– ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కస్తూరి కోటేశ్వరరావు చౌదరి
విజయవాడ: ఖాదీ బోర్డు ద్వారా గ్రామాల్లోని యువతలో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ ప్రెన్యూర్ ను తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు (APKVIB) చైర్మన్ కస్తూరి కోటేశ్వరరావు చౌదరి (కే.కే చౌదరి) తెలిపారు.
తుమ్మలపల్లి కళా క్షేత్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సవిత ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా కే.కే చౌదరి తో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ లు అవకాశం కల్పించినందుకు వారికి జీవితాంతంత రుణపడి ఉంటానన్నారు.
పాదయాత్రలో లోకేష్ కు చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ పనిచేసానన్నారు. ఆయన వెంటే నడిచి, ఆయనలో పని పట్ల ఉన్న మొండితనం, పట్టుదలను దగ్గరగా చూశానని ఇది నా పూర్వ జన్మ సుకృతం అని అన్నారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన పిలుపునందుకొని రాజకీయాలే జీవితంగా 20 సంవత్సరాల క్రితం అడుగుపెట్టానన్నారు.
విద్యార్ధుల కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. గత పరిపాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించ లేకపోవడంతో యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయారన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో మేము కూడా భాగస్వామ్యం అవుతామన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని నమ్మకంగా పనిచేస్తానన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఖాదీ బోర్డు ఉండేలా కృషి చేస్తామని అదేవిధంగా ప్రతి పంచాయతీలో యువతకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ ల మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ.. ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందు కోసం ఎంఎస్ఎంఈ, ఖాదీ గ్రామీణ బోర్డు ద్వారా యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ రుణాలు అందజేయనున్నామన్నారు. రాష్ట్రంలో రాబోయే 5 అయిదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఇందుకోసం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు రేయింబవళ్లు కష్టపడుతున్నారన్నారు. ఈ పోరాటంలో మంత్రి లోకేశ్ వెంట కేకే చౌదరి వంటి యువకులు నిలిచారన్నారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు వస్తున్నాయన్నారు. గతంలో నాయకులు చుట్టూ తిరిగితేగాని పదవులు వచ్చేవి కాదని.. ఇది నిజంగా మంచి పరిణామమన్నారు. ఖాదీ బోర్డు ద్వారా ఎంత చేయాలంటే అంతవరకు చేయొచ్చని.. సబ్సిడీల ద్వారా పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పించవచ్చన్నారు. ఈ ప్రభుత్వం రాబోయే 20-30 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరిగి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచంలో ఏపీ నంబర్ వన్ గా ఉండేలా అందరం కలిసి పనిచేద్దామన్నారు.
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ మా వెనుక ఉండబట్టే ఈ పదవులు మాకు వచ్చాయన్నారు. రాబోయే కాలంలో టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడంతోపాటు వారు జీవితాల్లో స్థిరపడే విధంగా కుట్టు మిషన్లు ఇచ్చి మహిళలను ఆదుకుంటామన్నారు. దీని ద్వారా వారు ఉపాధి అవకాశాలు పొందుతారన్నారు. కేకే చౌదరి కు వచ్చిన పదవి ద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.
రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ ల మంత్రి ఎమ్. రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మా ప్రాంతానికి చెందిన వ్యక్తికి పదవి దక్కటం ఆనందించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి యువ రక్తానికి పట్టం కడుతున్నారన్నారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కేకే చౌదరి అని అన్నారు. అంతేకాకుండా మహిళా లోకానికి పదవులు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. మహిళలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రోడ్లు, భవనాల శాఖల మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడిన వారికి పదవులు వస్తాయనడానికి గుర్తు కేకే చౌదరికి వచ్చిన పదవే నిదర్శనమన్నారు. గత పాలనలో ఎన్నో కష్టాలు పడ్డాం.. నేడు మీ అందరి కృషితో మేము ఈ స్థాయిలో ఉన్నామన్నారు. గత ప్రభుత్వం ఖాదీ బోర్డును పట్టించుకోక పోవడం వల్ల నాశనం అయ్యిందని… ఇప్పుడు ఖాదీ బోర్డును గాడిలో పెట్టే విధంగా కొత్త చైర్మన్ కృషి చేయాలన్నారు. వారానికి ఒకసారి అయినా ఖాదీని అందరూ ధరించి ఆదరించాలన్నారు. ఈ వృత్తికి అలవాటు పడినవారు వేరే వృత్తి చేయలేరని.. అందుకైనా వాళ్లని ఆదరించాలన్నారు.
ఏపీఎస్ ఆర్టీసీ మాజీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ ఏపీ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ గా కేకే చౌదరి సఫలీకృతం కావాలని కోరుకుంటున్నానన్నారు. గతంలో ఖాదీ బోర్డు చైర్మన్ లుగా మంత్రులుగా చేసినవారు కూడా ఈ పదవిని చేపట్టారన్నారు. పాదయాత్రలో మంత్రి లోకేష్ వెన్నంటి ఉన్న వ్యక్తి కేకే చౌదరి అని, చౌదరి చేసే ప్రతి కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుకుంటున్నానన్నారు.
దివ్యాంగుల సంస్థ మాజీ చైర్మన్ జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ కేకే చౌదరి కి బాధ్యతలు పెరిగాయన్నారు. విడిపోయిన రాష్ట్రంలో భారీ పరిశ్రమలు తెలంగాణకు వెళ్లి పోయాయన్నారు. రాబోయే కాలంలో 175 నియోజక వర్గాల్లో ఖాదీ బోర్డులు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. మంత్రి లోకేష్ పాదయాత్ర సక్రమ మార్గంలో నడిచేలా కృషి చేసిన వ్యక్తి కేకే చౌదరి అని అన్నారు. ఆయన పడిన కష్టానికి గుర్తు ఈ పదవి అని ఆయనను కొనియాడారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీడ్ యాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి, ఏపీ సీడ్స్ చైర్మన్ సుబ్బా రెడ్డి, ఆనం వెంకట రమణా రెడ్డి, పారిశ్రామికవేత్త విశ్వేశ్వరరావు, ఖాదీ బోర్డు సీఈవో రాఘవ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ రమేష్, తదితరలు పాల్గొన్నారు.