Suryaa.co.in

Andhra Pradesh

అర్హత గల వారందరికీ జగనన్న విద్యా దీవెన పధకం అమలు

* ఈ పధకం క్రింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తున్నాం..
* రాష్ట్రంలో మూడేళ్ళ కాలంలో కాపుల కోసం వివిధ పధకాల క్రింద రూ. 32 వేల కోట్లు అందించాం..
* కాపు నేస్తం పధకం ద్వారా రూ. 1500 కోట్లు అందించాం..
– కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి..

రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారికి విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవడానికి ” జగనన్న విదేశీ విద్యా దీవెనె పధకం ” ఒక వరమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్అ డపా శేషగిరి (శేషు) అన్నారు.

మంగళగిరి కాపు కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ వెనుకబడిన, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు విదేశీ విద్య ఒక కలలా మిగిలిపోయిందని అటువంటి కలలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అర్హత గల ప్రతి ఒక్కరికీ విదేశీ విద్య అందించేందుకు ” జగనన్న విదేశీ విద్యా దీవెనె ” పధకాన్ని అమలు చేస్తున్నామన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి రూ. 8 లక్షల లోపు ఆదాయం కలిగి ఉండాలన్నారు.

విదేశాలలో పిజి కోర్సులు, పిహెచ్ డి, ఎంబిబిఎస్ కోర్సులు చదవడానికి అవకాశం కల్పించామన్నారు. ప్రపంచ ర్యాంకు 1 నుంచి 100 వరకు యూనివర్సిటీలలో ఎంపికైన విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందని, 101 నుండి 200 ర్యాంకులు ఉన్న యూనివర్సిటీలలో ఎంపికైన విద్యార్థులకు రూ. 50 లక్షలు, లేదా ట్యూషన్ ఫీజులో 50% వరకూ చెల్లిస్తారని అయన అన్నారు. పిజి కోర్సులో ప్రవేశించే వారికి 60% మార్కులు లేదా సమాన గ్రేడ్ పొంది ఉండాలన్నారు. పిహెచ్ డి చేసే విద్యార్థులు పిజి కోర్సులో 60% మార్కులు లేదా సమాన గ్రేడ్ పొంది ఉండాలన్నారు. ఎంబిబిఎస్ కోర్సు లో చేరే విద్యార్థులు ఇంటర్ మీడియేట్ లేదా సమాన కోర్సులలో 60% మార్కులు పొంది ఉండాలన్నారు.

అర్హత కలిగిన వారు సెప్టెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. http://jnanabhumi.ap.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలు, సందేహాలు నివృత్తి కొరకు 6305448393, 6305159559 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని అడపా శేషు అన్నారు.

జగనన్న విదేశీ విద్యా దీవెనె పధకం పొందగోరే విద్యార్థులు TOEFL//IELTS/GRE/GMAT పరీక్షలందు అభ్యర్థి అర్హతకు సమాన స్కోర్ సాధించి ఉండాలని, ఈ పధకానికి దరఖాస్తు చేయడానికి ముందే వీసా మరియు పాస్ పోర్ట్ పొంది ఉండాలన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెనె పధకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 35 సంవత్సరాల వయస్సు దాట కూడదని, ఆంధ్ర ప్రదేశ్ నేటివిటీ కలిగి ఉండాలని, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పధకానికి అర్హులని అయన అన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ సంవత్సరంలో ఆగష్టు 1 నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కాపు కల్యాణ మండపములు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ 54వ వార్డులో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మించుటకు కోటి రూపాయలు మంజూరు చేసి నిధులు విడుదల చేయడమైనదని శేషు చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని తెలంగాణా ప్రాంతములో ఉన్న చింతూరు, కూనవరం, ఆటపాక, కుకునూరు, వేలేరుపాడు, బూరగంపాడు మొదలగు 6 మండలాలకు చెందిన మున్నూరు కాపు ప్రజలకు ఇతర జిల్లాలో ఉన్న కాపు కులస్తుల మాదిరి వారికి ఓ.సి. కులముగా సర్టిఫికెట్ లు ఇస్తుంన్నందున అనేక ప్రభుత్వ పథకాలలో లబ్దిని పొందలేక ఇబ్బంది పడుతున్నారని శేషు చెప్పారు.

ఈ విషయమై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లామన్నారు. ఈ మండలాలకు చెందిన మున్నూరు కాపు ప్రజలకు బి.సి.(డి) సర్టిఫికెట్ లు ఇవ్వవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసి ఆదుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 6 మండలములకు చెందిన కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి సామజిక వర్గాల ప్రజలు ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలియజేసారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తెలిపారు.

రాష్ట్రంలో గత మూడేళ్ళ కాలంలో కాపుల సంక్షేమానికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ. 32 వేల కోట్లు అందించామన్నారు. కాపు నేస్తం క్రింద కాపు మహిళలకు రూ. 1500 కోట్లు అందించామన్నారు. కాపు కార్పొరేషన్ ద్వారా త్వరలో రుణాలు అందిస్తామని చైర్మన్ అడపా శేషు అన్నారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ బి. ధనుంజయుడు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE