పొన్నూరు: ప్రతిపక్ష పార్టీ పార్టీ కేంద్ర కార్యాలయం పైన, ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడి పిరికిపంద చర్య అని, దాడులతో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలనుకోవటం వారి చేతకానితనానికి నిదర్శనమని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎంఎల్ఏ దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అన్నారు. ఈ దాడి ప్రజాస్వామ్య పునాదులపైన జరిగిన దాడిఅని, దాడులను ఖండిస్తున్నామని నరేంద్రకుమార్ తెలిపారు. రాష్ట్రంలో గత రెండున్నరేళ్లుగా శాంతి భద్రతలు లోపించాయని, ప్రస్తుతం అవి పరాకాష్టకు చేరాయని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం, టిడిపి అధికార ప్రతినిధి కొమారెడ్డి పట్టాభిరామ్ ఇల్లు, రేణిగుంటలోని పార్టీ కార్యాలయం, హిందూపురం ఎంఎల్ఏ బాలకృష్ణ ఇంటిపై ఏక కాలంలో దాడులు చేయటం చూస్తుంటే ఇది పక్కా ప్రణాళికతో పోలీసు అధికారుల అండదండల తోనే జరిగాయని తెలుస్తుందని ఆయన అన్నారు.
ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైందని, గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు . సీఎం జగన్ను తెదేపా నేతలు విమర్శలకు సమాదానం చెప్పలేని వైకాపా శ్రేణులు, దాడులతో ప్రతిపక్ష నేతల గొంతులు నొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడటం చూస్తుంటే రాక్షస రాజ్యాన్ని తలపిస్తుందని తెలిపారు. రాష్ట్ర డిజిపి కార్యాలయం ప్రక్కనే ఉన్న టిడిపి కార్యాలయంపై దాడులు జరుగుతుంటే పోలీసులు చేష్టలుడికి చూస్తుండటం వారి చేతకాని తనానికి నిదర్శనమని అన్నారు. ఇలాంటి తాటాకు చప్పులకు టిడిపి బయపడదని ఆయన తేల్చిచెప్పారు. దాడులకు పాల్పడ్డ వారిన కఠినంగా శిక్షించాలని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించిన ఈ నేపధ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలని నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు.