సంధ్య థియేటర్ దుర్ఘటనకు, 8 జనవరి 2025 తిరుమల తిరుపతి దేవస్థానం దుర్ఘటనకూ పెద్దగా తేడా ఏమీ లేదు. కొండంత నిర్లక్ష్యం సాక్ష్యం! మానవ తప్పిదాలే రెండు. సామాన్యుడే బలిపశువు’’
– ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు.. తాజాగా తిరుమలకు వచ్చిన భక్తులను అధికారులు వైకుంఠానికి పంపించిన నిర్లక్ష్యంపై ఝళిపించిన కొరడా ఇది.

నిజమే. పాపం కొండపై ఉన్న దేవుడిని చూసేందుకు వచ్చిన భక్తులను.. దేవుడిని చూడకుండానే దేవుడి దగ్గరకు పంపించిన కొండంత నిర్లక్ష్యానికి మాటలు చాలవు. అవును ఇది నిస్సందేహంగా మానవతప్పిదమే. అధికారుల మధ్య సమన్వయ లోపం.. ప్రచార కాంక్ష.. మతిలేని నిర్ణయాలు.. అహంకారపూరిత ప్రవర్తన..వీటికిమించి అనుభవరాహిత్యం.. కలసి వెరసి ఆరుగురు అమాయక భక్తులను, ‘టోకెన్ తీసుకుండానే వైకుంఠానికి పంపే’ందుకు కారణమవడం క్షంతవ్యం కాదు.

గత వారం రోజుల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాటుచేసే సౌకర్యాలపై.. టీటీడీ చైర్మన్, ఈఓ, అడిషనల్ ఈఓ, ఎస్పీ సమీక్ష మీద సమీక్షలు నిర్వహించారు. ప్రెస్‌మీట్ల మీద ప్రెస్‌మీట్లు పెట్టారు. ఏర్పాట్లు అదుర్స్ అని ఎవరి భుజాలు వారే చరచుకున్నారు. కానీ అవేమీ ఆ భక్తుల ప్రాణాలు కాపాడలేకపోయాయి. వారి ప్రకటనలు నిజమేకామోసని నమ్మి వచ్చిన అమాయక భక్తులు క్యూలైన్లలో నలిగిపోయారు. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? మూల్యం చెల్లించుకుంది ఎవరు? బాధ్యులను వదిలేస్తారా? ఇవీ భక్తకోటి సంధిస్తున్న ప్రశ్నలు.

దీనికి సంబంధించి ఈఓ, అడిషనల్ ఈఓలపై వేటు వేయకపోతే.. పాలకులు ఆ నిర్లక్ష్యాన్ని సమర్ధిస్తున్నారన్న తప్పుడు సంకేతాలకు కారణమవడం ఖాయం. ఆ ఇద్దరినీ ఏరికోరి తెచ్చుకున్నందుకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంది. వయసు, అనుభవం, ధార్మిక వ్యవహారాలపై అవగాహన ప్రాతిపదికన కాకుండా.. కులం కోణంలో ఎంపిక చేస్తే, ఫలితాలు ఇంతకు మించి భిన్నంగా ఉండవన్నది హైందవుల మనోగతం.

సీఎస్ పదవి ఏ ఐఏఎస్ అయినా చేస్తారు. కానీ టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓలు కావడానికి ధార్మికంగా-నైతికంగా కొన్ని అర్హతలు అవసరం. అది ఎవరంటే వారు చేసే హోదా కాదు. కనీసం పూజాదికాలు, సంప్రదాయం, ధర్మంపై అవగాహన అవసరం. గత పదేళ్ల నుంచి అలాంటి అర్హత లున్న అధికారి ఆ స్థానంలో కూర్చుంటే ఒట్టు. అర్హత ప్రాతిపదిక కాకుండా, కులప్రాతిపదికన జరుగుతున్న ఎంపికలే దానికి కారణమన్నది నిష్ఠుర నిజం.

