– 81 రిటైల్ షాపులు.. 226 కోట రూపాయల ఫీజు
– ఆయన కంపెనీకి మరో కంపెనీ బ్యాంకు ఈఎండీల సర్దుబాటు
– ఆ కంపెనీకి మాగుంట కంపెనీ ఈఎండీల సర్దుబాటు
– మాగుంట రెండు కంపెనీలకు అరబిందో గ్రూపు శరత్‌చంద్రారెడ్డి కంపెనీల బ్యాంకు గ్యారంటీలు
– శరత్‌చంద్రారెడ్డినీ సీబీఐ విచారించే అవకాశం?
– ఢిల్లీలో మూడు జోన్లు దక్కించుకున్న మాగుంట కంపెనీ
– ఐఏఎస్ గోపీకృష్ణ నెల్లూరు జిల్లా వాసి
– ఈ కేసులో గోపీకృష్ణ ఏ-2గా సీబీఐ కేసు నమోదు
– లిక్కరు కేసులో ‘నెల్లూరు లాలూచీ?
– చిక్కుల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి భవితవ్యం?
– పదండి… సీబీ‘ఐ’ ‘మందు’కు
– మాగుంటకు సీబీఐ కేసుల గంట
– హస్తినలోనూ మాగుంట హవా
– రిటైల్ రంగాన్నీ వదలని మాగుంట కంపెనీలు
– ‘మనీ’ష్ సిసోడియాతో మెనీ లింకులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ‘తెలుగు వెలుగుల’ పేర్లు చర్చనీయాంశంగా మారింది. వైసీపీ-టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ప్రముఖులు, వారికి సన్నిహితంగా వ్యవహరించే వ్యాపారుల పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీబీఐ నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఇద్దరు తెలుగు ప్రముఖుల పేర్లు బయటకురాగా.. నెల్లూరు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కంపెనీ ఈ కుంభకోణంలో ఉందన్న వార్తలు, ఆయన రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఒంటరివాడైపోయిన ఎంపీ మాగుంట, ఇప్పుడు ఏకంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకుపోవడం ఆయనను మరింత ఇబ్బందులోకి నెట్టింది.
లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇంటిపై, సీబీఐ దాడులు చేసిన నేపథ్యంలో.. ఏపీకి చెందిన నెల్లూరు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కంపెనీలు కూడా ఉండటం, రాజకీయంగా ఆయనను చిక్కుల్లో పడేసింది. దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న మాగుంటపై, ఇప్పటివరకూ ఇలాంటి తరహా ఆరోపణలు వెలుగుచూడటం ఇదే ప్రథమం. ఎంపీగా ఉన్న పరిచయాలను వినియోగించుకుని తమిళనాడు, కర్నాటక వంటి రాష్ర్టాల్లో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకున్నారు. ప్రధానంగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించిన కాలంలో, తమిళనాడు రాష్ట్రంలో మాగుంట లిక్కర్ రంగంలో ఒక వెలుగు వెలిగిన విషయం బహిరంగమే.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణంలో మాగుంట కంపెనీ పేరు కూడా బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం ఆయన ప్రత్యర్ధులు, విపక్షాలకు బ్రహ్మాస్తంగా మారింది. ఇప్పటివరకూ వివాదాస్పదుడిగా పేరున్న మాగుంట, తొలిసారి లిక్కర్ స్కాంలో చిక్కుకోవడం అటు వైసీపీ శ్రేణులకూ ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఎంపీ మాధవ్ అశ్లీల వీడియో పార్టీని భ్రష్టుపట్టించగా, తాజాగా వెలుగుచూసిన లిక్కర స్కాంలో ఎంపీ మాగుంట కంపెనీల పేర్లు బయటకు రావడం వల్ల పార్టీ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం వచ్చిందన్న ఆందోళన, వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
కాగా ఢిల్లీలో మద్యం షాపులను జోన్లుగా విభజించారు. ఆ ప్రకారంగా మొత్తం 32 రిటైల్ జోన్లు ఉంటాయి. ప్రతి జోన్‌లో 27 రిటైల్ షాపులుంటాయి. జోన్‌కు 225 కోట్ల రూపాయల చొప్పున సగటు రిజర్వుడు ఫీజు చెల్లించాలి. బాలాజీ గ్రూపునకు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కంపెనీలయిన మాగుంట ఆగ్రో ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పిక్సీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ పేరిట మొత్తం మూడు జోన్లు టెండరులో సాధించుకున్నాయి. అంటే ఏకంగా 81 రిటైల్ షాపులు దక్కించుకున్నాయన్న మాట. అందుకు 675 కోట్లు సగటు ఫీజుగా చెల్లించారని స్పష్టమవుతుంది.
