-రంగారెడ్డి జిల్లా ప్రీబిడ్ సమావేశానికి అద్భుత స్పందన
-శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి మీటింగ్ హాల్ లో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్ కి వంద మందికి పైగా హాజరు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, గండిపేట, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఉన్న ల్యాండ్ పార్సిల్స్ అమ్మకాలపై మంగళవారం జరిగిన ప్రీ బిడ్ సమావేశానికి అద్భుత స్పందన లభించింది. శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి జోనల్ ఆఫీస్ మీటింగ్ హాల్ లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ( హెచ్ఎండిఏ) నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరయ్యారు.
హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈఓ) కె.గంగాధర్, రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో) కె.చంద్రకళ, గండిపేట్ మండలం తహసీల్దార్ రాజశేఖర్ తదితరులు ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వ్యక్తులు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ల్యాండ్ పార్సిల్స్ కొనుగోలుకు ఆసక్తి కనబస్తు వారి సందేహాలపై అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.
రంగారెడ్ది జిల్లాలో ల్యాండ్ పార్సిల్స్ గండిపేట మండలంలో మూడు(3), శేరిలింగంల్లి మండలంలో ఐదు(5), ఇబ్రాహీంపట్నం మండలంలో రెండు(2) చోట్ల ఉన్నాయి. వీటిపై ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. మార్చి ఒకటో తేదీన ఈ ల్యాండ్ పార్సిల్స్ ను ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేలం ద్వారా హెచ్ఎండిఏ విక్రయించడానికి సన్నాహాలు చేస్తున్నదని హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సిలో రిజిస్ట్రేషన్(నమోదు) చేసుకోవాలని, రిజిస్టర్ అయిన వారందరూ మరుసటి రోజు ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల గడువు లోపు నిర్దేశించిన ఈఎండి (ధరావత్తు) రుసుమును చెల్లించాలని వివరించారు.