ఫలానా బీసీకి ఒక పదవి ఇస్తే ఆ కులానికి చెందిన వారంతా తమ వైపు మొగ్గు చూపుతారనో.. ఫలానా ఓసీ అధికారికి ఆ పోస్టింగ్ ఇస్తే ఆ కులం వారంతా తమకు జై కొడతారన్న.. మతిలేని లెక్కలతో జరిపే నియామకాల ఫలితం ఇలాగే ఉంటాయన్నది, హిందూ సంస్థల వాదన. తాజా విషాదం చూసిన తర్వాతయినా పాలకులు మేల్కొని, టీటీడీ అంశాలపై అనుభవం, ధార్మిక అంశాలపై అవగాహన ఉన్న వారిని సలహాదారుగా నియమించడం మంచిది.

ఇక తాజా తొక్కిసలాట గురించి తనకు ముందే సమాచారం ఉందన్న చైర్మన్, ఆ మేరకు పోలీసులకు ఎందుకు అప్రమత్తం చేయలేదు? అధికారులకు ఆ మేరకు ఎందుకు ఆదేశాలివ్వలేదన్నది ప్రశ్న. అసలు 5 వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తారన్న పోలీసులు, క్యూలైన్ల దగ్గర వందమందినయినా ఎందుకు నియమించలేదు? అంటే అసలు అంతమంది సిబ్బంది ఉన్నారా? లేకపోతే కాకిలెక్కలేనా? నిజంగా వేలమంది పోలీసులు ఉంటే ఇంత దారుణం ఎందుకు జరుగుతుంది? అన్న సందేహాలు తాజా విషాదం చూసిన వారికె వరికయినా వచ్చి తీరాలి.

అసలు దర్శనం టోకెన్ ఉంటేనే కొండపైకి దర్శనం అనుమతిస్తామన్న నిర్ణయం తీసుకుంది ఎవరు? టీటీడీ పాలకమండలా? లేక ఈఓనా? వారు కాకపోతే అడిషనల్ జేఈఓనా? అన్నది తేల్చాల్సి ఉంది. ఆ నిబంధన పెట్టకపోతే ఇంత విషాదం జరిగేది కాదు. కేవలం ఆ నిబంధనలతో ఒత్తిడి పెరిగి, ఆరుగురు భక్తులు వైకుంఠానికి టోకెన్ తీసుకోవల్సి వచ్చింది. అసలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తాము తీసుకున్న నిర్ణయాలను అధికారులు, పాలకమండలి భేటీలో వివరించారా అన్నది కూడా సందేహమే. వీఐపీల సేవలో త రిస్తున్న అధికారులు భక్తుల సౌకర్యాల గురించి ఆలోచిస్తారనుకోవడం అమాయకత్వమే.

తాజా ఘటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఈఓ.. వారి ప్రశ్నలకు బదులివ్వకుండా, థ్యాంక్యూ అని కారు డోరు వేసుకుని వెళ్లిపోవడం బట్టి.. అధికారుల అహంకారం ఇంకా ‘కొండ’ంత ఉందని స్పష్టమవుతూనే ఉంది. నిజానికి ఇప్పుడున్న ఈఓ శ్యామలరావు, అడిషనల్ జేఈఓ చౌదరి, చైర్మన్ బీఆర్ నాయుడులో ఎవరికీ.. వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించిన అనుభవం లేదు. సరే పాలకమండలి బాధ్యత-పాత్ర తక్కువే ఉన్నప్పటికీ, అసలు నటన సూత్రధారులు ఈఒ-అడిషనల్ జేఈఓలే. ఇటీవలి కాలంలో ఈ ముగ్గురు చేసిన ప్రకటనలకు ఎక్కడా పొంతనే కనిపించదు. కాబట్టి చర్యలు వీరితోనే మొదలుపెట్టడం సబబన్నది భక్తుల ఆకాంక్ష. అటు చైర్మన్ సైతం ఇది అధికారుల నిర్లక్ష్యమేనని చెప్పకనే చెప్పారు కాబట్టి.. ఈఓ,అడిషనల్ జేఈఓలపై వేటు వేయటం ద్వారా, దిద్దుబాటకు దిగడం మంచిది.

