రాజు వర్గీయుల సవాల్..!
విజయసాయి రెడ్డి ఢిల్లీలో కూర్చుని రఘు రామకృష్ణ రాజుపై పసలేని ట్వీట్లు పెట్టడం మాని దమ్ముంటే నరసాపురంలో పోటీకి సై అనాలని ప్రత్యర్ధులు సవాలు విసురుతున్నారు.తన హత్యకు కుట్ర జరుగుతోందని, ఝార్ఖండ్ వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసిపి ఎంపీ రఘు రామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలోనే అన్ని వివరాలతో ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని చెప్పారు. దీనిపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
”గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని ‘నన్ను చంపేస్తారు’ అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం” అంటూ రాజును ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో రాజు వర్గీయులు కొందరు విజయసాయి రెడ్డికి ఒక సవాలు విసురతున్నారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చుని రఘు రామకృష్ణ రాజుపై విమర్శలు చేయడం మాని దమ్ముంటే నరసాపురంలో పోటీకి సిద్ధ పడవచ్చు కదా అంటూ నిలదీస్తున్నారు. ఎలాగూ ఈ ఏడాది జూన్ నెలకు అయన రాజ్య సభ సభ్యత్వం ముగుస్తుంది. మళ్లీ అడ్డదారిలో గెలిచి పార్లమెంటుకు పోవడం కంటే ప్రజల చేత ఎన్నుకోబడితే గౌరవం అంటున్నారు. ఎలాగూ గెలవడానికి జగన్ బొమ్మ వుంటే సరిపోతుందని వెటకారం చేస్తున్నారు. నిజంగా గెలుస్తామని నమ్మకం ఉంటే విజయసాయి రెడ్డి రఘు రామకృష్ణ రాజుపై పోటీ చేయాలని సవాలు చేస్తున్నారు.దీనికి విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో చూద్దాం!
– డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్