Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్యకేసులో వేళ్లన్నీ మీ వైపు, మీ శ్రీమతివైపే చూపిస్తున్నాయి

-వివేక హత్య వెనుక పెద్దకుట్ర దాగి ఉంది
– సీబీఐ పిటిషన్ లోని అంశాలపై ముఖ్యమంత్రి ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారు?
– తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య

వివేకానందరెడ్డి హత్యకేసుకి సంబంధించి ముఖ్యమంత్రి అడుగడుగునా అబద్ధాలు చెబుతున్నారంటూ… వివేకానందరెడ్డి హత్యకేసుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏం సంబంధమో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటుచేసిన వర్ల మాట్లాడుతూ… ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక కూడా అబద్ధాలపరంపర కొనసాగిస్తున్నారని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఎందుకిలా చేస్తున్నారని ఎవరైనా ఆలోచిస్తే, వివేకాను చంపిన వ్యక్తులు ముఖ్యమంత్రిగారికి అత్యంత ఆప్తులని స్పష్టమవుతోంది. వారిని రక్షించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడని తంటాలు లేవు, ఎక్కని మెట్లులేవు, మొక్కని దేవుడు లేడు. సీబీఐ 2023, మే 26 వ తేదిన హైకోర్ట్ లో దాఖలుచేసిన పిటిషన్ లో వివేకాహత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసునని, ఈ హత్యవెనుక విశాలమైన కుట్రదాగి ఉందని చెప్పింది.

సీబీఐ పిటిషన్ లోని అంశాలపై ముఖ్యమంత్రి ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి తనకేం తెలియదన్నట్లు బుకాయిస్తారు. సీబీఐ చెప్పిన విశాలమైన కుట్ర ఏమిటో, వివేకాహత్య ఎందుకు జరిగిందో, దానివెనక ఎవరున్నారో తెలుసుకోవడానికి 5కోట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివేకాహత్యతో మీకు ఎలాంటి సంబంధంలేదని చెప్పగలరా? వివేకా హత్యకేసులో వేళ్లన్నీ మీ వైపు, మీ శ్రీమతివైపే చూపిస్తున్నాయి.
ఇప్పటికైనా మీరు పెదవి విప్పి భావితరాలకు ఆదర్శంగా నిలవండి. వివేకాహత్యలో మీ ప్రమేయాన్ని సీబీఐ కోర్టు చెప్పాక కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడం కాదా. వివేకాహత్య కేసులో సీబీఐ విచారణపై ప్రజలు పెదవివిరుస్తున్నారు.

ఈ కేసు విచారణను కడపలోని సబ్ ఇన్ స్పెక్టర్ కు అప్పగించి ఉంటే, నిందితులంతా ఈపాటికే ఊచలు లెక్కపెడుతుండేవారు అని చెప్పుకుంటున్నారు. అవినాశ్ రెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ వస్తే పండగ చేసుకుంటారా? బెయిల్ వస్తే నిర్దోషులు అవుతారా? బాణసంచాకాల్చి స్వీట్లు తినిపించుకుంటారా? 11 కేసుల్లో మీరు బెయిల్ పై ఉన్నారు ముఖ్యమంత్రిగారు, వాటిలో మీకు బెయిల్ వస్తే మీరు నిర్దోషి అవుతారా? అనే ప్రశ్నలు సంధించారు.

LEAVE A RESPONSE