Suryaa.co.in

Telangana

ఫామ్ హౌస్‌లో కూర్చొని పెన్ను,పేపర్‌తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా?

నిజామాబాద్‌: “తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసింది. ఉద్యమ నేతగా మాత్రమే ఆయనను గౌరవిస్తా. కేసీఆర్ చెప్పినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందా? ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారు . మా గ్రాఫ్ ఎలా పడుతుంది? ఫామ్ హౌస్‌లో కూర్చొని పెన్ను, పేపర్‌తో గీస్తే గ్రాఫ్ పడిపోతుందా ” అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ గ్రాఫ్ మొత్తం నేలమట్టమై ఫామ్ హౌస్‌కు పరిమితమైందని విమర్శించారు.

కేసీఆర్‌కు పగటి కలలు కనడం అలవాటుగా మారిందని, ఆయన శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటే మంచిదని హితవు పలికారు. పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే బలం లేని బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.

రాష్ట్రంలో 56 శాతం బీసీలు తమ వెంటే ఉన్నారని.. ఏడాది పాలనలోనే 56 వేల ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రుణమాఫీతో సహా పలు కీలక హామీలను నెరవేరుస్తుంటే గ్రాఫ్ ఎలా పడిపోతుందో చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, తండ్రీకొడుకులు మాత్రమే పార్టీలో ఉంటారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

LEAVE A RESPONSE