– చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చిన విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ నేతలు
– వైసీపీ అక్రమ మైనింగ్ పై పోరాటం చేస్తామన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు
శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్జానం రచించిన రవ్వల కొండ గుహను కూడా వదలకుండా వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని పలువురు విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ నేతలు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో వారు చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడారు.
కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం రవ్వలకొండ గుహలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 450 ఏళ్ల క్రితం 12 ఏళ్లు తపస్సు చేసి కాలజ్నానం రాశారు. అలాంటి పరమ పవిత్రమైన రవ్వలకొండను సైతం వైసీపీ అక్రమ మాఫియా ఇస్టానుసారం తవ్వేస్తున్నారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి, రాష్ట్ర పౌరోహిత్య అధ్యక్షులు ఆర్యకట్ల గోవర్ధన శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ, విశ్వ కర్మ సంఘ అధ్యక్షులు డా. చింతాడ బ్రహ్మానందరావు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి అధ్యక్షులు పూలకుంట అరుణాచారి తదితరులు రవ్వలకొండ అక్రమ మైనింగ్ ను ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుని కలిసి వివరించారు.
దీనిపై చంద్రబాబు నాయుడు స్పందిస్తూ… రవ్వల కొండ అక్రమ మైనింగ్ పై పార్టీపరంగా పోరాడటంతో పాటు అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాస్తానని తెలిపారు. అవసరమైతే వైసీపీ అక్రమ మైనింగ్ పై పార్టీ తరపున న్యాయపోరాటం చేస్తామన్నారు.
ఈ సందర్భంగా సంఘనాయకులతో కలిసి పోతూలూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి చిత్రపటానికి చంద్రబాబు పూలమాల వేశారు.