Suryaa.co.in

Editorial

ఇక ఇ’సుఖం’

-ఇక ఉచితంగానే ఇసుక
– పాత ఇసుక విధానం రద్దు
– జగన్ హయాంలో ఇసుక దోపిడీ
– ఇసుక కష్టాలకు తెదేపా సర్కారు తెర
– కొత్త పాలసీ ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం
– ఇసుక విధానంపై మార్గదర్శకాలు విడుదల
– కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ
– స్టాక్ పాయింట్ల స్వాధీనానికి ఆదేశం
– స్టాక్ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక
– లోడింగ్, ట్రాన్స్‌పోర్టుకు డిజిటల్ పేమెంట్లు
– పేద-మధ్య తరగతి వర్గాల ఖుషీ
కూటమి నేతల ఇళ్లకు భవన నిర్మాణ కార్మికులు
తమను ఆదుకున్నందుకు కృత జ్ఞతలు
ఇసుక పాయింట్లు, రీచ్‌ల వద్ద టీడీపీ శ్రేణుల పండగ
( అన్వేష్)

ఏపీ ప్రజలు గత ఐదేళ్ల నుంచి ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలకు చంద్రబాబు సర్కారు తెరదించింది. గత వైసీపీ పాలకుల జేబులు నింపిన, పాత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఉచితంగానే ఇసుక సరఫరాకు మార్గం సుగమం చేసింది. ఆ మేరకు కొత్త పాలసీ, మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై ప్రజలు.. ముఖ్యంగా పేద-మధ్య తరగతి ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రధానంగా ఇక నిర్మాణ రంగం ఊపందుకోనుంది. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని దొరకనుంది.

చంద్రబాబునాయుడు చెప్పినట్టే చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఉచిత హామీని అమలుచేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో కుదేలైన భవన నిర్మాణ రంగాన్ని పరుగులెత్తించే ఉత్తర్వులిచ్చారు. ఐదేళ్ల జగన్ పాలనలో తీసుకువచ్చిన ఇసుక విధానంతో, భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోయింది. హార్డ్‌వేర్ రంగం కూడా చతికిలపడింది. ప్రధానంగా క రోనా సమయంలో కూలీలు ఆకలిచావులకు గురయ్యారు. దానితో టీడీపీ ఎక్కడకక్కడ ఉచిత భోజనాలు ఏర్పాటుచేసి, వారిని ఆదుకుంది.

జయప్రకాష్ కంపెనీకి గుండుగుత్తగా ఇచ్చిన కాంట్రాక్టుతో, జగన్ కుటుంబం వేలకోట్లకు పడగలెత్తిందన్న ఆరోపణలొచ్చాయి. పేరు జేపీది అయినప్పటికీ, పెత్తనమంతా జగన్ కుటుంబమే చూసేదని, మట్టి-ఇసుక వ్యాపారాన్ని ఒక సలహాదారు పర్యవేక్షించారన్న ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కేంద్రంగా రాజకీయాలు శాసించిన ఓ మంత్రి కుటుంబం కూడా, లిక్కర్ వ్యాపారంతోపాటు.. ఇసుక వ్యాపారంపై వందల కోట్లకు పడగలెత్తిందన్న విమర్శలు వినిపించాయి.

తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నాటి సలహాదారు, సీఎంఓలో చక్రం తిప్పిన ఓ రెడ్డి గారు కలసి ఏరోజు లెక్క ఆరోజు చూసేవారన్న విమర్శలూ లేకపోలేదు. ఎమ్మెల్యేలకు ఇసుక-మట్టి తవ్వకాల అధికారం ఇచ్చి, తమ వాటాను ప్యాలెస్‌కు పంపించమని ఆదేశించారన్న ప్రచారం జరిగింది. నాటి మంగళగిరి ఎమ్మెల్యే అందుకు తిరస్కరించడంతో, నియోజకవర్గంలో ఆయనకు పోటీగా మరో రెడ్డిగారిని తీసుకువచ్చి, ఆయన నుంచి వసూళ్లు చేసేవారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరిగింది.

గతంలో తనకు సహకరిస్తున్న నాటి బీజేపీకి సారథ్యం వహించిన ఓ అగ్రనేతకు ధవళేశ్వరం ఇసుక రీచ్‌తోపాటు.. చీమకుర్తిలో గ్రానైట్ కట్టింగ్ వ్యాపారంలోనూ, జగన్ సర్కారు వాటా ఇచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉభయ గోదావరి జిల్లాలో నాడు ఇన్చార్జిగా ఉన్న ఓ ఎంపి, రాజధాని ప్రాంతంలో నాటి ఎంపి ఇసుక అక్రమ రవాణాలో చక్రం తిప్పారన్న ఆరోపణలూ లేకపోలేదు. ఇక నియోజకవర్గ స్థాయిలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు కప్పం కట్టి మరీ ఇసుక తీసుకువెళ్లాల్సిన దుస్థితికి చంద్రబాబు సర్కారు తెరదించింది. ఇక ఉచిత ఇసుక పాలసీతో సామాన్య-మధ్య తరగతి వర్గాలకు ఇసుక కష్టాలు తీరినట్లే.

వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాల విడుదల చేసింది. ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్‌‌గా జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది.

జిల్లా ఇసుక కమిటీల్లో ఎస్పీ, జేసీ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు ఉండనున్నారు. జిల్లాల్లోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఇసుక కమిటీలకు సూచనలు చేసింది.

49 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఇసుక రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లల్లో అందుబాటులో ఉందని వెల్లడించింది. రిజర్వాయర్లు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో డి-సిల్టేషన్ ప్రక్రియకు ఆదేశించింది. డి-సిల్టేషన్ ప్రక్రియ ఎక్కడెక్కడ చేపట్టాలనే అంశాలపై జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి.

ఇసుక లోడింగ్, రవాణ ఛార్జీలను నిర్ధారించే బాధ్యతను జిల్లా కమిటీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద లోడింగ్, రవాణా ఛార్జీల చెల్లింపులను కేవలం డిజిటల్ విధానం ద్వారా జరపాలని స్పష్టం చేసింది. ఇసుకను తిరిగి విక్రయించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

భవన నిర్మాణ మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించొద్దని స్పష్టం చేసింది. ఇసుక అక్రమ రవాణా చేసినా, ఫిల్లింగ్ చేసినా పెనాల్టీలను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ద్వారా ఇసుకను అక్రమ మార్గాల్లో, అమ్మి సొమ్ము చేసుకునే మార్గాలను ప్రభుత్వం మూసేసినట్లు స్పష్టమవుతోంది. తాజా ఉత్తర్వులతో పక్క రాష్ట్రాలకు ఇకపై ఇసుక అక్రమ రవాణాకు తెరపడనుంది.

రాష్ట్రంలో పండగ వాతావరణం
కాగా ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబుకు, రాష్ట్రంలోని పేద-మధ్య తగరతి వర్గాలు హారతులు పడుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇసుక రీచ్‌లు, స్టాక్‌పాయింట్లకు వద్దకు సంబరాలు జరుపుకున్నారు. భవన నిర్మాణ కార్మికులు భారీ సంఖ్యలో టీడీపీ నేతల ఇళ్లకు వచ్చి, తమను ఆదుకున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE