Suryaa.co.in

Andhra Pradesh

మీరు సహకరిస్తే జల్ జీవన్ మిషన్ సమర్ధవంతంగా పూర్తిచేస్తాం

* ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి తెలియచేశారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర విజన్ ను గౌరవ ప్రధాని ఎదుట ఉంచారు.

ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందించే జల్ జీవన్ మిషన్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.23 వేల కోట్లను కేటాయిస్తే, దానిలో కేవలం రూ.2 వేల కోట్లను మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరాలను మోడీ కి తెలిపారు. ఖర్చు చేసిన నిధుల వల్ల పూర్తయిన పనులు కూడా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా, నాసిరకంగా చేశారని పేర్కొన్నారు.

ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులను వరుసగా కలిసి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర పెద్దల ముందు ఉంచిన పవన్ కళ్యాణ్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలకమైన అంశాలను ప్రధాని మోదీ కి వివరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి తో మాట్లాడుతూ ‘‘జల్ జీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వంలో పూర్తయిన పనుల్లో ఏ మాత్రం ప్రయోజనం లేదు. పనుల కోసం ఖర్చు చేసిన నిధులు సైతం పథక లక్ష్యాలకు దూరంగా ఉన్నాయి. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం అందలేదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన పథకం పనులను తగిన విధంగా ఉపయోగించుకొని, జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు సంపూర్ణ డీపీఆర్ ను తయారు చేసింది.

పథకం ద్వారా గ్రామీణులందరికీ 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, ఎలా ముందుకు వెళ్లాలనే పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించాం. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను కేంద్రం సానుకూల దృక్పథంతో మంజూరు చేయాలని కోరుతున్నాం. దీనివల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సమస్య లేకుండా చూడాలనేది మా ఆశయం” అని విజ్ఞప్తి చేశారు

LEAVE A RESPONSE