అయితే ఈ వ్యవహారంలో కంపెనీలు ఒకరికొకరు సమర్పించిన ఈఎండీ లు మరింత ఆసక్తికరంగా, అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. బబ్లీ ఎంటర్‌ప్రైజస్ అనే కంపెనీ.. మాగుంటకు చెందిన కంపెనీకి 25 కోట్ల రూపాయల ఈఎండీ సమర్పించగా, మాగుంటకు చెందిన బాలాజీ గ్రూపు, హివిడి ఎంటర్‌ప్రజెస్ 35 కోట్ల రూపాయలకు ఈఎండీ సమర్ఫించడం విశేషం. ఖావోగలి కంపెనీకి, జైనాబ్ ట్రేడింగ్ కంపెనీ 25 కోట్ల రూపాయల ఈఎండీ సమర్పించింది. ఈ జైనాబ్ కంపెనీ, మాగుంట కుమారుడైన రాఘవకు చెందినది కావడం ప్రస్తావనార్హం.
అసలు మద్యం కంపెనీ తయారీదారులు, పంపిణీదారులు కూడా సాధారణ రిటైల్ అమ్మకాల్లో కాలుబెట్టడం, వారికి కీలకమైన ఢిల్లీ ప్రాంతాల్లో రిటైల్ షాపులు అడ్డదారిలో కట్టబెట్టడమే వైన్‌షాపు యజమానులను ఆశ్చర్యపరుస్తోంది. సహజంగా ఏ రాష్ట్రంలో కూడా లిక్కర్ తయారీదారులు, పంపిణీదారులు సాధారణ రిటైల్ షాపులు తెరిచి వ్యాపారాలు చేసిన దాఖలాలు లేవ ని, వైన్‌షాపు యజమానులు చెబుతున్నారు.
పనిచేసిన నెల్లూరు బంధం..
సీబీఐ కేసుతో వెలుగుచూసిన తాజా లిక్కర్ కుంభకోణంలో ‘నెల్లూరు బంధం’ బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ క్యాడర్‌కు చెందిన ఏపీ ఐఏఎస్ అరవ గోపీకృష్ణ నెల్లూరు వాసి కావడం గమనార్హం. అదే జిల్లాకు చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దశాబ్దాల నుంచి లిక్కర్ వ్యాపారంలోనే కొనసాగుతున్నారు. దానితో ఈ ‘జిల్లా అనుబంధం’ ఢిల్లీలో రిటైల్ షాపులు చేజిక్కించుకునేందుకు అక్కరకొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపీకృష్ణ ఎక్సైజ్ కమిషనర్‌గా పనిచేసినప్పుడే ఈ కుంభకోణం జరగడటం ప్రస్తావనార్హం. లిక్కరు కింగులంతా కలసి ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ రూపకల్పన-అమలులో కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ అభియోగం.
తెర వెనుక అరబిందో ఆర్ధిక సహాయం?
సీబీఐ కేసుతో వెలుగుచూసిన ఈ కుంభకోణంలో, అరవిందో కంపెనీకి చెందిన శరత్‌చంద్రారెడ్డి కంపెనీ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి అతి సన్నిహితంగా ఉండేశరత్చంద్రారెడ్డి కంపెనీల నుంచి.. ఖావోగలీ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, బ్యాంకు గ్యారంటీలు ఇచ్చాయన్న ఆరోపణలు పరిశీలిస్తే.. ఈ వ్యవహారంలో శరత్‌చంద్రారెడ్డి కంపెనీ కూడా చిక్కుల్లో పడక తప్పేలా లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.