– రాజకీయ లబ్ధి కోసమే జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన
– శాస్త్రీయ ప్రమాణాలు పక్కన పెట్టి వార్డుల విభజన రాజ్యాంగ విరుద్ధం
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేస్తోందని ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్సీలు డా. దాసోజు శ్రవణ్ , వాణీదేవి , ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , ముఠా గోపాల్, పలువురు కార్పొరేటర్లు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్మా ట్లాడుతూ— కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజా పాలన” అనే మాటలను ముసుగుగా ఉపయోగించి, వాస్తవానికి పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమే జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన చేపట్టిందని ఆరోపించారు. జనాభా ప్రమాణాలు, భౌగోళిక సమతుల్యత, సాంకేతిక అధ్యయనాలు వంటి కీలక అంశాలను పక్కన పెట్టి, ఇష్టానుసారంగా వార్డుల సంఖ్య పెంచడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ఘోర దాడిగా అభివర్ణించారు. జీహెచ్ఎంసీ యాక్ట్‌తో పాటు స్థానిక సంస్థల రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌కు ప్రజాభలం, పట్టుబలం లేకపోవడంతో, బ్యాక్‌డోర్ రాజకీయాల ద్వారా కార్పొరేషన్‌ను స్వాధీనం చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ ప్రక్రియకు పాల్పడ్డారని తెలిపారు. ఇది ప్రజా పాలన కాదు, స్పష్టమైన రాజకీయ ప్రతీకార పాలన అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో రాజ్యాంగబద్ధమైన విధానాలు పాటించకపోతే తప్పనిసరిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా, నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ తీసుకునే ఏ నిర్ణయాన్నీ బీఆర్ఎస్ అంగీకరించదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీరూల్స్కు అనుగుణంగా, అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి, ప్రజల ప్రయోజనాలను కేంద్రీకరించి మాత్రమే వార్డుల పునర్విభజన జరగాలని డిమాండ్ చేశారు.