_ బాబుకు అండగా లక్ష సంతకాల సేకరణ
_ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధంపై ఉద్యమం జరుగుతోందని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. 34 గంటల పాటు అరెస్టు చేసిన నంద్యాల నుండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వరకు అనేక రకాలుగా బాబుని ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అక్రమ కేసులో గత 34 రోజులుగా చంద్రబాబు జైలులో ఉన్నారన్నారు. ఉమ్మడి, నూతన ఏపీ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. వయస్సు, హోదా చూడకుండా అక్రమ కేసులో నిర్బంధం చేసి వేధిస్తున్నారన్నారు. స్కిల్ డవలెప్మెంట్ కేసులో 370కోట్ల రూపాయలు అవినీతి అని, 27కోట్లు, 24కోట్లు అని పొంతన లేని సమాధానాలు ప్రభుత్వం చెపుతోందన్నారు.
పవన్ కళ్యాణ్ పరామర్శకు వస్తుంటే అడ్డుకున్నారన్నారు. దేశ విదేశాలలో ప్రజలు చంద్రబాబుకు అండగా ఉన్నారన్నారు. కాకినాడ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా చంద్రబాబుకు అండగా ప్రజలు స్వచ్ఛందంగా లక్ష సంతకాలు చేయనున్నారని వీరిలో వైకాపా సానుభూతిపరులు ఉన్నట్లు నవీన్ చెప్పారు.
ఈ సేకరించిన సంతకాలను గవర్నర్కు పంపుతామని తెలిపారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారనే ఆశాభావంను వ్యక్తం చేశారు. కేవలం అభియోగం మాత్రమే వచ్చిందని దానిపై కక్ష పూరితంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబుకు జైలులో కనీస సౌకర్యాలు కల్పించాలని నవీన్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, బుర్రి సత్యనారాయణ, తూము కుమార్, ఎండీ జహీరుద్దీన్ జిలాని తదితరులు పాల్గొన్నారు.