సోముపై కమలదళం తిరుగుబాటు

– విజయవాడలో భేటీ అయేందుకు రంగం సిద్ధం చేసిన బీజేపీ సీనియర్లు
– సోముతో తాడో పేడోకు సిద్ధపడ్డ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు
– సమాచారం తెలిసి రంగంలోదిగిన జాతీయ నేత శివప్రకాష్‌జీ
– 26న తానే విజయవాడ వస్తానని సమాచారం
– దానితో మంగళవారం సమావేశం వాయిదా వేసిన సీనియర్లు
– ఇప్పటికి మూడోసారి వాయిదా వేసిన అసమ్మతి వర్గం
– వీర్రాజు ఉంటే పనిచేసేది లేదంటున్న 200 మంది నేతలు
– శివప్రకాష్‌జీ నుంచి స్పష్టమైన హామీ వస్తేనే పనిచేస్తామని స్పష్టీకరణ
– వీర్రాజు ఉంటే తమకు వివిధ క్షేత్రాలకు బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్‌
– సంతకాల సేకరణలో సీనియర్ల బిజీ
– ఏపీ కమలంలో అసమ్మతి కలకలం
( మార్తి సుబ్రహ్మణ్యం)

క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో అదే క్రమశిక్షణ కట్టుతప్పుతోంది. అది ముదురి ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిపైనే తిరుగుబాటు జెండా ఎగురవేసే స్థాయికి చేరటం పాన్టీ నాయకత్వాన్ని కలవరపరుస్తోంది.somu జాతీయ నాయకత్వం ఏపీని పట్టించుకోని నిర్లక్ష్యానికి, ఏపీలో పార్టీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి. రాష్ట్ర నాయకత్వం-క్యాడర్‌ మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతున్నా.. పట్టించుకోని జాతీయ నాయకత్వ నిర్లక్ష్యం ఫలితంగా, జాతీయ కార్యవర్గ సభ్యుడయిన కన్నా లక్ష్మీనారాయణ పార్టీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా కన్నా బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

sivaprkashjiకన్నా పార్టీ కార్యకర్తలతో సమావేశమయి, భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకునే రోజున, జాతీయ అధ్యక్షుడు నద్దా రంగంలోకి దిగి బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. అలా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే.. బీజేపీ నాయకత్వ నత్తల వైఖరి భరించలేక, మరికొందరు నిష్ర్కమించే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలను జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ వారించటంతో, సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగిస్తే, తాము పార్టీలో పనిచేయలేమంటూ దాదాపు 200 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు విజయవాడ కేంద్రంగా ఓ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ సమాచారం తెలిసిన పార్టీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ, తొందరపడవద్దని వారిని బుజ్జగించారు. ఈనెల 26న తానే విజయవాడ వస్తున్నానని, అక్కడే మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో మంగళవారం విజయవాడలో జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.

నిజానికి అసమ్మతి నేతలు.. ఇప్పటికి రెండుసార్లు సమావేశానికి ప్రయత్నించగా, రెండుసార్లు జాతీయ నాయకత్వ హామీతో వాయిదా పడ్డాయి. ఇది ముచ్చటగా మూడోసారి. అయితే, ఈసారి శివప్రకాష్‌జీ సమక్షంలో జరిగే సమావేశంలో, తాడో పేడో తేల్చుకోవాలని అసమ్మతి నేతలు పట్టుదలతో ఉన్నారు. ‘మమ్మల్ని కేవలం బుజ్జగించి సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసేందుకు ఆయన వస్తున్నారా? లేక నిజంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే లక్ష్యంతో వస్తున్నారా అనేది తేలిపోతుంది. అందుకే ఆయన మాట మీద గౌరవంతో మేం సమావేశం వాయిదా వేసుకుని, శివప్రకాష్‌జీ కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఓ జిల్లా మాజీ అధ్యక్షుడు చెప్పారు.

అసలు ఏపీపై పార్టీ నాయకత్వానికి సీరియస్‌నెస్‌ ఉందా? లేదా? వైసీపీపై పార్టీ వైఖరి ఏమిటి? సోము వీర్రాజును కొనసాగించడంలో నాయకత్వం వైఖరి ఏమిటి? అనే మూడు ప్రధాన ప్రశ్నల ప్రాతిపదికగా, 26న శివప్రకాష్‌జీ భేటీ ఉండబోతోందని సీనియర్లు చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ నిష్ర్కమణతో, పార్టీలో తొలి నుంచి పనిచేస్తున్న నేతలు కూడా, పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే మీమాంసలో పడ్డారు.

