– రైతుల పక్షాన ఉద్యమం
– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హెచ్చరిక
విజయవాడ : కరేడు రైతులది బతుకు పోరాటం… ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ఇక్కడి విలేఖర్లతో గురువారం మాట్లాడారు. సోలార్ ప్లాంట్ కి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కరేడు గ్రామ రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని ఆమె మండిపడ్డారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే..
ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం. గత వైసీపీ ప్రభుత్వం శిరిడీ సాయి అనుబంధ కంపెనీకి అనుమతులు ఇస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూ సేకరణకు కనీసం గ్రామ సభలు పెట్టలేదు. మూడు పంటలు పండే పచ్చటి పొలాల్లో పరిశ్రమ వద్దనే రైతుల గోడు వినలేదు. ఇండోసోల్ కంపెనీకి అదనంగా భూములు కేటాయించి, ఊరినే ఖాళీ చేయించాలని చూస్తున్నారు.
శాంతియుత ఉద్యమం చేసే కరేడు గ్రామ ప్రజలను నిర్బంధించడాన్ని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే భూసేకరణకు ఇచ్చిన నోటిఫిషన్ ను రద్దు చేయండి. సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై కరేడు గ్రామ ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. గ్రామ సభలు నిర్వహించండి. రైతుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించండి. పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు..అలా అని రైతుల శవాల మీద అక్రమంగా భూసేకరణ చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు.