తనలో తాను కూరుకుపోయాడు;
మనిషి
తాను తనలోకి కుంచించుకుపోయాడు.
తన తలపుల్లో, తన మాటల్లో,
తన చింతనల్లో, తన చింతల్లో,
తన అభిప్రాయాల్లో,
తాను అనుకోవడంలో
తన తీరులో, తన జోరులో
కూరుకుపోయాడు,
మనిషి
కుంచించుకుపోయాడు.
భావాన్ని చేరలేక భాషలో,
కవిత్వాన్ని చేరలేక వాక్యాల్లో,
సంగీతాన్ని చేరలేక శబ్దంలో,
హితాన్ని చేరలేక మతంలో
విషయాన్ని చేరలేక వాదంలో,
అర్థాన్ని చేరలేక అనర్థంలో,
ఆనందాన్ని చేరలేక అలజడిలో
కూరుకుపోయాడు;
మనిషి
కుంచించుకునిపోయాడు.
నిలబడాల్సిన అతడి తల వాలిపోయింది;
నుంచోవాల్సిన అతడి తనువు వంగిపోయింది.
ఇజాన్ని ఎక్కించుకున్నాడు;
నిజానికి అతడిలో చోటులేదు.
కులాన్ని పూసుకున్నాడు;
కుళ్లును అతడు కడుక్కోవడం లేదు.
దేన్నో ఎక్కడి దాన్నో
ఒంటపట్టించుకున్నాడు;
తనదైన దానికి తానే
మంటపెట్టేసుకున్నాడు.
తనలో తాను కూరుకుపోయాడు;
మనిషి
తాను తనలోకి కుంచించుకుపోయాడు.
తనంత తానుగా కృశించిపోయాడు;
మనిషి
తనవల్ల తాను తనను కోల్పోయాడు.
తాను అనే ఊబిలో
మనిషి
తనను తడుముకుంటున్నాడు.
– రోచిష్మాన్
9444012279