బీజేపీలో కొనసాగితే ఎప్పటికీ భవిష్యత్తు ఉండదని, కనీసం ఇతర పార్టీల్లో చేరితే భవిష్యత్తులో కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్లు అయినా కావచ్చన్న ఆలోచన, బీజేపీ నేతల్లో మొదలయింది. బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచి పనిచేస్తున్న వారిలో సైతం, ఇలాంటి ఆలోచన రావడం ప్రమాదమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర స్థాయి నేతలకు తాము ప్రజాప్రతినిధులు కావాలన్న కోరిక ఉన్నప్పటికీ, అది బీజేపీలో ఉంటే నెరవేరడం అసాధ్యమన్న భావనకు వచ్చారు. ప్రధానంగా ఎవరితో పొత్తు లేకుండా ఉంటే, తమ రాజకీయ భవిష్యత్తు ఇంకా నిరాశాజనకంగా ఉంటుందన్న అభిప్రాయం బలపడుతోంది.

కాగా.. దాదాపు 35 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం 60మంది సంతకాల లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు సమాచారం. వీర్రాజును అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని నాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. దానిబదులు తమను, వివిభధ క్షేత్రాలకు బాధ్యతలు అప్పగించాలని వీరంతా నాయకత్వాన్ని కోరుతున్నారు. ‘మేం పార్టీలొనే ఉంటాం. కానీ సర్పంచ్‌ ఎన్నికల్లో కూడా గెలవలేని వీర్రాజుతో పనిచేయలేం. అందుకే మాకు వివిధ క్షేత్రాల్లో బాధ్యతలు ఇవ్వమని నాయకత్వాన్ని కోరుతున్నాం’ అని ఓ నేత చెప్పారు.

madhukarreddyఏపీ బీజేపీలో బలం తక్కువ-నేతల గొడవలెక్కువన్న భావన జాతీయ నాయకత్వంలోనూ లేకపోలేదు. వైసీపీతో స్పష్టమైన వైఖరి ప్రకటించేందుకు కావలసిన ప్రత్యామ్నాయం పార్టీకి కనిపించడం లేదంటున్నారు. రాష్ట్ర ఇన్చార్జి మురళీధరన్‌ రాష్ర్టానికి రాకపోవడం, కో ఇన్చార్జి సునీల్‌ దియోథర్‌ ఏకపక్ష వైఖరి, సంఘటనామంత్రి మధకర్‌రెడ్డి వైఫల్యం, సోము వీర్రాజు నాయకత్వలోపం కారణంగా.. ఏపీలో పార్టీని ఏ దిశగా నడిపించాలో తెలియని అయోమయ పరిస్థితిలో నాయకత్వం ఉంది.

వీరందరి వైఫల్యం కారణంగానే కన్నా పార్టీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చిందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. గతంలో కన్నాతో మాట్లాడిన శివప్రకాష్‌జీ కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంవల్లే కన్నా తన దారి తాను చూసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మాస్‌ లీడర్‌ అయిన కన్నాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా, తనంతట తానే వెళ్లేలా చేయడంలో నలుగురైదుగురు సక్సెస్‌ అయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పట్టుమని పదిమందిని తీసుకువచ్చే స్థాయి లేకపోయినా.. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేని వారంతా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల హోదాలో ఉండటం బీజేపీకి మైనస్‌ పాయింటని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

వీరే పార్టీని శాసస్తూ, జాతీయ నాయకత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నారన్న ఫిర్యాదు లేకపోలేదు. దీనితో నాయకత్వం కూడా ఏపీపై దృష్టి సారించడ ం సమయం వృధా చేసుకోవడమేనన్న భావనకు వచ్చిందంటున్నారు.ఎలాగూ వైసీపీ కేంద్రానికి మద్దతునిస్తోంది. అటు టీడీపీ కూడా బీజేపీ పట్ల సానుకూలంగానే ఉంది. దానితో ఎవరు అధికారంలోకి వచ్చినా, బీజేపీకి అనుకూలంగా ఉండాల్సిందేనన్న ధీమానే, ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడానికి కారణమని సీనియర్లు అసలు విషయం స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply