– ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్: కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ‘ఇంక్యూబేషన్’ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలనే లక్ష్య సాధనలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్ ‘వన్ హబ్’కు దీటుగా ఈ కేంద్రాలను తీర్చి దిద్దుతామన్నారు. బుధవారం టీ హబ్ లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. మేం స్టార్టప్ లను కేవలం చిన్న కంపెనీలుగా మాత్రమే చూడటం లేదని, సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందిస్తూ… కొత్త ఉద్యోగాలను సృష్టించే ‘ఎకనామిక్ ఇంజిన్స్’గా చూస్తున్నామన్నారు. 2024 లో ఇక్కడి స్టార్టప్‌లు 571 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయన్నారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 160 శాతం అధికమని వివరించారు. ముఖ్యంగా హెల్త్ టెక్ రంగంలో 2,139 శాతం వృద్ధి నమోదయ్యిందన్నారు.
మహిళా నేతృత్వంలోని స్టార్టప్‌లలో హైదరాబాద్ దేశంలోనే ఆరో స్థానంలో ఉందన్నారు. 531 వుమెన్ లెడ్ స్టార్టప్ లు 417 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయన్నారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, తమ ప్రభుత్వ పనితీరుకు, ప్రగతిశీల విధానాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.
తమ ప్రభుత్వం టెక్నాలజీని కేవలం టూల్ గా మాత్రమే చూడటం లేదని, ఒక సమానత్వ సాధనంగా చూస్తోందన్నారు. టెక్నాలజీ ఫలాలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అందేలా చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. స్టార్టప్ లు, కొత్త ఆలోచనలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రూ.వేయి కోట్లతో ‘ఫండ్ ఆఫ్ ఫండ్’ను అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యువ ఆవిష్కర్తలకు హామీ ఇచ్చారు.