Suryaa.co.in

Editorial

బాబు..పవన్ కిస్సా కుర్సీ కా!

– చంద్రబాబు-పవన్‌లో సీఎం పదవి ఎవరికి?
– సీఎంగానే మళ్లీ అసెంబ్లీలో కాలుపెడతానన్న చంద్రబాబు
– పవన్ సీఎం అవుతారంటున్న జనసేన నేతలు
– మరి ఇద్దరిలో త్యాగరాజులెవరు?
– బాబు-పవన్‌ది ఒకేమాట
– రెండు పార్టీల నేతలదే భిన్నమైన బాట
– ఇప్పటికే పవన్ సభలో జనసైనికుల ‘సీఎం పవన్’ అంటూ నినాదాలు
– చెరి  రెండున్నరేళ్లంటున్న హరిరామజోగయ్య
– పవన్ సీఎం, బాబు డిప్యూటీ సీఎం అంటున్న జనసైనికులు
– జనసేనతో నష్టమంటున్న కొందరు టీడీపీ నేతల ఆందోళన
– లాభమేనని మరికొందరు నేతల వాదన
– ఎక్కువ సీట్లిస్తే నష్టపోతామంటున్న టీడీపీ సీనియర్లు
– టీడీపీతో పొత్తు వద్దంటున్న కొందరు జనసేన నేతల ఆందోళన
– కలిస్తేనే అధికారమంటున్న ఇంకొందరు సీనియర్ నేతలు
– బాబు సీఎం, పవన్ డిప్యూటీ సీఎం అంటున్న టీడీపీ సీనియర్లు
– చెరిసగం సీట్లిస్తేనే పొత్తు పెట్టుకోవాలంటున్న మరికొందరు నేతలు
– పొత్తులు ఇద్దరికీ అవసరమేనంటున్న ఇరుపార్టీ నేతలు
– కల్యాణ్‌తో చివరి వరకూ కష్టమేనని విశ్లేషకుల అంచనా
-పొత్తు కుదరకముందే టీడీపీ-జనసేన సమస్యల సంసారం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆలూ లేదూ చూలూ లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ఇంకా మొదలుకాని టీడీపీ-జనసేన కొత్త కాపురం! వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు.. కలసి కదం తొక్కాలని బాసలు చేసుకున్న, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. ఐదు నక్షత్రాలPawan-Kalyan-meets-Naidu హోటల్ సాక్షిగా వేసిన తొలి అడుగు, జయప్రదంగా ముగిసింది. ఇక అసలు సిసలు మలి అడుగైన ఎన్నికల పొత్తుల పైనే, ఇరు పార్టీల్లో పంచాయతీ మొదలు కావడం, రెండు శిబిరాలకూ ఆందోళన కలిగిస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేనాధిపతి పవన్ ఇద్దరికీ, పైస్థాయిలో జగన్‌పై పోరు విషయంలో, ఏకాభిప్రాయం- స్పష్టత ఉంది. పోటీ-పొత్తుపై అవగాహన ఉంది. అయితే ఎటొచ్చీ.. ఆ రెండు పార్టీల నేతల పంచాయితీనే.. ‘గెలిస్తే సీఎం ఎవరన్న’ ముందస్తు పంచాయతీకి తెరలేపింది. చంద్రబాబు సీఎం-పవన్ డిప్యూటీ సీఎం అన్నది తెలుగుతమ్ముళ్ల వాదనయితే… పవన్ సీఎం-బాబు డిప్యూటీ సీఎం అన్నది జనసైనికుల డిమాండ్. ఇదీ టీడీపీ-జనసేన మధ్య చిగురించిన, ఎన్నికల ప్రేమబంధం కథ.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలసి కదం తొక్కడం దాదాపు ఖరారయింది. ఇక సీట్లపై మాట-ముచ్చట ఒక్కటే మిగిలింది. బాహుబలిగా మారిన జగన్మోహన్‌రెడ్డిని.. విడిగా ఎదుర్కొవడం కష్టమన్న నిర్ణయానికి, అటు బాబు-ఇటు పవన్ వచ్చేశారు. నిజానికి టీడీపీ-జనసేనకు పొత్తు అనివార్యం. విడిగా పోటీ చేస్తే, జగన్‌ను గద్దె దించాలన్న ఇద్దరి లక్ష్యం నెరవేరదు. అందులో భాగంగా ఇద్దరూ తగ్గక తప్పదు.

క్షేత్రస్థాయి వాస్తవాలు, అన్నిరంగాల్లో అమేయ శక్తిసంపన్నుడిగా మారిన వైసీపీ బలం ప్రకారం.. ఏ పార్టీ అయినా విడిగా పోటీ చేస్తే, జగన్ పార్టీని ఓడించడం కష్టం. జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఆయన పార్టీ యంత్రాంగం- ధనబలం-బీజేపీ తెరచాటు మద్దతు, వైసీపీని మహాబలుడిగా మార్చాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక అడుగు వెనక్కి తగ్గి.. పవన్ ఉన్న హోటల్‌కు వెళ్లి ఆయనతో భేటీChandrababu-Pawan-Kalyan కావడం, సరికొత్త రాజకీయ సమీకరణకు తెరలేపింది. ఎన్నికల వరకూ జగన్ సర్కారుపై, కలసి కదం తొక్కాలన్నది ఇద్దరి ఏకాభిప్రాయం. ఆ తర్వాత చంద్రబాబు పల్నాడు పర్యటనలో, టీడీపీ-జనసేన జెండాలు కలసి కనిపించడం కొత్త మలుపు.

అయితే.. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలూ కలసి పోటీ చేస్తే, ముఖ్యమంత్రి ఎవరన్న ముందస్తు పంచాయతీకి, ఏడాదిన్నరకు ముందే తెరలేవడం ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ, జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్య తాజాగా చేసిన ప్రకటనbolisetti-satya అగ్నికి అజ్యం పోసింది. ఇటీవల చోడవరంలో వైసీపీ నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న విద్యార్ధులు, ‘సీఎం పవన్ జిందాబాద్’ అంటూ నినదించిన వైనం చర్చనీయాంశమయింది. పవన్ సభలు-కార్యక్రమాల్లో పాల్గొంటున్న జనసైనికులు కూడా, ఆయన ప్రసంగం మధ్యలో ‘సీఎం పవన్’ అంటూ నినదిస్తున్న వైనాన్ని విస్మరించకూడదు.

ఈ పరిణామాలు టీడీపీ-జనసేన పొత్తును పుట్టుక్కుమనిపిస్తాయా అన్న ఆందోళన, రెండు పార్టీల్లోనూ నెలకొంది. ఎందుకంటే.. తాను మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకోవాలంటే, ఆయన మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. సుదీర్ఘకాలం సీఎం-విపక్షనేతగా పనిచేసిన అనుభవం బాబుకు ఉంది. టీడీపీకి ఉన్న యంత్రాంగం, వనరులు కూడా అధికం. బూత్-మండల-జిల్లా కమిటీలు బలంగా ఉంటాయి. ఆ పార్టీ టికెట్ ఆశించేవారి సంఖ్య, నియోజకవర్గానికి అరడజనుమందికి పైగానే ఉంటుంది.

జనసేనాధిపతి పవన్ ఈ విషయంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఆ పార్టీలో నాదెండ్ల మనోహర్ తప్ప, ఎమ్మెల్యే స్థాయి నేతలెవరూ కనిపించరు. పార్టీని పవన్ వ్యవస్థాగత నిర్మాణం చేయలేకపోయారు. జనసేనలో రాజకీయానుభవం ఉన్న నాయకులు కూడా కనిపించరు. ఆయన వ్యూహబృందం మేధస్సు కూడా అంతంతమాత్రమే. పవన్‌కు దిశానిర్దేశం చేసే రాజకీయానుభవం ఉన్న సలహాదారులు కూడా లేకపోవడం మైనస్‌పాయింట్. పవన్ ఆదేశిస్తే తప్ప, ఏదీ ముందుకు కదలదు. అందువల్ల మళ్లీ చంద్రబాబునాయుడే సీఎం కావాలన్నది మెజారిటీ టీడీపీ శ్రేణుల ఆకాంక్ష.

అయితే, జనాకర్షణ-కులబలం విషయంలో, చంద్రబాబు కంటే పవన్ శక్తివంతుడన్నది జనసైనికుల వాదన. జగన్‌ను గద్దెదింపటం జనసేనకు ఎంత అవసరమో, టీడీపీకీ అంతే అవసరమన్నది జనసేన సీనియర్ల విశ్లేషణ. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలను సమంగా పంచుకుని, పవన్‌ను సీఎంగాPawan-Kalyan-Novotel ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. తొలి ఎన్నికల్లో పవన్ సాయంతో.. చంద్రబాబు సీఎం అయినందున, ఈసారి ఆ అవకాశాన్ని పవన్‌కు ఇవ్వాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంలో జనసైనికుల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీతో పొత్తు లేకుండా చూడాలని, ఒకవేళ పొత్తు కుదిరినా కాపులు, టీడీపీ అభ్యర్ధులకు ఓటు వేయరన్నది వారి అభిప్రాయం. గుంటూరు-కృష్ణా-ప్రకాశంలో కాపు,బలిజలు టీడీపీకి ఓటు వేయరన్నది వారి వాదన. అయితే, రెండు పార్టీలూ కలిస్తే అధికారం ఖాయమని, జనసేనలోని మరో వర్గం వాదిస్తోంది. తమకు 175 స్థానాల్లో, సరైన అభ్యర్ధులు దొరకడం కష్టమని ఖరాఖండీగా చెబుతున్నారు. అందుకే మధ్యేమార్గంగా బాబు-పవన్ చెరి రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని, కాపు నేత హరిరామజోగయ్య వంటి నేతలు సూచిస్తున్నారు. తటస్థంగా ఉన్న జనసేన నేతలు కూడా ఇదే ఫార్ములా బెటరంటున్నారు.

అటు టీడీపీలోనూ ఇలాంటి భావనే వ్యక్తమవుతోంది. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పవన్‌తో, పొత్తు కత్తిమీద సామేనని టీడీపీలోని ఒక వర్గం వాదిస్తోంది. పైగా ఆయనపై చిరంజీవి ప్రభావం కూడా ఉన్నందున, చివరి వరకూ ఆయన టీడీపీతో ఉంటారో లేదో చూడాలంటున్నారు. సీఎం జగన్‌తో చిరంజీవి సన్నిహితంగా ఉన్నందున, ఆయన ద్వారా పవన్‌పై ఒత్తిడి తీసుకువస్తే.. పరిస్థితి ఏమిటన్నది టీడీపీలోని ఒక వర్గం వాదన. పవన్‌ను మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా, చిరంజీవి ఖండించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

పెద్దగా యంత్రాంగం, గట్టి అభ్యర్ధులు లేని జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే అది వైసీపీకి లాభిస్తుందన్నది, వారి మరో ఆందోళన. కాబట్టి జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత, పవన్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వవచ్చన్నది వారి సూచన. గుంటూరు-కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కాపులకు.. కమ్మవర్గం ఓటు వేయడం కష్టమన్నది వారి మరో వాదన.

అయితే.. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో, జనసేనతో పొత్తు అనివార్యమని టీడీపీలోని మరో వర్గం వాదిస్తోంది. దాదాపు 60 నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం, మరో 20 నియోజకవర్గాలకు పైగా కాపు-కమ్మ ప్రభావం ఉన్నందున, రెండు పార్టీలూ కలిస్తేనే లాభమని విశ్లేషిస్తున్నారు. పైగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువతపై, పవన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు పరిపాలనాదక్షుడన్న పేరు- కులబలం- మేధావులు-తటస్థుల మద్దతు ఉన్నప్పటికీ.. ఆయనకు పవన్ స్థాయిలో, జనాలను ఆకర్షించే శక్తి లేదని గుర్తు చేస్తున్నారు. ఈ వాస్తవ పరిస్థితులు విశ్లేషిస్తే.. టీడీపీ-జనసేన కలవడం తప్పనిసరి అని, టీడీపీలోని ఓ వర్గం స్పష్టం చేస్తోంది.

అధికారికంగా ఇంకా పొత్తు బంధం ఖరారు కాకముందే.. సీఎం సీటుపై పెనుగులాట ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది. పైస్థాయిలో బాబు-పవన్‌కు దానిపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ, కిందిస్థాయిలో ఇరు పార్టీ నేతలు చేసే భావోద్వేగ ప్రకటనలు.. ఎక్కడ పొత్తు పుట్టిముంచుతాయన్న ఆందోళన, రెండు పార్టీలోనూ తొంగిచూస్తోంది.

LEAVE A RESPONSE