– మరణాల్లో 60.2% పురుషు లు.. 39.8% మహిళలు
– ఏపీలో తగ్గిన జననాలు 40,922
– పెరిగినవన్నీ కొవిడ్ మరణాలు కాదు
– సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం-2020 వెల్లడి
ప్రపంచాన్ని మృత్యువాతతో భయపెట్టిన కరోనా కాలంలో పుట్టేవారి సంఖ్య తగ్గి, చనిపోయిన వారి సంఖ్యనే ఎక్కువట. అందులోనూ పురుషుల సంఖ్యనే ఎక్కువట. అయితే ప్రపంచదేశాలతో పోలిస్తే మిగిలిన దేశాలతో పోలిస్తే మనదేశంలో మరణాల సంఖ్య తక్కువ. ఈ లెక్కలన్నీసివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం-2020 అనే సంస్థ తేల్చింది. ఆ ముచ్చటేదో చూద్దాం రండి.
కొవిడ్ కాలంలో 2019తో పోలిస్తే దేశవ్యాప్తంగా 4,74,806 మేర మృతుల సంఖ్య పెరిగిందని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం-2020 వెల్లడించింది. మరణాల్లో 60.2% పురుషులవికాగా, 39.8% మహిళలవి ఉండగా, జననాల్లో ఈ నిష్పత్తి 51.88%, 48.11%మేర నమోదైనట్లు పేర్కొంది. మరణాల రేటు పెరిగి జననాల రేటు తగ్గిందని ప్రకటించింది.
కొవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా మరణాలు పెరగ్గా.. జననాలు తగ్గాయి.కేంద్ర జనగణన విభాగం
మంగళవారం విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం-2020 ప్రకారం 2019తో పోలిస్తే దేశవ్యాప్తంగా 4,74,806 మరణాలు పెరగ్గా, 5,98,442 మేర జననాలు తగ్గినట్లు వెల్లడైంది.2019లో దేశంలో 76.4 లక్షల మరణాలు నమోదుకాగా 2020లో ఆ సంఖ్య 81.2 లక్షలకు చేరింది.
ఏడాదిలో 6.2%మేర మరణాలు పెరిగాయి. ఇదే సమయంలో జననాలు 2.48 కోట్ల నుంచి 2.42 కోట్లకు(-2.41%) తగ్గాయి.మరణాల్లో 60.2% పురుషులవికాగా, 39.8% మహిళలవి ఉండగా, జననాల్లో ఈ నిష్పత్తి 51.88%, 48.11%మేర నమోదైంది.
ఆంధ్రప్రదేశ్‌లో…2019తో పోలిస్తే 2020లో జననాలు 40,922 మేర తగ్గగా, మరణాలు 53,528 మేర పెరిగాయి. మృతి చెందిన 21 రోజుల్లోపు 4,12,468 మరణాలు నమోదుకాగా, 21 నుంచి 30 రోజుల్లోపు 10,098, 30 రోజుల నుంచి ఏడాదిలోపు 21,408, ఏడాది తర్వాత 11,026 నమోదయ్యాయి.
పూర్తిస్థాయి తనిఖీ చేయకుండా జనన, మరణాలను మోసపూరితంగా నమోదు చేసినందుకు డిస్ట్రిక్ రిజిస్ట్రార్స్‌కి షోకాజ్ నోటీసులు జారీచేశారు. 2020లో మరణించిన వారిలో 45%మందికి తుదిశ్వాస విడిచే సమయంలో వైద్యసేవలు అందుబాటులో లేవు.
దేశంలో 2019తో పోలిస్తే 2020లో మరణాలు పెరిగాయని, అయితే ఇవన్నీ కొవిడ్ మరణాలు కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకేపాల్ మీడియాతో పేర్కొన్నారు.ఈ సంఖ్య 2018తో పోలిస్తే 2019లో ఇంకా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.
2018తో పోలిస్తే 2019లో 6.9 లక్షల మరణాలు పెరిగినట్లు గుర్తు చేశారు. అందువల్ల 2020లో మరణాల్లో అసాధారణ వృద్ధి ఏమీ కనిపించలేదని విశ్లేషించారు. ఇందులో సహజ మరణాలతో పాటు, విభిన్నమైన అనారోగ్య కారణాలతో సంభవించినవీ ఉన్నాయన్నారు.
2020లో అధికారికంగా 1.49లక్షల కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అయితే పెరిగిన 4.74 లక్షల మరణాలన్నింటినీ కొవిడ్ మరణాలుగా పేర్కొనడానికి వీల్లేదన్నారు.
భారత్‌లో కొవిడ్ మరణాలు వాస్తవంకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు వాస్తవ గణాంకాలు అందుకు భిన్నమైన విషయాన్ని బయటపెట్టాయని, మోడలింగ్‌పై ఆధారపడి లెక్కలు కట్టే సంస్థలు ఇప్పటికైనా వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. సో.. కరోనా కాలంలో చోటుచేసుకున్న మరణాలన్నీ కరోనాచావులు కాదన్నమాట!