క్యూలైన్ల నుంచి బయటకు వస్తున్న భక్తులను, పోలీసులు అమానవీయంగా చేతులు పట్టి లాగేయడం టీవీ చానెళ్లలో చూసిన దృశ్యాలే. ఇలాంటి అమాయనీయ, అనాగరిక చేష్టలే పాలకుల పతిష్ఠ దెబ్బతీసేవి! ఇలాంటి అనాగరిక చర్యల వల్ల ప్రభుత్వంపై భ క్తుల ఆగ్రహం పెరగడం ఖాయం. అక్కడ డ్యూటీలో డీఎస్పీ ఒకరు అనాగకరింగా ప్రవర్తించారని ఓ భక్తుడు చేసిన ఫిర్యాదు పరిశీలిస్తే.. భక్తుల నియంత్రణ విషయంలో పోలీసులకు తగిన శిక్షణ ఇవ్వలేదని అర్ధమవుతుంది. వేలాదిమంది భక్తులను నియంత్రించడం కష్టమే అయినప్పటికీ.. ఆ మేరకు సిబ్బందిని ఎందుకు పెంచేదన్నది ప్రశ్న.

టీటీడీ చరిత్రలో ఇలాంటి మరణ మృదంగం వినిపించిన దాఖలాలు లేవు. నిజానికి గతంలో టోకెన్లు ఎక్కడికక్కడే, ఆన్‌లైన్‌లో ఇచ్చే సంప్రదాయం ఉండేదని, ఇప్పుడు దానిని మార్చి అంతా తిరుపతికి వచ్చి తీసుకోవాలన్న నిబంధనే ఇంతమంది ప్రాణాలు తీసిందన్నది, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడి ఆవేదన. గతంలో ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లోని భక్తులు అక్కడే టోకెన్లు తీసుకుని, వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా.. ఏదో ఎన్నికల పోలింగ్ బూత్‌ల మాదిరిగా కౌంటర్లు పెట్టడం ఎందుకు? 94 కౌంటర్లు పెడితే, ఒక్కో కౌంటర్ దగ్గర ఎంతమంది పోలీసులు కాపలా కాయాలి? మరి అంతమంది పోలీసులు అక్కడ ఎందుకు లేరు?

మరిప్పుడు కేవలం విష్ణువాసం, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద ఉన్న కౌంటర్ల వద్ద మాత్రమే తొక్కిసలాట జరిగి.. అక్కడే నలుగురు భక్తులు మృతి చెంది, 25 మంది గాయపడ్డారంటే.. మిగిలిన కౌంటర్లు పనిచేస్తున్నాయా? లేవా? లేకపోతే కౌంటర్ల సంఖ్య కాకిలెక్కలేనా? ఒకవేళ నిజంగా అవి పనిచేస్తే, అంతా ఒకే చోటకు ఎందుకు వస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. పోనీ కౌంటర్లు పెట్టిన టీటీడీ.. అక్కడికి వచ్చిన భక్తులకు చలి నుంచి రక్షణకు కనీసం టెంట్లు ఏర్పాట్లు చేసిందా? వృద్ధులు, పిల్లలకు మంచినీరు, భోజనం లాంటి సౌకర్యాలు కల్పించిందా అంటే సమాధానం శూన్యం.

ఇక తాజా విషాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు ఆందోళన కలిగించేవే. క్యూ లైన్లలో ఉన్న ఇద్దరు భక్తులే దీనికి కారణమన్నది ఆ వార్తల సారాంశం. అయితే అలాంటి కుట్రకోణమేమీ లేదని, అది అనుకోకుండా జరిగిన సంఘటనే అని చైర్మన్ ప్రకటించడం ఊరట. ఎందుకంటే ఆ కుట్ర కోణం చూపించి, విషాదాన్ని వెనక్కినెట్టి, కుట్రకోణాన్ని తెరపైకి తెచ్చే ప్రమాదం లేకపోలేదు.
ఏదేమైనా టీటీడీ చరిత్రలో తొలిసారి జరిగిన ఈ విషాద ఘటన ఇప్పటి పాలకర్గంతోపాటు, ఇద్దరు అధికారులకు మాయనిమచ్చ. ఇది వారి అసమర్ధ నిర్వహణకు నిలువెత్తు నిదర్శనం. ఈ విషాదాంతానికి నైతిక బాధ్యత వహించి ఆ పదవులకు రాజీనామా చేయడమే మంచిదన్నది భక్తుల వాదన. మరి ఆ ముగ్గురూ అలాంటి ‘నైతిక బాధ్యత’ తమకు ఉందని భావిస్తారో, లేదో చూడాలి.

LEAVE A RESPONSE