Home » గెలిస్తే మంత్రే…

గెలిస్తే మంత్రే…

కొల్లు రవీంద్రకు అరుదైన అవకాశాలు

” గెలిచాడంటే… మంత్రి అవుతాడంతే” ఈ మాట రాజకీయాల్లో ఎక్కడో అక్కడక్కడ కొందరికి మాత్రమే వర్తిస్తుంది. అలాంటి వారిలో కొల్లు రవీంద్ర ఒకరు. ఆయనే కాదు ఆయన మామ నడకుదుటి నరసింహారావు విషయంలోను ఇది కాన వచ్చింది. 2014లో మచిలీపట్నం నుంచి తొలిసారి గెలిచిన రవీంద్రకు చంద్రబాబునాయుడు క్యాబినెట్లో స్థానం లభించింది.

మళ్ళీ అదే అవకాశం ఇప్పుడు ఆయనకు దక్కింది. మొత్తంగా 2009 నుంచి 2024 వరకు వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన కొల్లు రవీంద్ర రెండుసార్లు విజయం సాధించి రెండు సార్లూ మంత్రి కావడం విశేషం. అలాగే ఈయన మామ స్వర్గీయ నడకుదుటి నరసింహారావు విషయంలోనూ అదే జరిగింది .1999లో ఇదే మచిలీపట్నం నుంచి విజయం సాధించిన నడకుదుటికి ఆ ఎన్నికల్లో గెలవగానే చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో మంత్రి అయ్యే అవకాశం లభించింది.

ఇంతటి అరుదైన అవకాశాలు నాడు నడకుదిటికి నేడు కొల్లు రవీంద్ర కు దక్కాయి. ఒక రాజకీయ పార్టీలో అంతటి ప్రాధాన్యత లభిచడం నిజంగా అరుదైన అంశంగానే చెప్పుకోవచ్చు. అలాగే పార్టీ పట్ల వీరుకున్న చిత్తశుద్ధిని పరిగణలోకి తీసుకోవచ్చు .తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు నుంచి తదుపరి అధినేత నారా చంద్రబాబునాయుడు నేటి యువనేత లోకేష్ వరకు వీరీపట్ల సడలని నమ్మకాన్ని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.

రాజకీయ చైతన్యం గల కృష్ణా జిల్లాలో మంత్రి పదవులు పొందడం అంటే ఇంతకుముందు ఎన్నో కోణాలు కానవచ్చేయి .ఇప్పటి ఉమ్మడి కృష్ణాలో కాని అంతకు ముందున్న పాత నియోజకవర్గాల్లో ఈ అంశాలు సుస్పష్టమయ్యాయి. ఉమ్మడి కృష్ణాలో 2009కి ముందు 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి .

వీటిలో అవనిగడ్డ ,నిడుమోలు నియోజకవర్గాలు తెనాలి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండేవి. కైకలూరు ఇప్పటి మాదిరిగానే ఏలూరు పార్లమెంటు పరిధిలోనే ఉండేది .2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉమ్మడి కృష్ణా లో 16 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. 2009 నుంచి ఈ నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి .వీటిలో కైకలూరు,, నూజివీడు ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వెళ్ళగా మిగిలిన 14 నియోజకవర్గాలు మచిలీపట్నం ,విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చాయి .

ఉమ్మడి కృష్ణాలో నియోజకవర్గాల వారీగా మంత్రి పదవులు పొందిన వారిని పరిశీలిస్తే అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి వెంకటకృష్ణారావు ఆ తర్వాత సింహాద్రి సత్యనారాయణ రావు ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మండలి బుద్ధ ప్రసాద్ 2004లో మంత్రి పదవి పొందారు .ప్రస్తుతం బుద్ధ ప్రసాద్ అవనిగడ్డలో నాలుగో సారి విజయం సాధించారు .తొలిసారిగా 1999లో గెలుపొందిన బుద్ద ప్రసాద్ ఆ తర్వాత 2004 ,2014, 2024 లో విజయఢంకా మోగించారు .

రెండుసార్లు కాంగ్రెస్ ఓసారి టిడిపి తాజాగా జనసేన నుంచి గెలుపొందిన బుద్ధ ప్రసాద్ కు కూటమి క్యాబినెట్లో చోటు తగ్గలేదు. 1978లోనే ఈయన తండ్రి మండల వెంకటకృష్ణారావు జలగం వెంగళరావు క్యాబినెట్లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు .మచిలీపట్నంలో మామ -అల్లుడు నరసింహారావు కొల్లు రవీందర్ తో పాటు అంతకు ముందు పేర్ని కృష్ణమూర్తి ఇంతకు ముందు ఆయన తనయుడు పేర్ని నాని మంత్రి పదవులు పొందారు .

గుడివాడలో కఠారి ఈశ్వర్ కుమార్, కొడాలి నాని కి మంత్రి పదవులు దక్కగా మైలవరం నుంచి కనుమోలు వెంకట్రావు, వడ్డే శోభనాధ్రీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి పదవులు పొందిన వారిలో ఉన్నారు. జగ్గయ్యపేట నుంచి నెట్టెం రఘురాం గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు .తిరువూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంతో పాటు కంకిపాడు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన కోనేరు రంగారావు మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు .

ఇప్పటి ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గ మైన నందిగామ 2009కి ముందు జనరల్ స్థానంలో ఉండేది. ఇక్కడ నుంచి వసంత నాగేశ్వరావు, దేవినేని రమణ మంత్రి పదవులు పొందారు .నూజివీడులో పాలడుగు వెంకట్రావు తర్వాత ఇప్పుడు కె.పి సారధి ఈ నియోజకవర్గ నుంచి మంత్రి కావడం విశేషం .కాగా ఇంతకుముందు పెనమలూరు నియోజకవర్గం నుంచి కెపి సారధి మంత్రిగా పనిచేశారు .

కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ 2014లో బిజెపి నుంచి గెలుపొంది పొత్తులో భాగంగా సిబిఎన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు .ఇప్పటి పెడన నియోజకవర్గం డీలిమిటేషన్కు ముందు మల్లీశ్వరం నియోజకవర్గంగా ఉండేది .ఈ నియోజకవర్గ నుంచి ఓసారి అంకెం ప్రభాకరావు మంత్రి అయ్యారు. పెడన నియోజకవర్గం ఏర్పడ్డాక గత వైసీపీ ప్రభుత్వంలో జోగి రమేష్ మంత్రిగా పనిచేశారు.

అలాగే నిడుమోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం వుండగా ఆ నియోజకవర్గం నుంచి 1983లో గోవాడ మల్లిఖార్జునరావు నాదెండ్ల భాస్కర్ రావు క్యాబినెట్లో ఒక నెల రోజులు పాటు మంత్రిగా పనిచేశారు. 2009 నుంచి ఉమ్మడి కృష్ణాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలుగా కొనసాగుతున్న పామర్రు, తిరువూరు, నందిగామ నియోజకవర్గాల నుంచి ఎవరికి మంత్రిగా ప్రాతినిధ్యం లభించలేదు.

కాగా నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయిన ముదినేపల్లి నియోజకవర్గం నుంచి యేర్నేని సీతాదేవి పిన్నమనేని వెంకటేశ్వరరావు మంత్రిగా పనిచేశారు. ఇదే క్రమంలో అప్పటి కంకిపాడు నియోజకవర్గం నుంచి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ )సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ విధంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎందరో రాజకీయ ఉద్దండులు మంత్రులుగా పని చేయగా ఆ కోవలో తాజాగా కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారధిని మంత్రి పదవులు వరించాయి.

– కె వి కృష్ణా రావు

Leave a Reply