– రంపచోడవరం సాక్షిగా ఎన్టీఆర్ ట్రస్ట్ మానవత!
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆ కొండకోనల మధ్య, ప్రకృతి ఒడిలో సేదతీరే అమాయక గిరిజనుల చెంతకు ఒక చల్లని ఆత్మీయత చేరుకుంది. కేవలం ఒక నాయకురాలిగానో, ఒక ట్రస్ట్ అధినేతగానో కాకుండా.. తనవారి కష్టాలను తీర్చే ఒక కుటుంబ సభ్యురాలిగా నారా భువనేశ్వరి గారు రంపచోడవరం మారుమూల ప్రాంతాల్లో పర్యటించారు.
గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ‘కొమ్ము నృత్యం’తో ఆదివాసీలు తమ సంప్రదాయ పద్ధతిలో భువనేశ్వరి గారికి ఘనస్వాగతం పలికారు. ఆ నవ్వులు, ఆ పలకరింపులు చూస్తుంటే రాజకీయాలకు అతీతంగా ఒక ఆత్మీయ బంధం అక్కడ వెల్లివిరిసింది. ఆ కోలాహలం మధ్య ఆమె ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న తీరు అక్కడున్న వారిని కదిలించింది.
ఆరోగ్యమే మహాభాగ్యం.. ముంగిటకే మెగా వైద్య శిబిరం
జీఎస్ఎల్, జీఎస్ఆర్ ఆసుపత్రుల సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ముద్దాడారు.
కేవలం పరీక్షలే కాదు, అత్యవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేస్తామన్న ఆమె హామీ గిరిజనులకు కొండంత అండగా నిలిచింది.
న్యూట్రిఫిల్ ద్వారా మధుమేహం, జీవనశైలి మార్పులపై డాక్టర్లతో చర్చించి ప్రజలకు అవగాహన కల్పించారు.
తమ 29 ఏళ్ల ప్రయాణంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అందించిన సేవలను భువనేశ్వరి గారు వివరిస్తుంటే, ఆ మాటల్లో ఒక తృప్తి కనిపించింది:
“అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో, చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల అవసరాలు తీర్చడమే మా లక్ష్యం. ట్రస్ట్ పై ప్రజలు ఉంచిన నమ్మకమే మా బలం” అని చాటారు.
సేవా పథంలో మైలురాళ్లు:
* రక్తదానం: 4 బ్లడ్ బ్యాంకుల ద్వారా దాదాపు 9.18 లక్షల మందికి ప్రాణదానం.
* ఆరోగ్యం: 16,365 హెల్త్ క్యాంపులు.. 22 లక్షల మందికి పైగా ఉచిత వైద్యం.
* విద్య: 2,113 మంది అనాథ పిల్లలకు విద్యాబుద్ధులు, స్కాలర్షిప్పులు.
మొత్తం 12 రకాల వైద్య సేవలను ప్రారంభించిన ఆమె, గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ఇంటా ఆరోగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. మారుమూల ప్రాంతాలకు సైతం 2,083 మొబైల్ క్యాంపుల ద్వారా వైద్యం అందించడం అనేది సామాన్య విషయం కాదు. అది కేవలం ఒక ట్రస్ట్ బాధ్యత మాత్రమే కాదు.. తనవారనే మమకారమే కారణం.
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన భువనేశ్వరి గారు, ఆ మహనీయుడు కన్న కలలను నిజం చేస్తూ, నిరుపేదల కళ్లలో ఆనందం చూస్తూ తన ప్రయాణాన్ని కొండా కోనల్లో కూడా కొనసాగిస్తున్నారు.