Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థులు కేంద్ర బిందువుగానే విధానాలు అమలు

•విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా తరగతుల విలీనాలు జరుగవు
•ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గట్టిపునాధి వేసేందుకే తరగతుల విలీనాలు
•3 వ తరగతి నుండే సబ్జెక్టు టీచర్లతో బోధనకు అవకాశం కల్పించే తరగతి విలీనాలు
•మౌలిక,మానవ వనరులునుసక్రమంగా వినియోగించకునేందుకే తరగతి విలీనాలు
•జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగానే విద్యా రంగంలో పలు సంస్కరణలు
రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ స్పెషల్ సి.ఎస్. బి.రాజశేఖర్

అమరావతి, ఆగస్టు 1: జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అమల్లో భాగంగా విద్యార్థులు కేంద్ర బింధువుగానే రాష్ట్రంలో విద్యా విధానాలను రూపొందించి అమలు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగించే విధంగా తరగతుల విలీనాలను చేయడం జరుగదని, ఆ సమస్యలను అన్నింటినీ పరిష్కరించితదుపరి మాత్రమే తరగతుల విలీనం చేయడం జరుగుతుందని ఆయన స్పష్టంచేశారు.

సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తరగతుల విలీనాలపై విద్యార్థులను, తల్లిదండ్రులను మరియు ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా పలు మాధ్యమాల్లో వార్తాంశాలను, కథనాలను ప్రచురించడం సరికాదన్నారు. మౌలిక,మానవ వనరులును సక్రమంగా వినియోగించకునేందుకు మరియు ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు గట్టిపునాధి వేసేందుకే తరగతుల విలీనాన్ని చేయడం జరుగుచున్నదని, ఇది పాఠశాలల విలీనం కాదని ఆయన స్పష్టంచేశారు. అంగన్ వాడీ పిల్లలకు ప్రీనర్సరీ భోదించే తరగతులను ఒకటి, రెండు తరగతులతో విలీనం చేసి పి.పి.1 మరియు పి.పి.-2 పాఠశాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు.

అదే విధంగా మూడు నుండి ఐదో తరగతి విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ సబ్జెక్టు టీచర్లతో వారికి విద్యా బోధన చేయడం జరుగుచున్నదన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో 2,943 ప్రాథమిక పాఠశాలలను ప్రక్కనే ఉన్న లేదా 250 మీటర్ల దూరంలోపు ఉన్న 2,800 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 2022-23 విద్యా సంవత్సరంలో 620 ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలను ఒక కిలో మీటరు దూరం లోపు ఉన్న 4,954 పాఠశాలల్లో విలీనం చేయడం జరిగిందన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 వేల 870 పాఠశాలలను విలీనం చేయగా, కేవలం 820 పాఠశాలలకు సంబందించి కొన్ని సమస్యలు ఉన్నట్లు స్థానిక శాసన సభ్యులు తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు.

ఈ పాఠశాలలను అన్నింటినీ పరిశీలించి వాటి సమస్యలపై నివేదించాల్సినదిగా జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా, డి.ఇ.ఓ. కన్వీనర్ గా జడ్.పి. సి.ఇ.ఓ., ఆర్.డి.ఓ. మరియు ప్రత్యేక అధికారి సభ్యులుగా జిల్లా వారీగా కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఆయా పాఠశాల విలీనంలోని సమస్యలను గుర్తించి సాధ్యమైనంత మేర వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, సాధ్యంకాని పక్షంలో ఆయా పాఠశాలల విలీనాన్ని నిలుపుదల చేస్తామని ఆయన తెలిపారు. తరగతుల విలీనానికి సంబందించి ఎక్కడన్నా ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టి తెచ్చినట్లైతే వెంటనే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ విధానం అమలు…….
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అమల్లో భాగంగానే ఈ తరగతుల విలీన ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. ఈ పక్రియకు ముందు అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, శాసన సభ్యులు, స్టేక్ హోల్డర్ల తో పలు మార్లు సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను, సూచలను తీసుకొన్న తదుపరి మాత్రమే ఈ విలీన ప్రక్రియను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ విధానం అమలు వల్ల ఏ ఒక్క ఉపాద్యాయ పోస్టును రద్దుచేయడం జరుగదని, ఇంకా వారికి ఎంతో మేలు జరుగుచున్నదన్నారు. దాదాపు 8,232 ఎస్.జి.టి.లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించడంజరుగుచున్నదని, అదనంగా పెద్ద సంఖ్యలో హెచ్.ఎమ్.పోస్టులను కూడా మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. అదే ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక హెచ్.ఎం., పి.ఇ.టి.తో పాటు తొమ్మిది మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారని ఆయన తెలిపారు. ప్రతి ఉపాద్యాయునికి వారానికి 36 పీడియడ్లు మించకుండా చూడటం జరుగుచున్నదని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు ఎవరికీ అన్యాయం జరుగదని ఆయన తెలిపారు.

నాడు-నేడు లో భాగంగా ఈ ఏడాది 32 వేల అదనపు తరగతుల నిర్మాణం……
కనీస పది అంశాలకు సంబందించి మౌలిక వసతులను కల్పించి ఎంతో ఆకర్షణీయంగా, సుందరంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నాడు-నేడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత రెండున్నరేళ్లలో 15 వేల 715 పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 32 వేల అదనపు తరగతులను నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు.

LEAVE A RESPONSE